Begin typing your search above and press return to search.

కోటం రెడ్డికి బాబు బహుమతి...వైసీపీకి సవాల్...!

రాజకీయం అంటేనే ఇది

By:  Tupaki Desk   |   26 July 2023 3:45 AM GMT
కోటం రెడ్డికి బాబు బహుమతి...వైసీపీకి సవాల్...!
X

రాజకీయం అంటేనే ఇది. ఇక్కడ ఏ బంధం శాశ్వతం కాదు, అలా అనుకుని గిరి గీసుకుంటే రాజకీయంలో ఎటూ కాకుండా పోతారు. జగన్ భక్తుడు అంటే ఈ మధ్య దాకా ముందు వరసలో నిలిచే పేర్లలో ఒకరిది వినిపిస్తుంది. ఆయనే నెల్లూరు జిల్లాకు చెందిన కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి. ఫైర్ బ్రాండ్ ఆయన.

ఆయన దూకుడు గా పాలిటిక్స్ చేస్తారు. 2014 నుంచి 2019 మధ్యలో అసెంబ్లీలో విపక్ష నేతగా ఉన్న కోటం రెడ్డి టీడీపీ మీద ఎంతలా రెట్టించి మాట్లాడేవారో రాజకీయాల గురించి అవగాహన ఉన్న అందరికీ తెలిసిన విషయమే.

అలాంటి జగన్ భక్తుడు వేరే పార్టీలోకి వెళ్తాడని బహుశా ఎవరూ అనుకోరు. కోటం రెడ్డి అనుకోరు. కానీ పాలిటిక్స్ అలా నడిపించింది. ఆయన ఆరు నెలల క్రితం వైసీపీతో విభేధించారు. సస్పెండ్ అయ్యారు. అలా పార్టీకి దూరం అయ్యారు.

ఇపుడు ఆయన మెడలో టీడీపీ కండువా పడుతోంది. నెల్లూరు రూరల్ జిల్లా ఇంచార్జిగా కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డిని నియమిస్తూ చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు. అంటే రేపటి ఎన్నికల్లో నెల్లూరు రూరల్ నుంచి కోటం రెడ్డి పోటీ చేస్తారన్న మాట. టీడీపీ నుంచి ఆయన వైసీపీ మీదకు రాజకీయ యుద్ధానికి వస్తారన్న మాట.

వైసీపీ అయితే నెల్లూరు లోక్ సభ ఎంపీ అయిన ఆదాల ప్రభాకరరెడ్డిని చాలా కాలం ముందే తెచ్చి నెల్లూరు రూరల్ జిల్లా ఇంచార్జిని చేసింది. దాంతో ఆయన అంగబలం, అర్ధబలంతో రెడీ అవుతున్నారు. ఇపుడు శ్రీధర్ రెడ్డిని అఫీషియల్ గా టీడీపీ సిద్ధం చేయడంతో రానున్న కాలమంతా ఈ ఇద్దరు మధ్యన పోరు ఒక స్థాయిలో సాగుతుంది అన్నది ఇక అనివార్యమైనదే.

కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి ఇన్నేళ్ల పాటు వైసీపీలో ఉంటూ టీడీపీ మీద దూకుడు చేశారు. మరి ఇపుడు టీడీపీ నుంచి ఆయనకు ఎంతవరకూ సహాయం అందుతుంది అన్నది ఒక చర్చ అయితే 2019లో శ్రీధర్ రెడ్డి ఓడించిన వారు, ఇప్పటిదాకా రూరల్ సీటుకు ఇంచార్జిగా ఉన్న అబ్దుల్ అజీజ్ ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.

టీడీపీ తరఫున పోటీ చేసిన అబ్దుల్ అజీజ్ కి 2019 ఎన్నికల్లో దాదాపు అరవై అయిదు వేల ఓట్లు వచ్చాయి. అది కూడా జగన్ వేవ్ లో అన్ని ఓట్లు తెచ్చుకున్నారు. ఇక శ్రీధర్ రెడ్డికి సొంత బలం ఉంది. నాడు జగన్ వేవ్ కూడా తోడు అయి 22 వేల పై చిలుకు మెజారిటీ దక్కింది. అయితే 2014లో పాతిక వేలు వచ్చిన రూరల్ సీటులో కోటం రెడ్డికి 2019 నాటికి 22 వేలు మాత్రమే రావడమూ గమనించాలి.

ఇపుడు పార్టీ మారారు, క్యాడర్ కూడా వేరుగా ఉంది. వైసీపీకి నెల్లూరు బలమైన కోట. పైగా ఆదాల ప్రభాకరరెడ్డి అన్ని విధాలుగా సమర్ధుడు. ఆయన్ని తట్టుకుని టీడీపీలో వారిని ఆకట్టుకుని కోటం రెడ్డి గెలుపు సాధించడం అంటే అది అద్భుత విజయంగానే చూడాలి. ఏది ఏమైనా లోకేష్ పాదయాత్రను నెల్లూరులో సక్సెస్ చేసినందుకు గానూ బాబు తన వంతుగా టికెట్ ఇస్తూ బహుమతిని ఇచ్చేశారు. ఇపుడు కోటం రెడ్డి గెలిచి బాబుకు గిఫ్ట్ ఇవ్వాలి. చూడాలి మరి నెల్లూరు రూరల్ జిల్లా రాజకీయం ఎలా మలుపు తిరుగుతుందో.