Begin typing your search above and press return to search.

వైసీపీ చాన్స్ ఇస్తున్నా టీడీపీ అందుకోవట్లేదే....?

By:  Tupaki Desk   |   18 July 2023 8:55 AM GMT
వైసీపీ చాన్స్ ఇస్తున్నా టీడీపీ అందుకోవట్లేదే....?
X

తెలుగుదేశం పార్టీ ఏపీలో బలమైన ప్రతిపక్ష పార్టీ. ఆ పార్టీ మరోసారి అధికారం దక్కించుకోవాలని చూస్తున్న పార్టీ. ప్రస్తుతం నడుస్తోంది ఎన్నికల సీజన్. 2024 సార్వత్రిక ఎన్నికలకు కొద్ది నెలల సమయం మాత్రమే ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో టీడీపీ ఎంతలా దూకుడు ప్రదర్శించాలి అన్నది ఇక్కడ కీలకమైన ప్రశ్న.

టీడీపీకి ఏ చిన్న అవకాశం దొరికినా విరుచుకుపడాల్సిన పరిస్థితి ఉంది. కానీ ఏపీలో వైసీపీ తప్పులు ఎన్నో చేస్తోంది. పాలనాపరంగా అనేక లోపాలు ఉన్నాయి. వాటి మీద జనంలోకి వెళ్లడంలో టీడీపీ తడబడుతోంది. అది అలా పక్కన పెడితే వైసీపీలో లుకలుకలు కాస్తా పెరిగి పెద్దవి అయ్యాయి. అవి చాలా చోట్ల కీచులాటల స్థాయి నుంచి పెరిగి పెద్దవై పోయాయి.

ఇక కుమ్ములాటలుగా మారిపోయాయి. సొంత పార్టీలో వర్గ పోరు ఉంది. నేతల మధ్య గొడవలు పెరిగాయి. ఒకరికి ఒకరు వెన్నుపోటు పెడుచుకునే పరిస్థితి ఉంది. ఈ నేపధ్యం ఒక్కసారి చూస్తే ఏకంగా నలభై నియోజకవర్గాలలో కనిపిస్తోంది. దాదాపు ప్రతీ చోటా వైసీపీ వారికి వైసీపీనే శత్రువుగా మారిపోయిన సందర్భం కనిపిస్తోంది.

ఉమ్మడి విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలలో అనేక నియోజకవర్గాలలో వైసీపీ నేతల మధ్య విభేదాలు బాహాటంగా ఉన్న్నాయి. అలాగే ఉమ్మడి కడప, నెల్లూరు, క్రిష్ణా, గుంటూరు జిల్లాలలో చూస్తే వైసీపీ నేతల మధ్య భయంకరమైన ఫైటింగ్ సాగుతోంది. ఎమ్మెల్యేలను చూస్తే ఎమ్మెల్యేలను పడదు, ఒకరి నియోజకవర్గాలలో మరొకరు జోక్యం పెరిగి అది అతి పెద్ద పోరుకు దారితీస్తోంది.

అలాగే మంత్రులకు ఎమ్మెల్యేలకు పడదు, నాయకులకు మంత్రులకు పడదు, ఇలా చాలా గందరగోళంగా పరిస్థితులు అనేక జిల్లాలలో వైసీపీలో కనిపిస్తుంది. ఇంకో వైపు చూస్తే మరింత దారుణంగా విభేదాలు పాకి ఉన్నాయి. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా జగ్గంపేటలో వైసీపీ నేతలే జుట్టు పట్టుకుని రోడ్ల మీదకు వచ్చిన పరిస్థితి ఉంది.

అదే విధంగా చూస్తే ఇదే తూర్పు గోదావరి జిల్లాలోని రామచంద్రాపురంలో అయితే రెండు వర్గాలు ఎంపీ వర్సెస్ మంత్రి అన్నట్లుగా బాహాటంగానే కత్తులు దూసుకుంటున్న నేపధ్యం ఉంది. ఇక కడపలో రాజంపేటలో సీన్ అలాగే ఉంది. గుంటూరు జిల్లాలో చూసుకుంటే తూర్పులో సిట్టింగ్ ఎమ్మెల్యే వర్సెస్ ఆశావహుల మధ్య భారీ పోరు సాగుతోంది.

అలాగే వెస్ట్ లో టీడీపీ నుంచి వైసీపీలోకి వచ్చిన ఎమ్మెల్యేకు యాంటీగా పొగపెడుతున్న నేపధ్యం ఉంది. ఉమ్మడి క్రిష్ణా జిల్లాలలో పెడన, కైకలూరు, మైలవరం వంటి నియోజకవర్గాలలో పోరు ఒక రేంజిలో వైసీపీలో సాగుతోంది. అలాగే శ్రీకాకుళం జిల్లాలో పలాసాలో ఏకంగా మంత్రికి యాంటీగా గ్రూప్ ని కట్టి రోడ్ల మీదకు వైసీపీ నేతలు వచ్చేసారు.

ఇక ఇదే జిల్లాలోని పాతపట్నంలో ఎమ్మెల్యే వద్దు అని రచ్చ చేస్తున్నారు. ఆమె నాన్ లోకల్ అని నినదిస్తున్నారు సొంత పర్టీ వారు. అయితే మైలవరం, పలాస వంటి చోట్ల మాత్రం టీడీపీ నాయకత్వం కొంత మేలుకుని పరిస్థితులను తమకు అనుకూలంగా మార్చుకుంటోంది కానీ మిగిలిన చోట్ల మాత్రం టీడీపీ తమ్ముళ్ళు అలాగే ఉన్నారు. మొద్దు నిద్ర వీడడం లేదు అన్న విమర్శలు ఉన్నాయి.

అధికార పార్టీ కోరి చాన్సుల మీద చాన్సులు ఇస్తోంది. టీడీపీ అధినేత చంద్రబాబు కూడా తమ్ముళ్లను అలెర్ట్ చేస్తున్నారు. డూ ఆర్ డై అన్న పరిస్థితి ఈ ఎన్నికలు అని ఎంతలా చెబుతున్నా చాలా చోట్ల తమ్ముళ్ళు ఇంకా నిస్తేజంగానే ఉన్నారని అంటున్నారు. ఈ పరిస్థితి మారకపోతే మాత్రం టీడీపీకి ఇబ్బందికరమైన వాతావరణమే ఉంటుంది అని అంటున్నారు. ఎన్నికల వేళ అధికార పార్టీని వీక్ చేసేవి అంతర్గత పోరే. వాటిని విపక్షాలు చక్కదిద్దుకుని ముందుకు సాగుతాయి. కానీ టీడీపీలో అయితే ఆ చలనం లేకపోవడమే ఆందోళన కలిగిస్తోంది అని అంటున్నారు. అందుకే అనుకున్న తీరులో టీడీపీ గ్రాఫ్ పెరగడం లేదు అని అంటున్నారు.