వైభవ్ సూర్యవంశీకి బ్యాట్ స్పాన్సర్‌షిప్ కోసం కంపెనీల పోటీ.. ‘బ్లాంక్ చెక్’ ఆఫర్!
ఐపీఎల్ ముగింపు దశకు చేరుకుంటున్న కొద్దీ ఒకే ఒక్క పేరు క్రికెట్ ప్రపంచాన్ని షేక్ చేస్తోంది. అతడే రాజస్థాన్ రాయల్స్ యువ ఓపెనర్, కేవలం 15 ఏళ్ల వయసున్న వైభవ్ సూర్యవంశీ.
ఐపీఎల్ ముగింపు దశకు చేరుకుంటున్న కొద్దీ ఒకే ఒక్క పేరు క్రికెట్ ప్రపంచాన్ని షేక్ చేస్తోంది. అతడే రాజస్థాన్ రాయల్స్ యువ ఓపెనర్, కేవలం 15 ఏళ్ల వయసున్న వైభవ్ సూర్యవంశీ. ఈ సీజన్‌లో తన విధ్వంసకర బ్యాటింగ్‌తో ప్రత్యర్థి బౌలర్లకు చుక్కలు చూపిస్తున్న ఈ యువ సంచలనానికి మైదానం వెలుపల కూడా డిమాండ్ భారీగా పెరిగిపోయింది. కార్పొరేట్ రంగంలో ప్రస్తుతం వైభవ్ పేరు మారుమోగిపోతోంది. అతడి బ్యాట్ స్పాన్సర్‌షిప్ దక్కించుకునేందుకు దేశంలోని ప్రముఖ దిగ్గజ కంపెనీలు క్యూ కడుతున్నాయి. ఏకంగా ఒక ప్రముఖ సంస్థ అతడికి ‘బ్లాంక్ చెక్’ ఆఫర్ ఇచ్చిందనే వార్త ఇప్పుడు క్రీడా వ్యాపార వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.
ఆరెంజ్ క్యాప్ రేసులో టాప్.. నమ్మలేని స్ట్రైక్ రేట్!
ఈ సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్ తరఫున బరిలోకి దిగిన వైభవ్ సూర్యవంశీ, వయసుకు మించిన పరిణతితో బ్యాటింగ్ చేస్తున్నాడు. ఇప్పటివరకు ఆడిన మ్యాచ్‌ల్లో ఏకంగా 680 పరుగులు సాధించి, ఆరెంజ్ క్యాప్ రేసులో అందరికంటే ముందంజలో ఉన్నాడు. కేవలం పరుగులు చేయడమే కాదు, అతడి స్ట్రైక్‌రేట్ నమ్మశక్యం కాని విధంగా 242.85 గా ఉంది. పవర్‌ప్లేలో అతడు ఆడుతున్న భారీ షాట్లు, ఒత్తిడిని చిత్తు చేస్తూ బౌండరీల వర్షం కురిపిస్తున్న తీరు క్రికెట్ అభిమానులను మంత్రముగ్ధులను చేస్తోంది. ఈ అసాధారణ ప్రదర్శనే అతడి బ్రాండ్ వాల్యూను రాత్రికి రాత్రే ఆకాశానికి చేర్చింది.
రూ.50 లక్షల నుంచి రూ.12 కోట్లకు పైగా.. 24 రెట్లు జంప్!
ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం.. వైభవ్ సూర్యవంశీ తన ప్రస్తుత బ్యాట్ స్పాన్సర్‌షిప్ ఒప్పందం ద్వారా ఏడాదికి కేవలం రూ.50 లక్షలు మాత్రమే అందుకుంటున్నాడు. అయితే ప్రస్తుత ఒప్పందాన్ని మధ్యలోనే కొనుగోలు చేసి , కొత్త స్పాన్సర్‌గా మారేందుకు పలు బహుళజాతి సంస్థలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి.
బ్లాంక్ చెక్ ఆఫర్..
ఒక ప్రముఖ కార్పొరేట్ బ్రాండ్ వైభవ్‌కు "మీరు కోరుకున్నంత మొత్తం రాసుకోండి" అంటూ బ్లాంక్ చెక్ ఆఫర్ చేసినట్లు క్రిక్‌బ్లాగర్ కథనం పేర్కొంది. ప్రస్తుతం అతడికి ఏడాదికి ఏకంగా రూ.12 కోట్లకు పైగా వార్షిక ఒప్పందాన్ని ఆఫర్ చేసినట్లు తెలుస్తోంది. ఇది అతడి ప్రస్తుత ఆదాయం కంటే దాదాపు 24 రెట్లు ఎక్కువ కావడం గమనార్హం.
కోహ్లీ, గిల్ రికార్డులకు సైతం సవాల్
సాధారణంగా భారత క్రికెట్‌లో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్ వంటి అగ్రశ్రేణి అంతర్జాతీయ బ్యాటర్లు తమ బ్యాట్ స్పాన్సర్‌షిప్ ద్వారా ఏడాదికి రూ.3 కోట్ల నుంచి రూ.8 కోట్ల వరకు సంపాదిస్తారు. వీరంతా ప్రముఖ టైర్ తయారీ సంస్థలతో భారీ ఒప్పందాలు కలిగి ఉన్నారు. అయితే ఇంకా అంతర్జాతీయ అరంగేట్రం చేయని 15 ఏళ్ల వైభవ్‌కు రూ.12 కోట్లకు పైగా ఆఫర్ రావడం అంటే అది భారత క్రికెట్ చరిత్రలోనే ఒక సంచలనం.
సంప్రదాయ బ్యాట్ తయారీ సంస్థలు ఎస్ఎస్, ఎస్..జీ, ఎంఆర్ఎఫ్ బేస్ సాధారణంగా గరిష్టంగా రూ.5 కోట్ల వరకు మాత్రమే ఆఫర్ చేయగలవు, అది కూడా పెర్ఫార్మెన్స్ బోనస్‌లతో కూడి ఉంటుంది. కానీ ఎంఆర్ఎఫ్ , సీఈఏటీ వంటి దిగ్గజ టైర్ బ్రాండ్లు తమ గ్లోబల్ ప్రచారం కోసం భారీ పెట్టుబడులు పెట్టేందుకు వెనుకాడడం లేదు. వైభవ్ క్రేజ్‌ను క్యాష్ చేసుకునేందుకు ఈ సంస్థలు పోటీపడుతున్నాయి.
టీమిండియాలోకి ఎంట్రీ.. నెక్స్ట్ సూపర్‌స్టార్!
వైభవ్ సూర్యవంశీ కేవలం ఐపీఎల్‌కే పరిమితం కాకుండా త్వరలోనే బ్లూ జెర్సీలో కనిపించబోతున్నాడనే అంచనాలు గట్టిగా ఉన్నాయి. జూన్ చివర్లో జరగబోయే ఐర్లాండ్ పర్యటనకు భారత టీ20 జట్టును ఎంపిక చేయనున్నారు. ఈ పర్యటనలో వైభవ్‌కు చోటు దక్కడం దాదాపు ఖాయమని క్రికెట్ విశ్లేషకులు భావిస్తున్నారు.
ఐపీఎల్ వేదికగా వెలుగులోకి వచ్చిన ఈ బీహార్ కుర్రాడు.. కేవలం రికార్డులను మాత్రమే కాకుండా బిజినెస్ మార్కెట్‌లోనూ సరికొత్త రికార్డులను సృష్టిస్తున్నాడు. సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లీల తర్వాత భారత క్రికెట్‌లో తదుపరి "గ్లోబల్ సూపర్‌స్టార్" అయ్యే అన్ని లక్షణాలు వైభవ్‌లో కనిపిస్తున్నాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఒకవేళ ఈ రూ.12 కోట్ల డీల్ ఓకే అయితే భారత క్రీడా రంగంలో అతి పిన్న వయసులో అత్యధిక స్పాన్సర్‌షిప్ సాధించిన ఆటగాడిగా వైభవ్ కొత్త చరిత్ర సృష్టిస్తాడు.