Begin typing your search above and press return to search.

ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డికి గట్టి భరోసా.. చంద్రబాబు ఏం చెప్పారు?!

కడప జడ్పీ చైర్మన్ పదవి విషయంలో అసంతృప్తితో ఉన్న జమ్మలమడుగు బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి ఎపిసోడ్ సుఖాంతమైంది. రాజీనామా ఊహాగానాల నేపథ్యంలో సీఎం చంద్రబాబుతో భేటీ అయ్యారు. భవిష్యత్తులో నామినేటెడ్ పదవుల్లో తన కుటుంబం, అనుచరులకు ప్రాధాన్యం ఇస్తామని సీఎం హామీ ఇచ్చినట్లు సమాచారం.

By:  Tupaki Desk   |   21 Nov 2026 3:22 PM IST
ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డికి గట్టి భరోసా.. చంద్రబాబు ఏం చెప్పారు?!
X

గత రెండు రోజులుగా రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర ఉత్కంఠ రేపిన జమ్మలమడుగు బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి అసంతృప్తి ఎపిసోడ్ ఎట్టకేలకు సుఖాంతమైంది. కడప జిల్లా పరిషత్ (జడ్పీ) చైర్మన్ పీఠం విషయంలో మొదలైన వివాదం, ఎమ్మెల్యే రాజీనామా ఊహాగానాల వరకు వెళ్లింది. అయితే రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు మాధవ్ జోక్యం చేసుకుని ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డిని ముఖ్యమంత్రి చంద్రబాబు వద్దకు తీసుకువెళ్లారు. సీఎంతో జరిగిన భేటీలో ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి మెత్తబడ్డారని అంటున్నారు. పొత్తుల్లో భాగంగా కడప జడ్పీని బీజేపీకి కేటాయించలేకపోయామని, మరోవిధంగా గుర్తింపునిస్తామని సీఎం భరోసా ఇచ్చినట్లు చెబుతున్నారు.

కడప జడ్పీ చైర్మన్ స్థానాన్ని తన సోదరుడి కుమారుడు రాజేష్ రెడ్డికి కేటాయించాలని ఆదినారాయణరెడ్డి గట్టిగా పట్టుబట్టారు. అయితే, ఎన్డీఏ కూటమి సీట్ల సర్దుబాటులో భాగంగా ఈ పదవిని తెలుగుదేశం పార్టీకి కేటాయించడంతో ఆయన తీవ్ర అసంతృప్తికి లోనయ్యారు. ఇదే ఆగ్రహంతో శుక్రవారం జరిగిన కడప జడ్పీ చైర్మన్ ఎన్నికను బహిష్కరించిన ఆదినారాయణరెడ్డి, వెంటనే విజయవాడకు పయనమయ్యారు. దీంతో ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి తన పదవికి రాజీనామా చేయబోతున్నారంటూ జోరుగా ప్రచారం జరిగింది. విజయవాడలో ఆదినారాయణరెడ్డి మీడియా సమావేశం ఏర్పాటు చేస్తున్నారని, ఇందులో కీలక ప్రకటన చేస్తారని ఆయన అనుచరులు లీకులిచ్చారు. అయితే ఈ విషయంలో బీజేపీ అధిష్టానం ఆఘమేఘాలపై స్పందించింది. విజయవాడ వచ్చిన ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి మీడియాతో మాట్లాడే ముందు సీఎం చంద్రబాబుతో కలిసేలా ఏర్పాట్లు చేసింది. ఇక సీఎంతో భేటీ తర్వాత ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి వివాదం టీకప్పులా తుఫాన్ లా చల్లారిపోయింది. దీంతో ఎమ్మెల్యే ఆదికి సీఎం ఎలాంటి హామీ ఇచ్చారనే అంశంపై విస్తృత చర్చ జరుగుతోంది.

తరచూ అసంతృప్తి ఎందుకు?

రాజకీయంగా అత్యంత కీలకమైన కడప జిల్లాలో ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డికి బలమైన పట్టు ఉంది. వైసీపీ కంచుకోటగా భావించే జిల్లాలో కూటమి బలోపేతానికి ఆయన తనదైన శైలిలో పనిచేస్తున్నారు. అయితే, కూటమి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి స్థానిక సంస్థల పదవులు, నియోజకవర్గంలో అధికారుల బదిలీలు, పనుల కేటాయింపు వంటి అంశాల్లో తనకు తగిన ప్రాధాన్యం దక్కడం లేదని ఆయన తరచూ అసంతృప్తి వ్యక్తం చేస్తూ వస్తున్నారు. గతంలోనూ పలు మార్లు ఆయన చేసిన వ్యాఖ్యలు కూటమిలో చర్చనీయాంశమయ్యాయి. తాజాగా జడ్పీ పీఠం చేజారడంతో ఆయన సహనం కోల్పోయారని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డిని ఎదిరించి ఆయన నియోజకవర్గంలో టీడీపీ గెలుపునకు తాను పనిచేశానని, అయినా ప్రభుత్వ పెద్దలు తనకు సరైన గౌరవం ఇవ్వడం లేదన్న ఆవేదన ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డిలో రోజురోజుకు పెరిగిపోయిందని అంటున్నారు. దీంతో రాజీనామా చేయాలనే నిర్ణయానికి వచ్చినట్లుగా ఆయన సన్నిహితులు చెబుతున్నారు.

సీఎం భేటీ తర్వాత మెత్తపడటానికి కారణాలేంటి?

ఉండవల్లిలోని క్యాంపు కార్యాలయంలో తన సోదరులు రాజశేఖర్ రెడ్డి, గోవర్ధన్ రెడ్డిలతో కలిసి ఆదినారాయణరెడ్డి ముఖ్యమంత్రి చంద్రబాబుతో భేటీ అయ్యారు. అనంతరం మంత్రి నారా లోకేశ్‌తోనూ చర్చలు జరిపారు. ఎమ్మెల్యే రాజీనామా ప్రచారంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ చాకచక్యంతో పావులు కదిపారని చెబుతున్నారు. ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డిని బుజ్జగించి సీఎంతో మాట్లాడించడంతో స్పష్టమైన హామీ లభించినట్లుగా ప్రచారం జరుగుతోంది. కూటమి ధర్మం, రాష్ట్రవ్యాప్త సీట్ల సర్దుబాటు సమీకరణాల వల్లే కడప జడ్పీ స్థానాన్ని బీజేపీకి ఇవ్వలేకపోయామని చంద్రబాబు ఆయనకు నచ్చజెప్పారని అంటున్నారు. భవిష్యత్తులో నామినేటెడ్ పదవులు భర్తీ సమయంలో ఆదినారాయణరెడ్డి కుటుంబానికి, అనుచరులకు సముచిత స్థానం కల్పిస్తామని సీఎం స్పష్టమైన హామీ ఇచ్చినట్లు సమాచారం.