శుభ్‌మన్ గిల్ పెళ్లిపై ప్రశ్న.. టాస్ సమయంలో వింత పరిస్థితి!
ఐపీఎల్ 2026 సీజన్‌లో గుజరాత్ టైటాన్స్ - పంజాబ్ కింగ్స్ మధ్య జరిగిన మ్యాచ్ టాస్ సమయంలో ఒక ఆసక్తికరమైన.. కొంత ఇబ్బందికరమైన సన్నివేశం చోటుచేసుకుంది.;
ఐపీఎల్ 2026 సీజన్‌లో గుజరాత్ టైటాన్స్ - పంజాబ్ కింగ్స్ మధ్య జరిగిన మ్యాచ్ టాస్ సమయంలో ఒక ఆసక్తికరమైన.. కొంత ఇబ్బందికరమైన సన్నివేశం చోటుచేసుకుంది. ప్రెజెంటర్ డానీ మోరిసన్ అసందర్భంగా గుజరాత్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్‌ను వివాహ ప్రణాళికల గురించి మళ్ళీ ప్రశ్నించారు. ఆట వ్యూహాలు.. జట్టు కూర్పు గురించి చర్చించాల్సిన సమయంలో ఇలా వ్యక్తిగత ప్రశ్న ఎదురవ్వడంతో స్టేడియంలో ఉన్న వారంతా ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు.
డానీ మోరిసన్ ఇలా గిల్‌ను వ్యక్తిగత విషయాలపై ప్రశ్నించడం ఇదే మొదటిసారి కాదు. గత ఐపీఎల్ 2025 సీజన్‌లో కూడా మోరిసన్ ఇలాంటి ప్రశ్నే అడిగి వార్తల్లో నిలిచారు. ఇప్పుడు మరోసారి అదే ప్రశ్నను పునరావృతం చేయడంతో గిల్ కొంత అసౌకర్యానికి గురైనా.. ఎంతో సంయమనంతో ప్రశాంతంగా ఆ పరిస్థితిని ఎదుర్కొన్నారు. ప్రస్తుతానికి పెళ్లి ఆలోచన లేదని అతడు జవాబిచ్చాడు. అయితే ఒక ప్రొఫెషనల్ వేదికపై ఇలాంటి ప్రశ్నలు అడగడంపై సోషల్ మీడియాలో నెటిజన్లు తీవ్రంగా స్పందిస్తున్నారు.
మోరిసన్ వైఖరిపై క్రికెట్ అభిమానులు సోషల్ మీడియా వేదికగా విమర్శలు గుప్పిస్తున్నారు. గిల్ కంటే మోరిసన్‌కే అతడి పెళ్లి గురించి ఎక్కువ ఆందోళన ఉన్నట్లు కనిపిస్తోందని కొందరు ఎద్దేవా చేయగా.. మరికొందరు ``నీ పెళ్లికి మోరిసన్‌ను పిలవడం మర్చిపోకు గిల్`` అంటూ జోకులు పేల్చుతున్నారు. మ్యాచ్ టాస్ వంటి కీలక సమయంలో వ్యక్తిగత విషయాలను లాగడం అనవసరమని మెజారిటీ అభిమానులు అభిప్రాయపడుతున్నారు.
ఇక క్రికెట్ విషయానికి వస్తే... ఈ మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. గుజరాత్ బౌలర్ల ధాటికి పంజాబ్ కింగ్స్ బ్యాటర్లు విలవిలలాడారు. కేవలం 47 పరుగులకే పంజాబ్ 5 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. మహమ్మద్ సిరాజ్ , జేసన్ హోల్డర్ అద్భుతంగా బౌలింగ్ చేసి తలో రెండు వికెట్లు తీసి పంజాబ్ టాపార్డర్‌ను దెబ్బతీశారు. పంజాబ్ బ్యాటర్లు ఈ మ్యాచ్‌లో కనీస ప్రతిఘటన చూపలేకపోయారు.
ఈ మ్యాచ్ ద్వారా నిశాంత్ సింధు గుజరాత్ టైటాన్స్ తరపున ఐపీఎల్ అరంగేట్రం చేశాడు. పంజాబ్ జట్టులో కూడా కొన్ని మార్పులు జరిగాయి. ముఖ్యంగా స్టార్ ప్లేయర్ శశాంక్ సింగ్ గాయం కారణంగా ఈ మ్యాచ్‌కు దూరం కావాల్సి వచ్చింది. గిల్ పెళ్లి వార్త పక్కన పెడితే.. మైదానంలో మాత్రం గుజరాత్ టైటాన్స్ పూర్తి ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తూ మ్యాచ్‌లో విక్టరీ సాధించింది.