OTT టాక్: డిటెక్టివ్ ఉజ్వలన్.. ఎలా ఉందంటే?
అలాంటి గమ్మత్తైన మలయాళ మూవీ ‘డిటెక్టివ్ ఉజ్వలన్’ ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. ఓ పల్లెటూరి నేపథ్యంలో మిస్టరీలు, హత్యలు, విచారణలతో సాగే కథ ఇది.;
డిటెక్టివ్ థ్రిల్లర్స్ కు ఎప్పుడూ కూడా మాంచి క్రేజ్ ఉంటుంది. కంటెంట్ క్లిక్కయితే భాషతో సంబంధం లేకుండా చూసే జనాలు ఎక్కువయ్యారు. ఇక ప్రత్యేకంగా కామెడీ మిక్స్ అయితే ఇంకా బాగుంటుంది. అలాంటి గమ్మత్తైన మలయాళ మూవీ ‘డిటెక్టివ్ ఉజ్వలన్’ ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. ఓ పల్లెటూరి నేపథ్యంలో మిస్టరీలు, హత్యలు, విచారణలతో సాగే కథ ఇది. మొదటి నుండి చివరి వరకు నెమ్మదిగా నడిచినా.. ఆసక్తికరంగా ఉండే మలయాళ సినిమాల ముద్ర ఈ సినిమాలో కనిపిస్తుంది.
కేరళలోని ఓ గ్రామం.. ప్లాచిక్కావు.. అక్కడ లైబ్రరీ నడిపే యువకుడు ఉజ్వలన్ ఏ చిన్న నేరం జరిగినా వెంటనే గుర్తించేస్తాడు. అందుకే అతనికి గ్రామంలో ‘డిటెక్టివ్’ అనిపేరు వచ్చింది. ఊహించని తరహాలో ఓ హత్య జరగడంతో ఊరు ఉలిక్కిపడుతుంది. పోలీసులు విచారణ ప్రారంభించగా ఉజ్వలన్ సాయం కోరుతారు. కథ మరింత మలుపులు తిరుగుతూ రెండో హత్యతో కఠినంగా మారుతుంది.
కథ ప్రధానంగా కామెడీతో పాటు మిస్టరీగా సాగుతుంది. డిటెక్టివ్‌గా ధ్యాన్ శ్రీనివాసన్ పాత్ర ఆకట్టుకుంటుంది. అతడి క్యారెక్టర్ డిజైన్ సాధారణంగానే ఉన్నా కామెడీ పండించేలా ఉంటుంది. గ్రామీణ వాతావరణం, అక్కడి వారి జీవితశైలి మెల్లగా కథలోకి లీనం చేస్తాయి. సీఐ శంభు పాత్రలో సిజు విల్సన్ మంచి నటన కనబరిచారు. అతడితో వచ్చే ఘర్షణలు, పాత్రల మధ్య సైకలాజికల్ ప్లే సినిమాకు థ్రిల్ ఇచ్చాయి.
ఫస్ట్ హాఫ్‌లో కామెడీతో సాగిన కథ, సెకండ్ హాఫ్‌లో సీరియస్ మలుపులు తీసుకుంటుంది. మిస్టరీ థ్రిల్లర్ చిత్రాల్లో ఉండే టెంప్లేట్‌కు కొన్ని భాగాల్లో ఫిక్స్ అయినట్టు అనిపించినా.. కథలోని ట్విస్ట్‌లు, చివరి అంచనాలు ప్రేక్షకుడిని ఆకట్టుకుంటాయి. ఉజ్వలన్ తండ్రిపై వచ్చిన అనుమానాలు, కిల్లర్ వెనుక లాజిక్ చిత్రానికి క్లైమాక్స్ పాయింట్‌ను బలంగా నిలబెడతాయి.
ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్ లోకల్‌గా ఉన్నా ఎమోషన్ అంతగా కనెక్ట్ కాలేదు. కానీ సైకో కిల్లర్ గురించి తెలిసే సన్నివేశం మాత్రం థ్రిల్లింగ్‌గా ఉంటుంది. సినిమా అంతా నెమ్మదిగా సాగినా, చివర్లో ట్విస్టులు సినిమాకు స్పెషల్‌గా నిలుస్తుంది. పరిమిత పాత్రలతో అయినా కథను నడిపించిన విధానం ప్రశంసించదగినది. మొత్తానికి, OTTలో కొత్తగా ఏదైనా చూడాలని అనుకుంటున్న వారికి ఇది ఓ మంచి ఎంపిక అవుతుంది. హింసాత్మకంగా కొన్ని సన్నివేశాలున్నా, బోల్డ్ కంటెంట్ లేకపోవడంతో కుటుంబంతోనూ చూడొచ్చు. మలయాళంలో స్ట్రీమింగ్ అవుతున్న ఈ సినిమాను ఇంగ్లీష్ సబ్‌టైటిల్స్‌తో ఎంజాయ్ చేయొచ్చు.