కరోనాతో తిరుమల శ్రీవారి అర్చకుడి మృతి.. ఏమిటిది తిరుమలేశా?

Update: 2020-08-06 17:33 GMT
నిత్యం కళకళలాడుతూ.. నిత్య కల్యాణం పచ్చ తోరణంగా కనిపించే తిరుమల ఇప్పుడు భక్తజన సందోహం లేక వెలవెలబోయింది. ఒకప్పుడు రోజుకు తక్కువలో తక్కువ అరవై.. డెబ్భై వేల మంది భక్తులు దర్శనాలు చేసుకుంటే.. స్వామివారి చెంతకు అంతే మంది వచ్చిపోతుండేవారు. అలా నిత్యం హడావుడిగా ఉండే తిరుమల గిరులు.. మాయదారి కరోనా తర్వాత.. పరిస్థితులు మారిపోయాయి.

ఇటీవల కాలంలో కరోనా కేసులు ఏపీలో ఎక్కువగా నమోదు కావటం.. ప్రయాణ సౌకర్యాలు పరిమితంగా ఉండటం.. ప్రయాణాలు ఏ మాత్రం మంచిది కాదన్న సలహాలు.. సూచనలతో పాటు.. టీటీడీ విధించుకున్న స్వీయ నిబంధనలకు రోజుకు మూడు వేల మందికి మించి దర్శనం చేసుకోని పరిస్థితి. అప్పుడప్పుడు టీటీడీ జారీ చేస్తున్న టోకెన్లకు తగ్గట్లు భక్తులు రాని పరిస్థితి ఉంది.

ఇదంతా ఒక ఎత్తు అయితే.. తాజాగా తిరుమలలోవిషాదం చోటు చేసుకుంది. శ్రీవారి అర్చకుడు ఎన్వీ శ్రీనివాసాచార్యులు కరోనాతో కన్నుమూసినట్లుగా చెబుతున్నారు. గతంలో ఆయన తిరుపతి గోవిందరాజ స్వామి ఆలయం నుంచి డిప్యూటేషన్ మీద తిరుమలకు వచ్చారు.

వారం క్రితం ఆయనకు కరోనా సోకటంతో తిరుపతిలోని స్విమ్స్ లో చేర్చారు. తాజాగా ఆయన పరిస్థితి విషమించటంతో కన్నుమూసినట్లుగా తెలుస్తోంది. ఈ వార్తను టీటీడీ అధికారికంగా ధ్రువీకరించాల్సి ఉంది. మరోవైపు టీటీడీలో శ్రీవారి ఆలయయంలో అర్చకులుగా పని చేస్తున్న పలువురికి కరోనా సోకిన వైనం తెలిసిందే. వారందరికి స్విమ్స్ లో చేర్చారు. కొందరి పరిస్థితి ఆందోళకరంగా ఉండటంతో వారిని చెన్నై ఆసుపత్రికి తరలించారు. ఇదంతా ఒక ఎత్తు అయితే..ఆలయ పెద్ద జీయంగార్ సైతం కరోనా బారిన పడి కోలుకున్నారు. ఇలా తిరుమల శ్రీవారి ఆలయంలో ఆర్చకత్వం చేసే పలువురు ఈ మామహ్మారి బారిన పడటంతో ఆందోళనకు గురవుతున్నారు.
Tags:    

Similar News