Begin typing your search above and press return to search.

బాబు హయాంలో నకిలీ ఓట్లపై పెద్దిరెడ్డి సంచలన ఆరోపణలు!

అవును... చిత్తూరు జిల్లా కుప్పంలో మంత్రి పెద్దిరెడ్డి నాలుగు రోజులుగా సుడిగాల పర్యటన చేస్తున్నారు

By:  Tupaki Desk   |   21 July 2023 10:33 AM GMT
బాబు హయాంలో నకిలీ ఓట్లపై పెద్దిరెడ్డి  సంచలన ఆరోపణలు!
X

ఎన్నికలకు సమయం దగ్గరపడుతుండటంతో రాష్ట్రంలో ఓట్లపై చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. కొత్త ఓట్లు, నకిలీ ఓట్లు, దొంగ ఓట్లు... ఇలా మొదలైన చర్చలు తెరపైకి వస్తున్నాయి. ఈ సమయంలో "చంద్రబాబు హయాంలో నకిలీనోట్లు" అనే విషయంపై మంత్రి పెద్దిరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.

ఈసారి కుప్పంలో వైసీపీ జెండా ఎగరాలని, చంద్రబాబు ఎట్టి పరిస్థితుల్లోనూ ఓడించాలని జగన్ బలంగా ఫిక్సయ్యారన్ని అంటున్నారు. ఈ సమయంలో ఆ బాధ్యతను మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డికి అప్పగించారని చెబుతున్నారు. దీంతో మంత్రి కుప్పంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టినట్లు తెలుస్తుంది.

అవును... చిత్తూరు జిల్లా కుప్పంలో మంత్రి పెద్దిరెడ్డి నాలుగు రోజులుగా సుడిగాల పర్యటన చేస్తున్నారు. ఇప్పటికే కుప్పం మున్సిపాలిటీలో వార్డు బాట పూర్తి చేసిన ఆయన.. గుడుపల్లి, శాంతిపురం మండలాల్లో పల్లె బాట నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన.. వాలంటీర్లు కుప్పంలో ప్రజలకు సేవ చేస్తుంటే.. ఎమ్మెల్యేగా ఉన్న చంద్రబాబు మాత్రం హైదరాబాద్‌ లో దాక్కున్నారని దుయ్యబట్టారు.

ఈ సందర్భంగా... చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో రాష్ట్రంలో పెద్ద ఎత్తున దొంగఓట్ల నమోదు జరిగిందని మంత్రి పెద్దిరెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. 2019లో 30 వేల మెజారిటీకి పరిమితమైన చంద్రబాబుకు రాబోయే ఎన్నికల్లో లక్ష ఓట్ల మెజారిటీ ఎలా వస్తుందో చూస్తామని సవాల్ తో కూడిన స్టేట్ మెంట్ ఇచ్చారు!

ఇదే సమయంలో 2019 ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థి చంద్రమౌళి ఆసుపత్రిలో ఉన్నా కూడా 30వేల ఓట్ల తేడాతోనే ఓడిపోయారని గుర్తుచేసిన పెద్దిరెడ్డి... ఈసారి ఆయన కొడుకు ఎమ్మెల్సీ భరత్ కుప్పం నుంచి పోటీ చేస్తున్నారని, కుప్పంలో వైసీపీ విజయం ఖాయమని పెద్దిరెడ్డి చెప్పుకొచ్చారు. ఈ నియోజకవర్గానికి సంబంధించి సర్వేలన్నీ తమకు అనుకూలంగా ఉన్నాయని పెద్దిరెడ్డి తెలిపారు.

ఈ సందర్భంగా దొంగ ఓట్లపై పెద్దిరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. కుప్పంలో ఇప్పటి వరకు 17 వేల దొంగఓట్లు గుర్తించామని, మరో 25 వేలకుపైగా దొంగ ఓట్లు ఉన్నాయని తెలుస్తుందని పెద్దిరెడ్డి తెలిపారు. దీంతో... కుప్పంలో దొంగ ఓట్లు చూసిన తర్వాత రాష్ట్రంలో దొంగ ఓట్లపై దృష్టి సారించామని మంత్రి తెలిపారు.

చంద్రబాబు అధికారంలో ఉండగా నమోదైన 60 లక్షల దొంగ ఓట్లపై ఎమ్మెల్యేలను, ఎంపీలను అప్రమత్తం చేశామని.. ఈ మేరకు దొంగ ఓట్లను గుర్తించే పనిలో ఉన్నామని.. ఆధారాలతో ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశామని తెలిపారు. ఈ సందర్భంగా.. 2019 ఎన్నికలకు ముందే ఈ తంతు జరిగిందని చెప్పడం గమనార్హం.