భర్త మోసం చేశాడని.. అంత దారుణానికి పాల్పడింది

Update: 2020-12-11 03:50 GMT
నోటి వెంట మాట రాలేని దారుణం చోటు చేసుకుంది. తమ తప్పేమి లేని ఇద్దరు పిల్లలు.. నమ్మిన పాపానికి ప్రాణాలు పోగొట్టుకున్న వైనమిది. తన భర్త రెండో పెళ్లి చేసుకున్నాడన్న కోపంతో రగిలిపోయిన భార్య.. తన భర్త రెండో భార్య ఇద్దరు పిల్లల్ని దారుణంగా చంపేసిన వైనం జీర్ణించుకోలేనిదిగా మారిందని చెప్పాలి. అది కూడా.. తమ పెళ్లి రోజునాడే తన పగను పూర్తి చేసుకున్న ఈ వైనం పెను సంచలనంగా మారింది.

నల్గొండ పట్టణానికి చెందిన ప్రదీప్.. ప్రసన్నలు ఇద్దరు దంపతులు. ఐసీడీఎస్ శాఖలో కాంట్రాక్టు ఉద్యోగులుగా పని చేస్తున్నారు. భర్త ప్రదీప్ భువనగిరి జిల్లాలో పని చేస్తుంటే.. భార్య ప్రసన్న మునుగోడులో పని చేస్తున్నారు. వీరి పెళ్లి 1999లో జరిగింది. వారికి 20 ఏళ్ల కొడుకు.. 15 ఏళ్ల కూతురు ఉంది. ఇదిలా ఉంటే.. ఎనిమిదేళ్ల క్రితం నల్గొండ పట్టణానికే చెందిన మరో మహిళను పెళ్లి చేసుకున్నాడు. వారికి ఇద్దరు పిల్లలు (ఆరేళ్ల మేఘన.. నాలుగేళ్ల రుచరి) ఉన్నారు.

భర్త రెండో పెళ్లి చేసుకున్న విషయం మూడేళ్ల క్రితం ప్రసన్నకు తెలిసింది. దీంతో.. వారి మధ్య గొడవలు మరింత ఎక్కువ అయ్యాయి. రెండో భార్యతోనూ తరచూ పోట్లాటలు ఉండేవి. ఇదిలా ఉంటే.. తన తీరును పూర్తిగా మార్చుకొని ఆర్నెల్లుగా మాత్రం సఖ్యతగా ఉంటోంది. రెండో భార్యకు తన భర్త ఇల్లు కట్టిస్తున్న విషయాన్ని తెలుసుకొని రగిలిపోయినట్లుగా చెబుతున్నారు. గురువారం వారి పెళ్లిరోజు. తనను మోసం చేసిన భర్తకు గుణంపాఠం చెప్పాలన్న ఉద్దేశంతో దారుణానికి తెర తీసింది.

ఇంట్లో ఎవరూ లేని సమయంలో పక్క కాలనీలో ఉంటున్నరెండో భార్య ఇంటికి వెళ్లిన ప్రసన్న.. వారి ఇద్దరి పిల్లలకు మాయ మాటలు చెప్పి నమ్మించి.. ఇంటికి తీసుకొచ్చింది. తన పుట్టినరోజున కేకు కోస్తున్నట్లుగా వారిని నమ్మించింది. వారిని బెడ్రూంలో ఉంచి ఊరి బిగించి చంపేసింది. ఆ తర్వాత తాను ఆత్మహత్య చేసుకుంది. ఫంక్షన్ కు వెళ్లి వచ్చిన భర్త ఇంటికి రాగానే.. ముగ్గురు విగతజీవులుగా పడి ఉండటాన్ని గుర్తించిన ప్రదీప్ పోలీసులకు సమాచారం ఇచ్చాడు.

ఈ సందర్భంగా అక్కడ సూసైడ్ లెటర్ కనిపించింది. అందులో.. తనను కాదని రెండో పెళ్లి చేసుకున్న తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. ‘‘ఇరవైఏళ్ల కొడుకున్నా రెండో భార్య కావాల్సి వచ్చింది. నీతో సహా మీ కుటుంబంలోని వారంతా నన్ను మోసం చేశారు. అందుకే ఏ రోజు అయితే నీ జీవితంలో అడుగుపెట్టానో.. అదే రోజు వెళ్లిపోతున్నా. ఇకపై నీకు ఎవరు అడ్డురారు’’ అంటూ సూసైడ్ నోట్ రాసింది. భర్త మోసం చేస్తే.. రెండో భార్య ఇద్దరు పిల్లల్ని దారుణంగా చంపాల్సినంత క్రూరత్వం హాట్ టాపిక్ గా మారింది.
Tags:    

Similar News