నాగ నాయుడుకీ, వెంకటేష్‌కీ మధ్య ఉన్న తేడా అదే
దగ్గుబాటి రానా, వెంకటేష్ కలిసి నెట్‌ఫ్లిక్స్ కోసం నటించిన వెబ్ సిరీస్ రానా నాయుడు.;
దగ్గుబాటి రానా, వెంకటేష్ కలిసి నెట్‌ఫ్లిక్స్ కోసం నటించిన వెబ్ సిరీస్ రానా నాయుడు. కరణ్ అన్షుమాన్, సుపర్ణ్ వర్మ దర్శకత్వంలో వచ్చిన ఈ సిరీస్ అప్పట్లో తెగ వార్తల్లో నిలిచింది. 2023లో ఈ యాక్షన్ క్రైమ్ డ్రామా రిలీజైంది. అప్పటివరకు వెంకటేష్ ను ఫ్యామిలీ హీరోగా చూసిన ఆడియన్స్ రానా నాయుడులో నాగ నాయుడు పాత్ర చూసి షాకయ్యారు.
వెంకటేష్ ఇలాంటి బోల్డ్ రోల్ చేశాడేంటని కొందరు నెగిటివ్ కామెంట్స్ చేయగా, మరికొందరు కొత్త తరహా రోల్ లో వెంకటేష్ అదరగొట్టాడని అన్నారు. మొదటి సీజన్ కు వచ్చిన కామెంట్స్ అన్నింటినీ దృష్టిలో పెట్టుకుని ఇప్పుడు రానానాయుడు సిరీస్ కు కొనసాగింపుగా రానా నాయుడు సీజన్2 ను రూపొందించారు. జూన్ 13 నుంచి రానా నాయుడు సీజన్2 నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది.
ఈ సందర్భంగా రానా నాయుడు2 ప్రమోషన్స్ లో పాల్గొన్న వెంకీ, రియల్ లైఫ్ లో తన క్యారెక్టర్‌కీ, రానా నాయుడు2లో ఉండే నాగ నాయుడు పాత్రకు మధ్య వ్యత్యాసాన్ని, వారిద్దరి మధ్య ఉన్న సారూప్యతలను వెల్లడించారు. నాగ నాయుడుకీ, వెంకటేష్‌కీ చాలా తేడా ఉందని, నాగ నాయుడు స్వార్థంగా ఉంటూ రూల్స్ ను బ్రేక్ చేస్తూ ఉంటాడని, కానీ రియల్ లైఫ్ లో వెంకటేష్ మాత్రం చాలా క్రమశిక్షణగా ఉంటాడని చెప్పారు.
నాగ నాయుడు క్యారెక్టర్ ఎప్పుడెలా ప్రవర్తిస్తుందో ఎవరూ ఊహించలేమని చెప్పిన వెంకటేష్, నాగ నాయుడు తన ఫ్యామిలీ కోసం ప్రాణమిస్తాడని, నిజ జీవితంలో తను కూడా అంతేనని, నాగ నాయుడు పాత్రతో తాను కనెక్ట్ అయిన పాయింట్ ఇదొకటేనని, రియల్ లైఫ్ లో నాకూ, ఆ క్యారెక్టర్‌కూ ఉన్న కనెక్షన్ అదేనని, తామిద్దరం తమ ఫ్యామిలీలను ప్రేమిస్తామని అన్నారు.
అయితే రియల్ లైఫ్ లో వెంకటేష్ ఎలా ఉంటాడో, ఎలా ప్రవర్తిస్తాడో ఊహించగలరు కానీ నాగ నాయుడు ఎప్పుడేం చేస్తాడో ఎవరూ ఊహించలేరని, నాగకు డ్రామా అంటే ఎక్కువ ఇష్టమని, మైండ్ గేమ్స్ ఆడుతూ ఉంటాడని, కానీ వెంకటేష్ కు మాత్రం అలాంటివేమీ ఇష్టముండవని, ఈ సారి నాగ నాయుడు క్యారెక్టర్ ఆడియన్స్ మరింత ఆకట్టుకుంటుందని వెంకటేష్ తెలిపారు.