Begin typing your search above and press return to search.

ఫస్ట్ టైం కమ్మ వారి విషయంలో ఓపెన్ అయిన టీడీపీ

ఈ సందర్భంగా ఎర్రఓబునపల్లిలో కమ్మ సామాజిక వర్గీయులతో లోకేశ్ భేటీ అయిన నేపధ్యంలో ఈ హాట్ కామెంట్స్ చేశారు.

By:  Tupaki Desk   |   22 July 2023 9:57 AM GMT
ఫస్ట్ టైం కమ్మ వారి విషయంలో ఓపెన్ అయిన టీడీపీ
X

ఏపీ అంటేనే కులాల సంకుల సమరం. రాజకీయం ఆది నుంచి అలాగే ఉంటూ వచ్చినా గత కొన్ని దశాబ్దాలుగా అది రెక్కలు విప్పుకుని వికృత విన్యాసం చేస్తోంది. ఇక ఇటీవల కాలంలో చూస్తే మరీ బాహటం అయిపోయింది. ఎవరికైనా ఏ అవార్డు వచ్చినా కూడా ముందు వారి కులాన్ని గూగుల్ లో సెర్చ్ చేసే దౌర్భాగ్యపు ఆలోచనలు జనంలో పుడుతున్నాయి.

ఇదిలా ఉంటే కులం మతం, ప్రాంతం వర్గం, వర్ణం ఇవన్నీ రాజకీయాలకు ట్రంప్ కార్డులు ఎవరైనా ఎపుడైనా వాటిని ఒడుపుగా వారికి కావాల్సినట్లుగా వాడేసుకోవచ్చు. ఫలితాలు కూడా సానుకూలం చేసుకోవచ్చు. ఇదిలా ఉంటే ఏపీలో ఉన్న రాజకీయ పార్టీలకు కూడా కులాన్ని ఆపాదించడం ఫలానా పార్టీ ఫలనా కులం కోసం పనిచేస్తుంది అని విమర్శలు చేయడం కూడా అధికారం అయింది.

ఈ కులాల రొంపిలోకి మీడియాను కూడా తీసుకుని వచ్చేశారు. ఈ నేపధ్యంలో ఎవరు ఎంత కాదనుకున్నా ఈ కులం ఉచ్చు నుంచి బయటపడలేకపోతున్నారు పరిస్థితులు ఇంకా దిగజారిపోయేలాగానే ఉన్నాయి. ఇక ఏపీలో చూస్తే 2019 ఎన్నికల్లో ఒక కులం ఆధిపత్యం రాజకీయంగా ఎక్కువ అయింది అని ప్రచారం జరిగింది. అన్నింటా వాళ్ళే అంటూ జరిగిన ప్రచారానికి టీడీపీ భారీ మూల్యం చెల్లించుకుంది. ఇపుడు చూస్తే మరో కులానిదే ఆధిపత్యం అంటూ టీడీపీ అనుకూల మీడియా రాస్తోంది. ఇవన్నీ బహిరంగంగానే జరుగుతున్నా రాజకీయాల్లో కీలక నేతలు ఎవరూ కులం విషయంలో గట్టిగా మాట్లాడింది లేదు.

ఇక అందరి పార్టీగా ఎన్టీయార్ హయాంలో ఆవిర్భవించిన టీడీపీ కొందరు అతి ఉత్సాహం మూలంగా కొందరి పార్టీగా అనవసర బురద అంటించుకున్న క్రమంలో చాలానే కోల్పోతోంది. ఈ నేపధ్యంలో టీడీపీ ఎపుడూ తన సొంత సామాజికవర్గం గురించి గట్టిగా మాట్లాడింది లేదు.

కానీ ఫస్ట్ టైం తెలుగుదేశం భావి వారసుడు, చంద్రబాబు తనయుడు సొంత కులం మీద ఫేవర్ గా మాట్లాడుతూ కొన్ని సంచలన కామెంట్స్ చేశారు. కమ్మ కులాన్ని జగన్ టార్గెట్ చేశారు అంటూ ఆయన సీరియస్ గానే కామెంట్స్ చేశారు. ఆయన ప్రపంచ చరిత్రలో ఉన్న ఒక ఉదంతాన్ని కూడా దీనికి సరిపోల్చారు.

హిట్లర్ అప్పట్లో యూదులను టార్గెట్ చేసినట్లుగా జగన్ కమ్మ వారిని టార్గెట్ చేశారంటూ తీవ్రమైన ఆరోపణ చేశారు.ప్రకాశం జిల్లా కనిగిరి నియోజకవర్గంలో లోకేశ్ యువగళం పాదయాత్ర సాగింది. ఈ సందర్భంగా ఎర్రఓబునపల్లిలో కమ్మ సామాజిక వర్గీయులతో లోకేశ్ భేటీ అయిన నేపధ్యంలో ఈ హాట్ కామెంట్స్ చేశారు.

జగన్ హిట్లర్ మాదిరిగా కమ్మ వారి మీద కక్ష కట్టారని కూడా లోకేష్ ఆరోపించడం విశేషం.కమ్మ వారిని ఒక సామాజిక వర్గానికి బూచిగా చూపించి జగన్ రాజకీయాలు చేస్తున్నారు అని లోకేష్ అనడమూ విశేషం.

ఎన్టీయార్ హెల్త్ వర్శిటీకి పేరు మార్చడాన్ని ఆయన తప్పు పట్టారు. ఇవన్నీ చిల్లర రాజకీయాలు అని కూడా విమర్శించారు. టీడీపీ ఎపుడూ ఏ ఒక్క కులాన్ని దూషించలేదని ఆయన అంటున్నారు ఇక కులం, మతం, ప్రాంతం వర్గానికి అతీతం పేదరికం అని కూడా అన్నారు. అలాంటి పేదలందరికీ న్యాయం చేయాలన్నదే టీడీపీ విధానం అని ఆయన చెప్పుకొచ్చారు.

ఇదిలా ఉండగా కమ్మ కులాన్ని అణచివేస్తున్నారని, కుట్ర చేస్తున్నారని లోకేష్ బాహాటంగా చేసిన కామెంట్స్ మీద ఇపుడు పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది. టీడీపీలో ఎన్నో కులాల వారు ఉన్నా ప్రయారిటీ సొంత సామాజిక వర్గానిదే అన్న ఆరోపణలు ఉన్నాయి. అయితే టీడీపీ పెద్దలు ఏనాడు సొంత కులం గురించి వేదికలు ఎక్కి మాట్లాడింది లేదు

ఈ రోజున లోకేష్ ఎందుకు ఇలాంటి కామెంట్స్ చేశారు అంటే కమ్మలు నిరాశాపూరితంగా వర్తమానంలో ఉన్నారని అంటున్నారు. తెలుగుదేశం మీద వారు పెట్టుకున్న ఆశలు, రాజకీయ ధీమా ఒకింత సడలుతోంది అన్న భావన కూడా ఉంది. ఈ కీలక టైం లో ఆ పార్టీ నుంచి మీకు అండగా ఉంటాం, పోరాడుతమన్న గట్టి భరోసా ఇవ్వాల్సిన తరుణం ఇదే అని భావించే లోకేష్ ఈ విధంగా కామెంట్స్ చేశారు అని అంటున్నారు.

మరి ఏపీలో వైసీపీ ప్రభుత్వం కమ్మల మీద వివక్ష చూపిస్తోందా అంటే వారు నుంచి ఎంపీలు ఉన్నారు. ఎమ్మెల్యేలు ఉన్నారు. మూడేళ్ళ పాటు మంత్రిగా చేసిన కొడాలి నాని ఉన్నారు. రీసెంట్ గా విజయవాడ డీసీసీబీ చైర్ పర్సన్ గా ఆ సామాజిక వర్గానికి చెందిన మహిళను నియమించారు.

మరి లోకేష్ కామెంట్స్ వల్ల కమ్మ సామాజిక వర్గం పూర్తిగా పోలరైజ్ అయి టీడీపీ వైపు గతంలో మాదిరిగా మళ్ళుతుందా అన్న చర్చ వస్తోంది. లోకేష్ జగన్ మీద నేరుగా చేసిన ఈ కామెంట్స్ మీద వైసీపీ ఏమంటుందో అన్నది కూడా ఆసక్తికరంగా మారింది.