చంద్రబాబు, పవన్ భేటీలో ఆ విషయం తేలిపోనుందా?
కాగా వచ్చే ఎన్నికల్లో పొత్తులపై ఆసక్తికర చర్చ సాగుతోంది
By: Tupaki Desk | 22 July 2023 10:29 AM GMTఆంధ్రప్రదేశ్ లో అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా దాదాపు పది నెలల సమయం ఉంది. ఈ నేపథ్యంలో అన్ని రాజకీయ పార్టీలు తమ అస్త్రశస్త్రాలకు పదునుపెడుతున్నాయి. మరోమారు అధికారం సాధించడమే లక్ష్యంగా అధికార వైసీపీ ఉరకలేస్తోంది. మరోవైపు ప్రతిపక్ష టీడీపీ, జనసేన పార్టీలు సైతం దూకుడు పెంచాయి. ప్రభుత్వంపై తీవ్ర విమర్శలతో విరుచుకుపడుతున్నాయి.
కాగా వచ్చే ఎన్నికల్లో పొత్తులపై ఆసక్తికర చర్చ సాగుతోంది. కొద్ది రోజుల క్రితం జనసేనాని పవన్ కళ్యాణ్ ఎన్డీయే సమావేశానికి ఢిల్లీ వెళ్లిన సంగతి తెలిసిందే. అక్కడ బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, కేంద్ర సహాయ మంత్రి మురళీధరన్ తదితరులను కలిసి వచ్చారు.
వచ్చే ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వ వ్యతిరేక ఓటును ఎట్టి పరిస్థితుల్లో చీలనివ్వబోనని ఇప్పటికే పవన్ కళ్యాణ్ పలుమార్లు ప్రకటించారు. జనసేన, టీడీపీ, బీజేపీ కలిసి పోటీ చేయాలని ఆయన భావిస్తున్నారు. మరోవైపు మొదట్లో బీజేపీతో పొత్తుకు అర్రులు చాచిన టీడీపీ ఇప్పుడు బీజేపీతో పొత్తుపై మీనమేషాలు లెక్కిస్తోంది. జనసేనతో కలిసి అడుగులు వేయాలని భావిస్తోంది.
ఈ నేపథ్యంలో ఒకటి రెండు రోజుల్లో టీడీపీ అధినేత చంద్రబాబు, పవన్ కళ్యాణ్ మరోసారి భేటీ కాబోతున్నారని తెలుస్తోంది. 2019 ఎన్నికల తర్వాత ఇప్పటివరకు వీరిద్దరూ రెండుసార్లు కలిశారు. విశాఖపట్నంలో పవన్ కళ్యాణ్ ను పోలీసులు అడ్డుకోవడం, ఆయన బస చేసిన హోటళ్లలో తనిఖీలు చేయడం, జనసేన నేతలను అరెస్టు చేయడం వంటి పరిణామాలు జరిగినప్పుడు విజయవాడ నోవాటెల్ హోటళ్లో చంద్రబాబు.. పవన్ ను కలసి సంఘీభావం ప్రకటించారు.
అలాగే కుప్పం పర్యటనలో చంద్రబాబుపై వైసీపీ నేతలు దాడికి ప్రయత్నించడం, టీడీపీ శ్రేణులపై రాళ్ల దాడి తదితర ఘటనలకు సంబంధించి పవన్ హైదరాబాద్ లోని చంద్రబాబు నివాసంలో ఆయనను కలిసి తన సంఘీభావం తెలిపారు. అప్పట్లో పొత్తులపై తాము ఎలాంటి చర్చలు జరపలేదని పవన్ తెలిపారు.
అయితే ఈసారి ఎన్నికలు దగ్గరకొచ్చేస్తుండటం, ఏపీ రాజకీయాల్లో ప్రస్తుతం పెరిగిన వేడి తదితర పరిణామాల నేపథ్యంలో చంద్రబాబు, పవన్ మరోమారు కలవబోతున్నారని తెలుస్తోంది. ఈ భేటీలో పొత్తులపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని అంటున్నారు. ఎన్డీయే సమావేశం వివరాలు, పొత్తులపై బీజేపీ నేతల అభిప్రాయాలను పవన్.. చంద్రబాబుకు వివరించే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. అలాగే జనసేన, టీడీపీ పొత్తులపైన చర్చించవచ్చని తెలుస్తోంది. ఒకవేళ బీజేపీ తమతో కలసి రాకుంటే ఏం చేయాలనేదానిపైనా చర్చిస్తారని టాక్.