డబుల్ హ్యాట్రిక్ రేసులో తెలంగాణ ముఖ్య‌నేత‌లు

Update: 2018-12-08 06:50 GMT
తెలంగాణ ఎన్నిక‌ల్లో కీల‌క‌మైన పోలింగ్ ఘ‌ట్టం ముగియ‌డంతో ఇప్పుడంతా ఫ‌లితాల‌పై ఆస‌క్తి నెల‌కొంది. పలువురు మ‌హామ‌హులైన సీనియ‌ర్లు ఈ ఎన్నిక‌ల్లో బ‌రిలో ఉండ‌గా...కొంద‌రు యువ‌నేత‌లు సైతం పోటీ ప‌డుతున్నారు. అయితే, ఈ సంద‌ర్భంగానే ఆస‌క్తిక‌ర‌మైన ప్ర‌త్యేక‌త వార్త‌ల్లో నిలుస్తోంది. అదే కొంద‌రు నేత‌లు డ‌బుల్ హ్యాట్రిక్ సాధించ‌డం. ఒకే రకమైన విజయాన్ని మూడుసార్లు సాధిస్తే హ్యాట్రిక్ కొట్టాడని అంటాం. అది ఆట అయినా లేక మరేదైనా కూడా. ఈ ఎన్నికల వేళ రెండో హాట్రిక్ (ఆరోసారి)ను పూర్తి చేసే దిశగా తెలంగాణలో పలువురు ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యే స్థానాలకు పోటీకి దిగుతుండటం ఒక అపురూప సన్నివేశంగా మారింది.

హ‌రీశ్ రికార్డు స్థాయి డ‌బుల్ హ్యాట్రిక్‌

టీఆర్ ఎస్ పార్టీ ట్ర‌బుల్ షూట‌ర్‌గా పేరొందిన మంత్రి హరీశ్‌ రావు అతిచిన్న వయసులోనే డబుల్ హ్యాట్రిక్ దిశగా  దూసుకెళ్తున్నారు. ప్రస్తుత ఎన్నికలతో దేశంలో 46 ఏళ్ల‌ వయసులో అసెంబ్లీకి వరుసగా ఆరోసారి ఒకే నియోజకవర్గం నుంచి ఎన్నికైన అభ్యర్థిగా ఆయన అరుదైన రికార్డును సొంతం చేసుకోనున్నారు. సిద్దిపేట నుంచి హరీశ్‌ రావు 2004 ఉపఎన్నికలో ఎన్నికయ్యారు. నాటినుంచి ఆయనకు ఓటమి అన్నదే లేదు. 2008 ఉపఎన్నిక - 2009 సాధారణ ఎన్నికలు - 2010 ఉపఎన్నిక - 2014 సాధారణ ఎన్నికల్లో విజయాలు సొంతం చేసుకున్నారు. ప్రత్యర్థులు కనీసం డిపాజిట్లు దక్కించుకోవడానికే అపసోపాలు పడే పరిస్థితి.

పదేళ్ల‌లో అయిదుసార్లు ఎన్నికైన ఈటల

రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి ఈటల రాజేందర్ 2004లో ఉమ్మడి కరీంనగర్ జిల్లా కమలాపూర్ నియోజకవర్గం నుంచి టీఆర్‌ ఎస్ పార్టీ తరఫున ఎన్నికయ్యారు. 2008 ఉప ఎన్నికలోనూ విజయం సాధించారు. నియోజకవర్గాల పునర్విభజన అనంతరం 2009లో హుజురాబాద్ నుంచి గెలుపొందారు. అనంతరం 2010లో రాజీనామాతో జరిగిన ఉపఎన్నికలో కూడా గెలుపొందారు. ఆ తరువాత 2014లోనూ విజయం సాధించారు. ఇలా ఇప్పటి వరకు ఐదుసార్లు అసెంబ్లీకి ఎన్నికై ప్రస్తుతం ఆరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.

33 ఏళ్ల‌ అనుభవజ్ఞుడు తుమ్మల

రోడ్లు భవనాలశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌ రావు ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గం నుంచి టీడీపీ తరఫున 1985లో తొలిసారి గెలిచారు. ఆ తరువాత 1994 - 1999లో గెలుపొందారు. నియోజకవర్గాల పునర్విభజనలో సత్తుపల్లి రిజర్వ్‌ డ్ కేటగిరిలోకి మారడంతో 2009లో ఖమ్మం నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలిచారు. 2015లో పాలేరుకు జరిగిన ఉపఎన్నికలో టీఆర్‌ ఎస్ అభ్యర్థిగా గెలుపొందారు. టీడీపీ హయాంలోనూ ఆయన మంత్రిగా పనిచేసిన సంగ‌తి తెలిసిందే.
4

ఆరోసారి పోచారం

రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌ రెడ్డి బాన్సువాడ నుంచి ఆరోసారి అసెంబ్లీకి ఎన్నిక కావడానికి పోటీలో ఉన్నారు. 1994లో తొలిసారిగా ఆయన అసెంబ్లీకి ఎన్నికయ్యారు. ఆ తరువాత 1999 - 2009లో టీడీపీ తరఫున గెలుపొందారు. తరువాత టీఆర్‌ ఎస్‌ లో చేరారు. 2011లో పదవికి రాజీనామా చేసిన తరువాత వచ్చిన ఉపఎన్నికలో టీఆర్‌ ఎస్ పార్టీ అభ్యర్థిగా గెలిచారు. తర్వాత ఆయన 2014లోనూ గెలుపొందారు. తాజాగా ఆయన బాన్సువాడ నుంచి బరిలో నిలిచారు. ఆయన గతంలో టీడీపీ ప్రభుత్వంలోనూ ఒకసారి మంత్రిగా ఉన్నారు.

జూపల్లి కృష్ణారావుది అదే రికార్డు

ప్రస్తుత మంత్రి జూపల్లి కృష్ణారావు మహబూబ్‌ నగర్ జిల్లా కొల్లాపూర్‌ నుంచి ఆరోసారి అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలిచారు. 1999లో తొలిసారిగా అసెంబ్లీలో అడుగుపెట్టిన ఆయన ఇప్పటికి ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ఇందులో రెండుసార్లు కాంగ్రెస్ పార్టీ తరఫున గెలువగా మరో రెండుసార్లు టీఆర్‌ ఎస్ తరఫున - ఒకసారి స్వతంత్ర అభ్యర్థిగా విజయం సాధించారు. గతంలో కాంగ్రెస్ పార్టీలో మంత్రిగానూ ఆయన పనిచేశారు.

జనరల్ స్థానంలో రెడ్యా గెలుపు

డోర్నకల్ నియోజకవర్గం నుంచి ఆరోసారి ఎన్నిక కావడానికి రెడ్యానాయక్ ఉవ్విళ్లూరుతున్నారు. 1989 నుంచి 2014 వరకు జరిగిన ఆరు ఎన్నికల్లో 2009లో మినహా ఐదుసార్లు గెలుపొందారు. 1989 నుంచి 2004 వరకు డోర్నకల్ నియోజకవర్గంలో జనరల్ కేటగిరిలో ఉండగా రెడ్యానాయక్ గెలుపొందుతూ వచ్చారు. 2009 నియోజక వర్గాల పునర్విభజనలో డోర్నకల్ ఎస్టీ కేటగిరీకి మారింది. ఐదుసార్లు కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా గెలుపొందిన ఆయన ఈసారి టీఆర్‌ ఎస్ పార్టీ అభ్యర్థిగా బరిలో నిలిచారు. 2004 నుంచి 2009 వరకు ఆయన మంత్రిగానూ పనిచేశారు.

ధర్మపురి నుంచి కొప్పుల ఈశ్వర్

టీఆర్‌ ఎస్ ధర్మపురి అభ్యర్థిగా పోటీ చేస్తున్న కొప్పుల ఈశ్వర్ ఆరోసారి అసెంబ్లీలోకి అడుగిడడానికి పోటీలో ఉన్నారు. 2004నుంచి ఇప్పటి వరకు ఆయన ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. 2004లో కరీంనగర్ జిల్లా మేడారం నియోజకవర్గం నుంచి తొలిసారిగా గెలుపొందగా - 2008 ఉప ఎన్నికలో తిరిగి గెలుపొందారు. నియోజకవర్గాల పునర్విభజనలో మేడారం కనుమరుగై ధర్మపురి ఏర్పడగా - అక్కడినుంచి గెలిచారు. 2010 ఉప ఎన్నికలోనూ విజయం సాధించారు. 2014లో తిరిగి ఎన్నికయ్యారు. ఇలా ఇప్పటి వరకు ఐదుసార్లు విజయం సొంతం చేసుకున్నారు. ఆరోసారి ధర్మపురి నుంచి బరిలో నిలిచారు.

డబుల్ హ్యాట్రిక్ కోసం ఎర్ర‌బెల్లి పోరాటం

సీనియ‌ర్ నేత ఎర్రబెల్లి దయాకర్‌ రావు 1994 నుంచి 2014 వరకు ఇప్పటి వరకు ఐదుసార్లు ఓటమి ఎరుగకుండా గెలుస్తున్నారు. 1994లో వర్ధన్నపేట నుంచి టీడీపీ తరపున ఎన్నికైన ఆయన 1999 - 2004లో కూడా ఆదే నియోజకవర్గం నుంచి గెలిచారు. నియోజకవర్గాల పునర్విభజనలో వర్ధన్నపేట ఎస్సీ వర్గాలకు రిజర్వ్ కావడంతో 2009, 2014లో పాలకుర్తి నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలిచారు. గెలిచిన ఐదుసార్లు కూడా ఆయన టీడీపీ నుంచి గెలువగా ఈసారి ఎన్నికల్లో టీఆర్‌ ఎస్ పార్టీ తరఫున బరిలో నిలుస్తున్నారు. ఈసారి టీఆర్‌ ఎస్ పార్టీ తరఫున పాలకుర్తి నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు.


Tags:    

Similar News