జగన్ సీఎం అయితే సంతోషిస్తా - ఉండవల్లి!

Update: 2016-08-29 04:42 GMT
కాంగ్రెస్ ఎంపీ గా - వైఎస్ కు అత్యంత సన్నిహితుడిగా - సమైక్యాంద్ర ఉద్యమసమయంలో ఏపీనుంచి తన వాయిస్ ను బలంగా వినిపించిన ఉండవల్లి అరుణ్ కుమార్.. 2014 సార్వత్రిక ఎన్నికల అనంతరం ఏ రాజకీయ పార్టీకి చెందని వ్యక్తిగా మిగిలారు. అయితే పార్టీలకు అతీతంగా ప్రజాసమస్యలపై మాత్రం తన పోరాటం, ప్రశ్నించే తత్వం మారదని వ్యాఖ్యానిస్తున్నారు. ఈ క్రమంలోనే ఏపీ రాజధాని అమరావతిపై తనకున్న అనుమానాలను, భవిష్యత్తులో రాష్ట్రానికి రాబోయే సమస్యలను ప్రస్థావిస్తూ "భ్రమరావతి" అనే బుక్ లెట్ ను తాజగా విడుదలచేశారు.

ఈ సందర్భంగా కొన్ని ఆసక్తికర విషయాలను ఆయన ఆ బుక్ లెట్ లో ప్రస్థావించారు. తాజాగా ఒక టీవీ చానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో.. వైఎస్ రాజశేఖర్ రెడ్డి - సీఎం చంద్రబాబు నాయుడు - వైఎస్ జగన్ లపై తనదైన శైలిలో ఆశ్చర్యకరమైన వ్యాఖ్యలు చేశారు.

వైఎస్ కు అత్యంత సన్నిహితుడైన ఉండవల్లి, జగన్ విషయంలో స్పందిస్తూ... వైఎస్ రాజశేఖర్ రెడ్డి కొడుకు ముఖ్యమంత్రి అవుతాడంతే తాను సంతోషిస్తానని అన్నారు. మా నాయకుడి కొడుకుగా జగన్ పై అభిమానం ఉండటం సహజమైన విషయమని, అతడు మా కళ్లముందు పెరిగిన కుర్రాడని, అతడే సీఎం అయితే ఆనందిస్తానని చెప్పారు. దీంతో ఈ మాటలు వైకాపా కార్యకర్తలకు కొత్త ఉత్సాహాన్ని, మోరల్ సపోర్ట్ ని ఇచ్చినట్లే నని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.

ఇక చంద్రబాబు విషయంలో స్పందించిన ఉండవల్లి.. తన మార్కు వెటకారం మొత్తాన్ని బయటకు తీశారు. ప్రత్యేక హోదా విషయంలో చంద్రబాబు గనుక కన్నెర్ర చేస్తే.. మోడీ గీడీ ఎక్కడాగుతారని అన్నారు. మోడీని ఎట్టిపరిస్థితుల్లోనూ నమ్మొద్దని ఇప్పుడు మరలా చంద్రబాబు చెప్పినా కూడా ప్రజలు నమ్ముతారని, చంద్రబాబుకు ఆ స్థాయి గ్లామర్ ఉందని తనదైన స్టైల్లో చెప్పుకొచ్చారు ఉండవల్లి. అక్కడితో తన (వెటకారపు) మాటలను ఆపని ఉండవల్లి.. చంద్రబాబు కంప్యూటర్ కనిపెట్టాడని, సింధుకు షటిల్ ఆడటం నేర్పాడని అన్నారు. ఇలాంటివన్నీ వింటుంటే మనకు నవ్వొస్తుంది కానీ, మిగతా దేశమంతా చంద్రబాబు మాటలను నమ్ముతారని అన్నారు. ఏపీకి ప్రత్యేకహోదా అనే అంశంపై చంద్రబాబుకు ఆసక్తి లేదేమో అని అనిపిస్తుంటుందని, హోదాపై ఆయన వైఖరేమిటో తనకు అర్థంకావడం లేదని, అమరావతి నిజ స్వరూపాన్ని త్వరలోనే బయటపెడతానని ఉండవల్లి చెప్పుకొచ్చారు.
Tags:    

Similar News