Begin typing your search above and press return to search.

రాజానగరం టీడీపీకి కొత్త ఇన్ ఛార్జ్... వెంకటేష్ ఫ్యాన్స్ హర్ట్?

రాజానాగరం నియోజకవర్గం టీడీపీ ఇన్ ఛార్జ్ గా మాజీ వైసీపీ నేత బొడ్డు వెంకటరమణ చౌదరి నియమితులయ్యారు.

By:  Tupaki Desk   |   21 July 2023 4:15 AM GMT
రాజానగరం టీడీపీకి కొత్త ఇన్  ఛార్జ్... వెంకటేష్  ఫ్యాన్స్  హర్ట్?
X

ఎన్నికలు సమీపిస్తున్న వేళ టీడీపీ అధినేత చంద్రబాబు దూకుడు ప్రదర్శిస్తున్నారు. అభ్యర్థుల ఎంపిక, ఇన్ ఛార్జ్ ల మార్పు వంటి కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా తాజాగా రాజానగరం టీడీపీ కి కొత్త ఇన్ ఛార్జ్ ని నియమించారు.

అవును... రాజానాగరం నియోజకవర్గం టీడీపీ ఇన్ ఛార్జ్ గా మాజీ వైసీపీ నేత బొడ్డు వెంకటరమణ చౌదరి నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర టీడీపీ అధ్యక్షడు కింజరావు అచ్చెన్నాయుడు ఉత్తర్వులు జారీ చేశారు. అంతకుముందు అమరావతిలో చంద్రబాబు.. బొడ్డు వెంకటరమణ చౌదరి తోనూ, మాజీ ఎమ్మెల్యే పెందుర్తి వెంకటేష్‌ తోనూ వేర్వేరుగా చర్చించారు.

అయితే పెందుర్తి వెంకటేష్ 2009, 2014ల్లో ఈ నియోజకవర్గం నుంచి వరుసగా గెలిచారు. 2019 ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి జక్కంపూడి రాజా చేతిలో ఓడిపోయారు. అయితే ఆయనతో పాటు మాజీ మంత్రులే ఓడిపోయారు కదా.. అంతమాత్రాన్న ఇన్ ఛార్జ్ గా కొత్త వ్యక్తిని తెస్తారా అని వెంకటేష్ అనుచరులు ప్రశ్నిస్తున్నారని తెలుస్తుంది.

దీంతో... రాజానాగరం టీడీపీలో అంతర్గత కుమ్ములాటలు పెరిగే ఛాన్స్ ఉందనే మాటలు వినిపిస్తున్నాయని తెలుస్తుంది. అయితే వెంకటేష్ ఇన్ ఛార్జ్ గా ఉన్న సమయంలో ఈ నియోజకవర్గంలో పార్టీ కొంత బలహీన పడిందనే ప్రచారం జరిగిందని అంటున్నారు.ఫలితంగా... కొత్త ఇన్ ఛార్జ్ ని నియమించారని టీడీపీ శ్రేణులు చెప్పుకుంటున్నాయంట.

కాగా... 2014లో వెంకటరమణ పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు. రాజమండ్రి పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేసిన వెంకటరమణ చౌదరి.. సినీ నటుడు, టీడీపీ సీనియర్ నేత మురళీమోహన్ చేతిలో ఓటమి చెందారు. ఆ ఎన్నికల్లో ఆయన రెండోస్థానానికి పరిమితమయ్యారు. అప్పటి నుంచి ఆయన వైసీపీలోనే కొనసాగారు.

ఈ క్రమంలో గతేడాది మే నెలలో మాజీ హోం మంత్రి నిమ్మకాయల చినరాజప్ప, అనపర్తి మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామక్రిష్ణా రెడ్డితో కలిసి ఆయన టీడీపీ అధినేత చంద్రబాబును కలిశారు. అనంతరం సైకిల్ ఎక్కేశారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యదర్శిగా నియమితులయ్యారు.

ఈ క్రమంలో తాజాగా వెంకటరమణ ను ఇన్ ఛార్జ్ చేశారు చంద్రబాబు. మరి ఈ నియామకాన్ని పెందుర్తి వెంకటేష్ వర్గం ఎలా రిసీవ్ చేసుకుంటుంది అనేది వేచి చూడాలని అంటున్నారు పరిశీలకులు. కారణం... ఈ సమయంలో ఎవరు ఇన్ ఛార్జ్ అయితే వారే ఎమ్మెల్యే అభ్యర్థి అని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఎన్నికలు సమీపిస్తున్న వేళ మరోసారి మార్పులు ఉండవని చెబుతున్నారు.

మరోపక్క నాలుగురోజుల క్రితం పిఠాపురం, కొవ్వూరు తో పాటు రాజానగరానికి జనసేన అధినేత పవన్ కల్యాణ్... ఇన్ ఛార్జ్ లను నియమించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో రాజానగరం ఇన్ ఛార్జ్ గా బత్తుల బలరామ కృష్ణని నియమించారు. పొత్తులు అనివార్యమైన వేళ... వీరిలో ఎవరు త్యాగం చేయాలనేది తెలియాల్సి ఉంది!