Begin typing your search above and press return to search.

పవన్ కు పోటీగా బాబు... ఏపీలో ఏమి జరుగుతుంది?

దీంతో... చంద్రబాబు సైతం ఒంటరిగానో.. కమ్యునిస్టులను కలుపుకునో రంగంలోకి దిగడానికి మెంటల్ గా ప్రిపేర్ అయిపోతున్నారా అనే చర్చ

By:  Tupaki Desk   |   21 July 2023 6:25 AM GMT
పవన్  కు పోటీగా  బాబు... ఏపీలో  ఏమి  జరుగుతుంది?
X

ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఏపీలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారిపోతున్నాయి. ఇదే క్రమంలో ఎవరు ఏ పార్టీతో పొత్తులో పోటీ చేయబోతున్నారనే చర్చ కూడా రాజకీయ వర్గాల్లో విపరీతంగా నడుస్తుంది. ఈ సమయంలో పవన్ కు పోటీగా చంద్రబాబు తీసుకుంటున్నట్లున్న కొన్ని నిర్ణయాలు తెరపైకి ఆసక్తికరమైన చర్చను తీసుకొస్తున్నాయి.

అవును... నిన్నమొన్నటివరకూ ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీలనివ్వను... మూడు పార్టీలూ కలిసే పోటీ చేస్తాయి అని పవన్ కల్యాణ్ చెప్పిన సంగతి తెలిసిందే. ఇదే సమయంలో హస్తినలో కూడా తాజాగా ఈ మేరకు హింట్ ఇచ్చారు. ఇప్పుడు తాజాగా ఏపీలో ఎన్డీయే ప్రభుత్వం రావడం పక్కా అని అంటున్నారు. మరోపక్క ఎన్డీయే కూటమిలో టీడీపీ అవకాశం లేదని ఇప్పటికే బీజేపీ నేతలు చెప్పకనే చెప్పారని తెలుస్తుంది.

దీంతో ఏపీలో పొత్తుల అంశం మరోసారి హాట్ టాపిక్ గా మారింది. ఏపీలో బీజేపీ - టీడీపీ మాత్రమే కలిసి పోటీ చేస్తాయా.. టీడీపీ, కమ్యునిస్టులను కలుపుకుని రంగంలోకి దిగబోతోందా.. అనే చర్చ తెరపైకి వచ్చింది. ఈ చర్చకు మరింత బలం చేకూరుస్తున్నట్లుగా తాజాగా ఒక కీలక సంఘటన తెరపైకి వచ్చింది.

ఏపీలో వారాహి యాత్ర రెండో దశ అనంతరం పిఠాపురం, రాజానగరం, కొవ్వూరు నియోజకవర్గాలకు పవన్ ఇన్ ఛార్జ్ లను ప్రకటించారు. వారిలో కొవ్వూరు కు మాజీ శాసనసభ్యులు, టీడీపీ మాజీ నేతను టీవీ రామారావు ను ఎంపిక చేశారు. ఆయనకు టిక్కెట్ కన్ ఫాం అనే కామెంట్లు స్థానికంగా వినిపిస్తున్నాయి.

అయితే ఆ స్థానంలో గతంలో టీడీపీ నుంచి కేఎస్ జవహార్ పోటీ చేశారు. టీడీపీలో కీలక నేతల్లో ఒకరిగా ఉన్న ఆయన... మరోసారి ఇక్కడనుంచి పోటీ చేయాలని భావిస్తున్నారని అంటున్నారు. ఇది ఎస్సీ రిజర్వుడు స్థానం. గత ఎన్నికల్లో టీడీపీ నుంచి అనిత పోటీ చేసిన సంగతి తెలిసిందే.

ఇదే సమయంలో పిఠాపురం నియోజకవర్గానికి కూడా పవన్.. ఇన్ ఛార్జ్ ని ప్రకటించారు. తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ ను జనసేన పార్టీ పిఠాపురం ఇన్ ఛార్జ్ గా ప్రకటించారు. ఈసారి ఈయనకు సీట్ కన్ ఫాం అని స్థానికంగా మాటలు వినిపిస్తున్నాయి. ఈ మేరకు పవన్ హామీ ఇచ్చారని అంటున్నారు.

అయితే పిఠాపురంలో టీడీపీ నుంచి మూడుసార్లు పోటీచేసిన ఎస్.వి.ఎస్.ఎన్. వర్మ ఉన్నారు. 2009 నుంచి మూడు సార్లు పోటీ చేసిన ఈయన... 2014లో మాత్రం గెలిచారు. ఈసారి కూడా టిక్కెట్ ఆయనదే అని ఆయన వర్గం బలంగా చెబుతుందట.

ఇదే క్రమంలో రాజానగరం నియోజకవర్గానికి బత్తుల బలరామకృష్ణ ను ఇన్ ఛార్జ్ గా ప్రకటించారు పవన్ కల్యాణ్. ఈయనకు కూడా టిక్కెట్ కన్ ఫాం అని చెప్పారని అంటున్నారు. ఆయన కూడా నియోజకవర్గంలో బలంగా తిరుగుతున్నారని అంటున్నారు. సరిగ్గా ఇదే సమయంలో చంద్రబాబు కూడా రాజానగరానికి ఇన్ ఛార్జ్ ని ప్రకటించారు.

ఎన్నికలు సమీపిస్తున్న వేళ పార్టీలు ఇన్ ఛార్జ్ లను ప్రకటించుకోవడం సహజమైన ప్రక్రియే అయినప్పటికీ... టిక్కెట్ కన్ ఫాం అని అధినేత ఫిక్సయినవారికి మాత్రమే ఇలాంటి కీలక సమయంలో ఇన్ ఛార్జ్ పోస్టులు ఇస్తారని అంటుంటారు. ఆ పరిస్థితుల్లో పవన్ అధికారికంగా ముగ్గురు అభ్యర్థులను ఇన్ ఛార్జ్ లుగా ప్రకటించారు. వారికే టిక్కెట్లు కన్ ఫాం అని అంటున్నారు.

ఈ సమయంలో పిఠాపురం, కొవ్వూరు సంగతి కాసేపు పక్కనపెడితే... రాజానగరంలో చంద్రబాబు ఇన్ ఛార్జ్ గా ప్రకటించిన బొడ్డు వెంకటరమణ చౌదరి చిన్న వ్యక్తేమీ కాదు. జస్ట్ ఇన్ ఛార్జ్ గా బాధ్యతలు ఇచ్చి ఎమ్మెల్యే టిక్కెట్ ఇవ్వకుండా హ్యాండ్ ఇచ్చే పరిస్థితి ఉండకపోవచ్చు. ఆయన కూడా ఆ హామీ మేరకే వైసీపీ నుంచి టీడీపీకి వచ్చి ఉండొచ్చు.

పైగా... వెంకట రమణ కి టీడీపీ ఉన్న అనుబంధం ఇప్పటిది కాదు. తూర్పు గోదావరి జిల్లాకు చెందిన దివంగత నేత బొడ్డు భాస్కర రామారావు తనయుడే ఈ వెంటకరమణ. పెద్దాపురం నియోజకవర్గం నుంచి 1994, 1999లో రెండుసార్లు భాస్కర రామారావు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. జిల్లా టీడీపీలో కీలక నేతగా ఎదిగారు.

అనంతరం 2004, 2009లో టీడీపీ తరఫున పోటీ చేసినప్పటికీ వైఎస్ హవాలో రామారావు గెలవలేకపోయారు! అనంతరం ఎమ్మెల్సీగా కొనసాగారు. అంటే... టీడీపీతో బొడ్డు ఫ్యామిలీది సుమారు మూడు దశాబ్ధాల సంబంధం. ఇవన్నీ పరిగణలోకి తీసుకుంటే... రాజనగరం టీడీపీ టిక్కెట్టు వెంకట రమణకు కన్ ఫా అని అనుకోవచ్చు.

దీంతో... జనసేన పరిస్థితి ఏమిటి అనే చర్చ తెరపైకి వస్తోంది. మొదటినుంచీ పిఠాపురం, రాజానగరం, అమలాపురం, కాకినాడ రూరల్, రాజోలు వంటి స్థానాలు జనసేనే పోటీ చేస్తోంది.. పొత్తులో కూడా చంద్రబాబు ఆ స్థానాలు జనసేనకే ఇస్తారు అనే చర్చ నడిచింది.

అలాంటిది సడన్ గా జనసేన ఇన్ ఛార్జులను ప్రకటించుకున్న చోట టీడీపీ కొత్త అభ్యర్థిని, పైగా బలమైన అభ్యర్థిని, పైగా టిక్కెట్ ఇవ్వడం కంపల్సరీ అయిన అభ్యర్థిని ఇన్ ఛార్జ్ చేసింది! దీంతో... పొత్తు ఉన్నట్లా.. లేనట్లా అనే చర్చ మరోసారి తెరపైకి వచ్చింది.

ఇదే సమయంలో టీడీపీతో కలిసి పొత్తు పెట్టుకోవడానికి బీజేపీ సిద్ధంగా లేదని కథనాలొస్తున్న వేళ, పవన్ కూడా తనకు మోడీ – అమిత్ షా లతో ఉన్నది కేవలం రాజకీయ సంబంధం మాత్రమే కాదు.. అంతకు మించి అన్నట్లుగా మాట్లాడుతున్నారు. అంతకముందు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వారాహి యాత్రలో భాగంగా... జనసేన అంటే టీడీపీ బీ టీం కాదని గట్టిగా చెప్పారు.

దీంతో... చంద్రబాబు సైతం ఒంటరిగానో.. కమ్యునిస్టులను కలుపుకునో రంగంలోకి దిగడానికి మెంటల్ గా ప్రిపేర్ అయిపోతున్నారా అనే చర్చ... రాజానగరం నియోజకవర్గానికి ఇన్ ఛార్జ్ ని ప్రకటించగానే తెరపైకి వచ్చింది. ఫలితంగా... ఏపీలో మరోమారు త్రిముఖ పోటీ ఉండొచ్చని అంటున్నారు పరిశీలకులు. అంటే... అంటే... వారి ఉద్దేశ్యంలో 2014 పొత్తులు రిపీట్ కావు - 2019 ఫైటే ఫిక్స్ అవ్వొచ్చు అని అన్నమాట!