తిరుగుబాటు ఎంపీది వితండ వాదనేనా ?

Update: 2022-05-24 06:00 GMT
తన పై వైసీపీ ఇచ్చిన అనర్హత పిటిషన్ పై తిరుగుబాటు ఎంపీ రఘురామకృష్ణంరాజు నోటికొచ్చినట్లు మాట్లాడారు. తన పై అనర్హత వేటు పడుతుందన్న భయమో లేకపోతే సభా హక్కుల ఉల్లంఘన కమిటీ వాదనలు వినటాన్నే ఎంపీ తట్టుకోలేకపోతున్నారో అర్ధం కావటం లేదు.

తన పై అనర్హత వేటుకు తెలుగుదేశం పార్టీలో కొందరు ఎంఎల్ఏల వ్యవహార శైలికి ముడిపెట్టి మాట్లాడటమే విచిత్రంగా ఉంది. పార్టీ గుర్తు పై గెలిచి అదే పార్టీని విమర్శిస్తున్నందుకు తనపై అనర్హత వేటు వేయాలని కోరుతున్న వైసీపీకి వేరే పార్టీల గుర్తుల పై గెలిచిన ఎంఎల్ఏల వ్యవహారం గుర్తుకు రాలేదా అని అడుగుతున్నారు.

ఈ ప్రశ్న వేయటంలోనే ఎంపీ వితండవాదం బయటపడుతోంది. వైసీపీ గుర్తు పై గెలిచి పార్టీని, ప్రభుత్వాన్ని, జగన్మోహన్ రెడ్డిని వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తున్న కారణంగానే రఘురాజు పై అనర్హత వేటు వేయాలని పార్టీ డిమాండ్ చేస్తోంది. వైసీపీ చేస్తున్న డిమాండ్ కు రఘురాజు లేవనెత్తిన ప్రశ్నకు అసలు సంబంధమే లేదు. 2019 ఎన్నికల్లో టీడీపీ గుర్తు పై గెలిచిన ఎంఎల్ఏల్లో నలుగురు పార్టీకి దూరమైపోయారు. అయితే వారెవరూ వైసీపీలో చేరలేదు.

టీడీపీకి దూరమైన నలుగురు ఎంఎల్ఏలు వల్లభనేని వంశీ, మద్దాలిగిరి, కరణం బలరామ్, వాసుపల్లి గణేష్ తమకు అసెంబ్లీ ప్రత్యేకంగా సీట్లు కేటాయించాలని స్పీకర్ ను అడిగారు. అంతేకానీ తామను వైసీపీ సభ్యులుగా గుర్తించమని స్పీకర్ ను కోరలేదు.

అలాగే వారిపై అనర్హత వేటు వేయమని అడగాల్సిన తెలుగుదేశం పార్టీ ఇంతవరకు ఆ పని చేయలేదు. టీడీపీ గుర్తు పై గెలిచి చంద్రబాబునాయుడు పై నోటికొచ్చినట్లు మాట్లాడుతూ, వైసీపీతో అంటకాగుతున్న ఎంఎల్ఏల పైన అనర్హత వేటు వేయాలని డిమాండ్ చేయాల్సింది, పిటీషన్ ఇవ్వాల్సింది టీడీపీయే.

టీడీపీ అనర్హత పిటీషన్ ఇవ్వనపుడు స్పీకర్ కు మాత్రం వారి పై అనర్హత వేటు వేయాల్సిన అవసరం ఏముంటుంది ? అనర్హత వేటు వేయించటంలో చంద్రబాబుకు లేని దురద స్పీకర్ కు ఎందుకుంటుంది ? కానీ ఎంపీ పై అనర్హత వేటు వేయాలని వైసీపీ ఏడాదిన్నరగా పోరాటం చేస్తోంది. ఈ లాజిక్ వదిలేసి ఎంపీ వితండవాదం చేస్తుండటమే విచిత్రంగా ఉంది.
Tags:    

Similar News