బీహార్ లో రెండో దశ మొదలైంది

Update: 2015-10-16 05:24 GMT
నువ్వా.. నేనా అన్నట్లుగా సాగుతున్నబీహార్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో రెండో దశ ఈ రోజు ఉదయం నుంచి మొదలైంది. మొత్తం ఐదు దశల్లో జరగనున్న ఎన్నికల్లో శుక్రవారం రెండో దశ పోలింగ్ షురూ అయ్యింది.

రెండో దశలో 32 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎన్నికల్ని నిర్వహిస్తున్నారు. ఈ దశలో మొత్తం 456 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. తాజాగా జరుగుతున్న 32 నియోజకవర్గాలకు సంబంధించి భద్రతాపరమైన సమస్యలు ఉన్న కారణంగా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. పోలింగ్ సమయం సైతం కుదించారు. మొత్తం 32 స్థానాల్లో  11 నియోజకవర్గాల్లో మధ్యాహ్నం మూడు గంటలకే పోలింగ్ ముగియనుంది. మరో 12 నియోజకవర్గాల్లో మాత్రం సాయంత్రం నాలుగు గంటలకే పోలింగ్ పూర్తి చేస్తారు.

ఈ దశలో 86.13లక్షల మంది ఓటర్లు తమ ఓటుహక్కును వినియోగించనున్నారు. ఇక.. ఈ రెండో దశ పోలింగ్ లో విశేషం ఏమిటంటే.. బీహార్ మాజీ ముఖ్యమంత్రి జితిన్ రాంమాంఝీ.. ప్రస్తుత అసెంబ్లీ స్పీకర్ ఉదయ్ నారాయణ్ చౌదరి (జేడీయూ)..బీజేపీ సీనియర్ నేతలు ప్రేమ్ కుమార్.. గోపాల్ నారాయణ్ సింగ్ లతో పాటు.. మంత్రి జయ్ కుమార్ సింగ్ లు భవితవ్యం ఈ రోజు బ్యాలెట్ బాక్సుల్లో నిక్షిప్తం కానుంది.
Tags:    

Similar News