ఉప్పల్ స్టేడియంలో నిమ్మకాయతో క్షుద్రపూజ.. ఇతడి జీవితాన్ని మార్చేసింది..

ఐపీఎల్ అంటేనే కేవలం ఫోర్లు, సిక్సర్లు మాత్రమే కాదు.. మైదానంలోనూ గ్యాలరీలోనూ కనిపించే వింతలు, విశేషాల సమాహారం.;

Update: 2026-04-21 04:21 GMT

ఐపీఎల్ అంటేనే కేవలం ఫోర్లు, సిక్సర్లు మాత్రమే కాదు.. మైదానంలోనూ గ్యాలరీలోనూ కనిపించే వింతలు, విశేషాల సమాహారం. తాజాగా ఉప్పల్ వేదికగా జరిగిన ఒక మ్యాచ్‌లో చోటుచేసుకున్న ఉదంతం సోషల్ మీడియాను ఊపేస్తోంది. ఉప్పల్ స్టేడియంలో ఒక అభిమాని చేసిన 'క్షుద్రపూజ' ప్రయోగం ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది. అసలు ఆ నిమ్మకాయ వెనుక ఉన్న రహస్యం ఏంటి? ఆ 'వైరల్ మంత్రగాడు' చెప్పిన నిజాలేంటి? అనేది తెలుసుకుందాం..

మైదానంలో టెన్షన్.. గ్యాలరీలో మంత్ర తంత్రాలు!

హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం వేదికగా చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే), సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్.ఆర్.హెచ్) జట్ల మధ్య మ్యాచ్ ఉత్కంఠభరితంగా సాగుతోంది. మైదానంలో ఆటగాళ్ల మధ్య పోరు నడుస్తుంటే గ్యాలరీలో ఉన్న ఒక యువకుడు మాత్రం వింత ప్రవర్తనతో అందరి దృష్టిని ఆకర్షించాడు. చేతిలో నిమ్మకాయ పట్టుకుని, కళ్లు మూసుకుని ఏదో మంత్రాలు చదువుతున్నట్లుగా హావభావాలు పలికించాడు. సరిగ్గా అదే సమయంలో మైదానంలో వికెట్ పడటం యాదృచ్చికంగా జరిగిపోయింది. ఇంకేముంది.. కెమెరా కన్ను ఆ యువకుడిపై పడటంతో క్షణాల్లో అతను 'నిమ్మకాయ బాబా' గా ఫేమస్ అయిపోయాడు.

సోషల్ మీడియాలో మీమ్స్ వర్షం

ఈ వీడియో వైరల్ కావడంతో నెటిజన్లు రకరకాలుగా స్పందించారు. "హైదరాబాద్ వాళ్లు గెలవడానికి ఇవేం పూజలు బాబోయ్!" అని కొందరు.. "క్రికెట్ చరిత్రలోనే బిగ్గెస్ట్ బ్లాక్ మ్యాజిక్ ఇది" అని మరికొందరు మీమ్స్ సృష్టించారు. ముఖ్యంగా సన్‌రైజర్స్ ఫ్యాన్స్ అయితే "మా వాళ్లకు మంత్రగాళ్ల అండ కూడా దొరికింది" అంటూ సరదాగా కామెంట్లు చేశారు. ఆ యువకుడి నటన ఎంత సహజంగా ఉందంటే.. నిజంగానే అతను ఏదో మంత్రం వేసి వికెట్ పడగొట్టాడేమో అని అందరూ నమ్మేంతలా వైరల్ అయింది.

అసలు నిజం బయటపెట్టిన 'వైరల్ మంత్రగాడు'

ఈ వైరల్ వీడియోలో కనిపించిన యువకుడి పేరు సన్నీ. హైదరాబాద్ లోనే ఉంటాడు. ఎస్.ఆర్.హెచ్ కు వీరాభిమాని. తన వీడియో ఇంతలా వైరల్ అవుతుందని అతను అస్సలు ఊహించలేదు. నెట్టింట జరుగుతున్న ప్రచారానికి ఫుల్ స్టాప్ పెడుతూ సన్నీ అసలు విషయం బయటపెట్టాడు. తనకు మంత్రాలు, తంత్రాలు ఏమీ తెలియవని.. తాను కేవలం ఒక సాదాసీదా క్రికెట్ అభిమానినని స్పష్టం చేశాడు.

నిమ్మకాయ ఎందుకు తీసుకెళ్లాడంటే?

స్టేడియంకు వెళ్లే సమయంలో తనకు కాస్త అస్వస్థతగా అనిపించిందని.. ఆ వికారం తగ్గడానికి నిమ్మకాయ వాసన చూస్తే బాగుంటుందన్న ఉద్దేశంతోనే పోలీసులకు సమస్య చెప్పి మరీ వివరించి దానిని లోపలికి తీసుకెళ్లానని సన్నీ వివరించాడు. అక్కడ మ్యాచ్ మధ్యలో సరదాగా తన స్నేహితులతో కలిసి ఇలా రీల్ కోసం 'మ్యాజిక్' చేస్తున్నట్టుగా యాక్టింగ్ చేశానని చెప్పాడు.

"నేను కళ్లు మూసుకుని మంత్రాలు చదువుతున్నట్లు నటిస్తున్నప్పుడు నా మనసులో ఉన్నది కేవలం రెండు విషయాలే. ఒకటి.. ఈ మ్యాచ్ అయిపోయాక బిర్యానీ ఎక్కడ తినాలి? రెండోది.. రేపు ఆఫీస్ పనులు ఎలా పూర్తి చేయాలి? అంతకు మించి నా తల లోపల ఏ మంత్రాలూ లేవు. ఆ సమయంలో వికెట్ పడటం కేవలం కాకతాళీయం మాత్రమే." అని సన్నీ నవ్వుతూ చెప్పుకొచ్చాడు.

వినోదానికి కేరాఫ్ అడ్రస్ ఐపీఎల్

సన్నీ చేసిన ఈ చిన్న సరదా పని అతనికి ఓవర్ నైట్ క్రేజ్ తెచ్చిపెట్టింది. క్రికెట్ అంటే కేవలం గెలుపోటములు మాత్రమే కాదు, ఇలాంటి వినోదాత్మక ఘటనలు కూడా అభిమానులకు మంచి రిలీఫ్‌ని ఇస్తాయి. మూఢనమ్మకాలను ప్రోత్సహించకపోయినా ఈ 'నిమ్మకాయ మహిమ' మాత్రం ఐపీఎల్ సీజన్-2024 లో ఒక మధుర జ్ఞాపకంగా మిగిలిపోతుంది. మొత్తానికి సన్నీ చెప్పిన సమాధానంతో ఉప్పల్ స్టేడియంలో జరిగిన ఆ 'బ్లాక్ మ్యాజిక్' మిస్టరీ వీడిపోయింది!




Tags:    

Similar News