ఈ వేషాలు వదిలేసి.. సభకు వెళ్లొచ్చుగా ‘తమ్ముడు’

Update: 2016-11-21 09:49 GMT
ఓట్లేసిన ఎన్నుకున్న నేతల నుంచి ఓటర్లు ఏం కోరుకుంటారు? తమ సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లటం.. తమ వాదనకు తాము ఎన్నుకున్న నేత గొంతుగా మారాలని భావిస్తారు. అదేం చిత్రమో కానీ.. మిగిలిన పార్టీల్లో కనిపించని కోణం ఏపీ టీడీపీ నేతల్లో కనిపిస్తుంది. నాడు విభజన సమయంలోనూ.. నేడు ప్రత్యేక హోదా అంశంలో.. తాజాగా నోట్ల రద్దు ఎపిసోడ్ లోనూ.. సమస్య వస్తే చాలు.. ముఖానికి రంగు వేసుకొని.. వేషాలు కట్టేసి.. పిట్టకథలు చెప్పటమో.. నాలుగు డైలాగులు చెప్పటమో చేయటం.. ఆ అరగంట ఎపిసోడ్ అయిపోయాక ఇంటికి వెళ్లిపోవటం తెలుగు తమ్ముళ్లు ఒక అలవాటుగా మారింది.

మరీ ముఖ్యంగా చిత్తూరు ఎంపీ శివప్రసాద్ తీరు మరీ అభ్యంతరకరంగా ఉంటోంది. సమస్య వచ్చినప్పుడు.. లోక్ సభలోకి వెళ్లి.. తన వాదనను వినిపించాలి. చట్టబద్ధంగా తనకున్న అవకాశంతో ఆయనేం చేయాలో అది చేయాలి. కానీ.. అవన్నీ మానేసి. అయితే పార్లమెంటు దగ్గరో.. లేదంటే తనకు అనువైన చోట వేషాలు కట్టి.. నిరసనలు చేపడుతూ మీడియా దృష్టిని ఆకర్షించే ప్రయత్నం చేయటం సబబుగా లేదన్న వాదన వినిపిస్తోంది.

నోట్ల రద్దు కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురి అవుతున్నారన్న విషయాన్ని శివప్రసాద్ మనస్ఫూర్తిగా నమ్మిన పక్షంలో.. సభకు వెళ్లి.. మిగిలిన ఎంపీలతోకలిసి ప్రదానిపై ఫైర్ కావాలే కానీ.. అది వదిలేసి.. బుర్రకథలు చెబుతూ.. మీడియా గొట్టాల ముందు ఆవేశంగా ప్రధానిని నాలుగు మాటలు అంటే ఏమైనా ఉపయోగం ఉంటుందా? అన్నది ప్రశ్న. మీడియా వాళ్ల స్లాట్ ను ఫిల్ చేయటం.. పత్రికల్లో కాస్త ఖాళీని భర్తీ చేయటం మినహా.. ప్రభుత్వం మీదా ఎలాంటి ప్రభావం ఉండదన్న విషయాన్ని గుర్తించటం మంచిది. శివప్రసాద్ మార్క్ ఆందోళన కారణంగా ప్రజల కష్టాలు ఏమాత్రం తీరవన్న విషయం ఇప్పటికే అర్థమైంది. ఆయన కూడా అర్థం చేసుకుంటే మంచిది. లేదంటే.. నమ్మి ఓటేసే ఓటర్లు చిరాకు పడిపోవటం ఖాయం.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News