Begin typing your search above and press return to search.

బ‌స్తీమే స‌వాల్‌: ఇచ్చాపురంలో గెలుపు ఎవ‌రిది?

ఇచ్చాపురం. ఏపీకి స‌రిహ‌ద్దుల్లో ఉన్న ఉమ్మ‌డి శ్రీకాకుళం జిల్లాలోని కీల‌క‌మైన నియోజ‌క‌వ‌ర్గం.

By:  Tupaki Desk   |   27 July 2023 3:30 PM GMT
బ‌స్తీమే స‌వాల్‌: ఇచ్చాపురంలో గెలుపు ఎవ‌రిది?
X

ఇచ్చాపురం. ఏపీకి స‌రిహ‌ద్దుల్లో ఉన్న ఉమ్మ‌డి శ్రీకాకుళం జిల్లాలోని కీల‌క‌మైన నియోజ‌క‌వ‌ర్గం. ఇక్క‌డ టీడీపీకి పట్టు ఎక్కువ‌గా ఉంద‌నే ప్ర‌చారం ఉంది. ఎందుకంటే.. గ‌త మూడు ఎన్నిక‌ల్లోనూ తెలుగు దేశం పార్టీ విజ‌యం ద‌క్కించుకుంది. నిజానికి వ‌రుస‌గా మూడు సార్లు టీడీపీ గెలుస్తున్న అతి త‌క్కువ నియోజక వ‌ర్గాల్లో ఇది ఒక‌టి కావ‌డం గ‌మ‌నార్హం. 2009లో పిరియా సాయిరాజ్ టీడీపీ త‌ర‌ఫున విజ‌యం ద‌క్కించుకున్నారు.

త‌ర్వాత కాలంలో ఆయ‌న వైసీపీలోకి చేరిపోయారు. ఈ క్ర‌మంలో టీడీపీ యువ నాయ‌కుడుగా ఉన్న బెందాళం అశోక్‌కు చంద్ర‌బాబు టికెట్ ఇచ్చారు. ఆయ‌న రెండు ఎన్నిక‌ల్లోనూ 2014, 2019లో విజ‌యం సాధించా రు. ఇక్క‌డ చిత్రం ఏంటంటే.. 2009లో వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి హ‌వా ఎక్కువ‌గా ఉంది. ఆరోగ్య శ్రీ వంటి కార్య‌క్ర‌మాన్ని ఇక్క‌డ ఎక్కువ‌గా అమ‌లు చేశారు. అయిన‌ప్ప‌టికీ.. ఇక్క‌డ ప్ర‌జ‌లు టీడీపీకే ప‌ట్టం గ‌ట్టారు.

ఇక‌, గ‌త 2019 ఎన్నికల్లో వైసీపీ అధినేత జ‌గ‌న్ చేసిన పాద‌యాత్ర ప్ర‌ముఖ పాత్ర పోషించింది. ఆయ‌న దూకుడు ఎక్కువ‌గా ఉండ‌డంతో రాష్ట్ర వ్యాప్తంగా 151 నియోజ‌క‌వ‌ర్గాల్లో పార్టీ విజ‌యం ద‌క్కించుకుంది.

ఇంత దూకుడులోనూ.. ఇక్క‌డ టీడీపీనే గెలుపు గుర్రం ఎక్కింది. సో.. దీనిని బ‌ట్టి ఇచ్చాపురంలో టీడీపీ బ‌లం ఏ మేర‌కు ఉందో అర్థ‌మ‌వుతుంది. అయితే.. ఇప్పుడు వైసీపీ ఇక్క‌డ కూడా క‌న్నేసింది. ఇక్క‌డి నాలుగు మండ‌లాల్లోనూ వైసీపీ కార్య‌క్ర‌మాలు విస్తృతం అయ్యాయి.

సోంపేట‌, క‌విటి, ఇచ్చాపురం, కంచిలి మండ‌లాల్లో వైసీపీ నేత‌లు వివిధ కార్య‌క్ర‌మాలు నిర్వ‌హిస్తున్నారు. ముఖ్యంగా ఓటు బ్యాంకు ఎక్కువ‌గా ఉన‌న సోంపేట‌పై మ‌రింత ఎక్కువ‌గా దృష్టి పెట్టారు. దీంతో ఇచ్చాపురంలో ఈ సారి ర‌స‌వ‌త్త‌ర పోరు త‌ప్ప‌ద‌నే వాద‌న బ‌లంగా వినిపిస్తోంది. గ‌త ఎన్నిక‌ల్లో జ‌న‌సేన పార్టీ కూడా ఇక్క‌డ పోటీ చేసింది. అయితే.. ఈ పార్టీకి 11 వేల ఓట్లే ల‌భించాయి.

ఇక, వ‌చ్చే ఎన్నిక‌ల్లో టీడీపీ-జ‌న‌సేన క‌లిసి రంగంలోకి దిగితే.. మాత్రం ఇక్క‌డ గెలుపు ఖాయ‌మ‌ని అంటున్నారు. మ‌రోవైపు.. వైసీపీ కూడా తాము ఎంతో చేశామ‌ని.. త‌మ‌కే ఇక్క‌డి ప్ర‌జ‌లు ప‌ట్టం క‌డ‌తార‌ని చెబుతోంది. మొత్తంగా బ‌స్తీమే స‌వాల్ అంటున్న నియోజ‌క‌వ‌ర్గాల్లో ఇచ్చాపురం కూడా చేరిపోయింది. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.