పవన్ దీక్ష... ప్రకటన రేపే!

Update: 2018-04-03 06:05 GMT
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆమరణ నిరాహార దీక్షకు పూనుకోబోతున్నారు.  రాష్ట్రం కోసం పాటు పడిన వారిలో పొట్టి శ్రీరాములు స్ఫూర్తిని తీసుకుంటున్నట్లు గుంటూరు బహిరంగసభ వేదికగానే సంకేతాలు ఇచ్చిన పవన్ కళ్యాణ్... ఇప్పుడు ఆయన తరహాలోనే రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించడానికి తన ప్రాణాలను పణంగా ఒడ్డి పోరాడడానికి నిర్ణయించుకున్నారు. మూడు నాలుగు రోజులలో పోలీసులు వచ్చి లేపేయగానే... దీక్షా శిబిరం నుంచి ఆస్పత్రికి తరలిపోయే దీక్ష లాగా కాకుండా ... తన పోరాట పటిమను మరింత ఘనంగా బయటపెట్టే లాగా ఆయన దీక్షకు పూనుకోవాలని అనుకుంటున్నారు. నిరాహార దీక్షకు సంబంధించిన అధికారిక ప్రకటన బుధవారం నాడు విజయవాడలో పవన్ కళ్యాణ్ చేసే అవకాశముందని పార్టీ వర్గాల ద్వారా తెలుస్తోంది.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అతిధి లాగా వస్తూ పోతూ అక్కడ రాజకీయాలు నడుపుతున్న పవన్ కళ్యాణ్... గురువారం విజయవాడలోనే పర్యటించనున్నారు. బుధవారం తన జనసేన కూటమిలో భాగస్వాములుగా వుండే వామపక్షాల నాయకులు మరికొందరు పార్టీ సీనియర్లతో ఆయన భేటీ అవుతారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించే పోరాటానికి సంబంధించి భవిష్యత్ కార్యాచరణ ప్రణాళిక గురించి ఆ భేటీలో చర్చిస్తారు. అలాగే పవన్ కళ్యాణ్ ఆమరణ నిరాహారదీక్షకు సరైన సమయంలో సరైన వేదిక గురించి కూడా ఈ సమావేశంలోనే తుది నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. తాను ఢిల్లీ వెళ్లనని,  రాష్ట్రంలోనే దీక్షకు కూర్చోవడం ద్వారా ఢిల్లీని గడగడలాడిస్తానని  పవన్ కళ్యాణ్ గుంటూరు సభలోనే వెల్లడించారు. విశ్వసనీయంగా తెలుస్తున్న సమాచారాన్ని  బట్టి, పార్లమెంటు ముగిసేలోగా అంటే ఆరవ తేదీ లోగానే ఆయన అమరావతిలోనే దీక్షకు కూర్చుంటారు.

వైయస్సార్ కాంగ్రెసు ఎంపీలందరూ ఢిల్లీలో ఆమరణ నిరాహారదీక్ష చేయబోతుండటం, చంద్రబాబునాయుడు ఢిల్లీ వేదికగా భాజపా వ్యతిరేక శక్తులన్నీ ఏకం చేయడానికి ప్రయత్నిస్తుండటం నేపథ్యంలో తాను కూడా దీక్ష వంటి గట్టి పనికి పూనుకోకుంటే... పార్టీ నష్టపోతుందని పవన్ కళ్యాణ్ భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. అందుకే ఆమరణ నిరాహారదీక్ష షెడ్యూలు అనుకున్న తేదీ కంటే ముందుకు తెస్తున్నట్లు సమాచారం.

పవన్ – ‘ఎవరి రాజధాని - అమరావతి?’ అనే పుస్తక ఆవిష్కరణ లో కూడా పాల్గొన బోతున్నారు. ప్రజా సమస్యలపై ఒకటి రెండు జిల్లాలో పర్యటించే అవకాశం కూడా ఉందని తెలుస్తోంది. మరి ఏ షెడ్యూల్ ఎలా మారుతుందో బుధవారం సాయంత్రానికి స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
Tags:    

Similar News