2019లో ఏపీలో వైసీపీదే అధికారం

Update: 2019-01-01 06:09 GMT
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత బాలశైరి చంద్రబాబుపై నిప్పులు చెరిగారు. కొద్దిరోజులుగా శ్వేతపత్రాలంటూ మాయమాటలు చెబుతున్న బాబు వైఖరిని తూర్పార పట్టారు. ఏపీ అభివృద్ధిపై చంద్రబాబు ఇప్పటివరకు తొమ్మిది శ్వేతపత్రాలు విడుదల చేశారని.. ఆయనకు నిజంగా దమ్ముంటే పార్టీ ఫిరాయించిన 23మంది వైసీపీ ఎమ్మెల్యేలకు ఎన్ని కోట్లు ఇచ్చి కొన్నారో శ్వేతపత్రం విడుదల చేయాలని బాలశౌరి డిమాండ్ చేశారు. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ఘనవిజయం సాధించి అధికారంలోకి రావడం ఖాయమన్నారు..

గతంలో యూపీఏ చైర్ పర్సన్ సోనియాగాంధీని చంద్రబాబు దెయ్యం అంటూ విమర్శించారని.. ఇప్పుడు ఆమె దెయ్యంలా కనిపించడం లేదా అని బాలశౌరి ప్రశ్నించారు. 2014 ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలు, అలాగే ఈ నాలుగున్నరేళ్లలో అమలు చేసిన హామీలపై కూడా శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. హైకోర్టు విభజన చేయమని.. సుప్రీం కోర్టులో చంద్రబాబు ప్రభుత్వం అఫిడవిట్ వేసిందని.. ఇప్పుడు విభజించాక వసతులు లేవంటూ దొంగనాటకాలాడుతున్నారని విమర్శించారు. హైకోర్టుకు భవనాలు కట్టడంతో చంద్రబాబు విఫలమయ్యారని మండిపడ్డారు. చంద్రబాబు ధర్మ పోరాట దీక్షల్లో ధర్మం లేదని.. చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేష్ ఏపీ ప్రజల చెవుల్లో పూలు పెట్టే ప్రయత్నాలు చేస్తున్నారని విమర్శించారు.

దివంగత ముఖ్యమంత్రులు వైఎస్ రాజశేఖర్ రెడ్డి, జయలలితల బయోపిక్ లు తెరకెక్కుతున్నాయని.. ఇదే తరహాలో చంద్రబాబు బయోపిక్ కూడా తీస్తే దానికి మహానగరంలో మాయగాడు.. యూటర్న్ మోసగాడు అనే టైటిల్ పెట్టవచ్చని బాలశౌరి ఎద్దేవా చేశారు. తమ పార్టీ అధినేత వైఎస్ జగన్ ను ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి తిడితే చంద్రబాబు ముసిముసిగా నవ్వారని.. ఆయనకు సంస్కారం ఉందా అని ప్రశ్నించారు.

మోడీని ఏం చేసే దమ్ములేక బాబు.. వైఎస్ జగన్ పై విమర్శలు చేస్తున్నారని వైసీపీ ఎమ్మెల్సీ కోలగట్ల వీరభద్ర స్వామి మండిపడ్డారు. మోడీతో తమకు సంబంధాలు అంటగట్టి రాజకీయ ప్రయోజనాలు పొందాలనుకోవడం దారుణమని విమర్శించారు. తన తప్పులు కప్పిపుచ్చుకోవడానికే బాబు రాష్ట్ర ప్రజలను వాడుకుంటున్నారని అన్నారు.
Tags:    

Similar News