కేంద్రంలో మంత్రుల్లేకుంటే నిధులురావ్‌!

Update: 2015-10-13 14:37 GMT
కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు సరికొత్త రాజ్యాంగ నియమావళిని ప్రతిష్ఠించే ప్రయత్నం చేస్తున్నారా? లేదా, రాజ్యాంగం ప్రతిపాదించే పాలనపరమైన నియమాలకు కొత్త భాష్యం చెప్పాలనుకుంటున్నారా? ఏదేమైనప్పటికీ ప్రజల్ని మాత్రం తప్పుదోవ పట్టించదలచుకుంటున్నారు. ప్రతిపక్షం నీతి తప్పి.. వక్రపు ఆరోపణలు గుప్పిస్తూ.. ప్రభుత్వంలోని ప్రత్యర్థుల మీద ప్రజల్లో అపోహలు కలిగించడానికి పాట్లు పడుతూ ఉండడం అతి సహజం. అలాంటి వాటిని తిప్పికొట్టాల్సిన బాధ్యత ఆయనకు లేదని అనలేం. అయితే.. అలా విమర్శలను తిప్పికొట్టడం అనేది సూటిగా ఉండాలి గానీ.. ఆ ప్రతివిమర్శలకు మళ్లీ మసిపూసి మారేడుకాయ చేయకూడదు. ప్రజలను బురిడీ కొట్టించాలని అనుకోకూడదు.

వైఎస్‌ జగన్‌ ప్రత్యేకహోదా కోసం తమ పార్టీని ఉద్యమింపజేస్తున్నారు. ఇవాళ్టి వరకు దీక్ష కూడా చేశారు. ఈ ప్రాసెస్‌ లో భాగంగా.. కేంద్రప్రభుత్వంలో ఉన్న తెలుగుదేశం పార్టీ మంత్రులు తమ పదవులకు రాజీనామాలు చేస్తే ప్రత్యేక హోదా వచ్చేస్తుందని అంటూ.. జగన్‌ ఒకవైపు జనాన్ని బురిడీ కొట్టించేందుకు ప్రయత్నించారు. కేంద్రమంత్రుల రాజీనామాకు హోదాకు సంబంధం ఏమిటి? కేంద్రంలోని మోడీ సర్కార్‌ మంత్రుల రాజీనామాలకు బెదిరిపోయి విధాన నిర్ణయాలు తీసుకునేంత ఘోరమైన మెజారిటీతో అక్కడ ఉన్నదా? మంత్రుల రాజీనామాలు కాదు కదా.. తెలుగుదేశం పార్టీ ఎన్డీయేను ఛీత్కరించి బయటకు వచ్చినా కూడా.. అసలు వారిలో చలనం ఉండదు గాక ఉండదు. కానీ జగన్‌ తనకు వాస్తవాలు అనవసరం గనుక.. ప్రభుత్వాన్ని నిందించడం తనకు అవసరం గనుక.. వారు రాజీనామాలు చేయాలని కోరుతూ ప్రజల్ని మభ్యపెట్టారు.

దానికి ప్రతిస్పందన అన్నట్లుగా వెంకయ్యనాయుడు ప్రజల్ని మరో రకంగా బురిడీ కొట్టించాలని చూస్తున్నారు. కేంద్రంలోంచి తెదేపా మంత్రులు బయటకు వచ్చేస్తే.. మరి రాష్ట్రానికి నిధులెలా వస్తాయ్‌ అని ఆయన ప్రశ్నిస్తున్నారు. ఇదేం వితండవాదమో మనకు అర్థం కాదు. ఒక రాష్ట్రం నుంచి కేంద్రంలో మంత్రులు లేకపోతే.. ఇక ఆ రాష్ట్రానికి నిధులు ఇవ్వకూడదని ఎక్కడైనా రాజ్యాంగంలో నిబంధన ఉన్నదేమో వెంకయ్యనాయుడే వివరించి చెప్పాలి. ఆయన జగన్‌ చేస్తున్న దుష్ప్రచారాన్ని నేరుగానే తిప్పికొట్టాలి తప్ప... తాను కూడా మరో రకమైన మోసపూరిత వ్యాఖ్యానాలు చేయకూడదు.
Tags:    

Similar News