మహిళలపై పవన్ వైఖరేంటి..!?

Update: 2018-08-14 16:56 GMT
పవన్ కల్యాణ్. జనసేన పార్టీతో ఆంధ్రప్రదేశ్‌ లో కొత్తగా ఎన్నికల బరిలో దిగుతున్నారు. తనకున్న సినిమా గ్లామర్‌ తో రాజకీయ వేదికపై కొత్త శకాన్ని రచించాలని ఉవ్విళ్లూరుతున్నారు. ఆయనకున్న సినీ గ్లామర్‌ తో పాటు పవనిజం పేరుతో ఓ కొత్త సిద్దాంతానికి రూపకల్పన చేసి ప్రజల ముందుకు వస్తున్నారు. తాను స్వచ్ఛమైన మనిషినని - తనకు డబ్బు యావ లేదంటూ పదే పదే చెబుతున్నారు. అలాగే తనకు కులాలంటే గిట్టదని - ముందుగా మనిషిగా ఎదుటి వారిని పరిగణించాలని కూడా పవన్ తన ఆదర్శాలను వల్లె వేస్తున్నారు. ఇదంతా సరే మహిళలపై ఆయనకున్న ద్రక్పదం ఏమిటో వెలుగు చూడాలంటే మాత్రం ఎన్నికలు రావాలి. అంతే కాదు... మహిళలకు ఆయన ఎన్ని స్ధానాలు కేటాయిస్తారన్నది కూడా ప్రదానమే. శాసనసభల్లోనూ... లోక్‌ సభల్లోనూ కూడా మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించాలన్న మహిళల డిమాండ్లను ఏ పార్టీ పట్టించుకోవడం లేదు. దీనికి జాతీయ పార్టీలైన కాంగ్రెస్ - భారతీయ జనతా పార్టీలు కూడా మినహాయింపు కాదు.

తెలంగాణలో అయితే మరీ దారుణం. కొత్తగా పురుడు పోసుకున్న తెలంగాణలో అధికారంలో ఉన్న తెలంగాణ రాష్ట్ర సమితి తన మంత్రివర్గంలో ఒక్క మహిళకు కూడా స్ధానం కల్పించలేదు. ఇదీ దేశంలో మహిళల పట్ల రాజకీయ పార్టీల వైఖరి. అయితే కొత్తగా రాజకీయాల్లోకి వచ్చిన పవన్ కల్యాణ్ ఆ పార్టీలనే అనుసరిస్తారా.... ? లేక చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు ఇస్తారా అన్నదే ఇప్పుడు సర్వత్రా చర్చగా మారింది. ఆంధ్రప్రదేశ్‌ లో పర్యటిస్తున్న జన సేనాని పవన్ కల్యాణ్ తన పార్టీలో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని ప్రకటించారు. ఇది కేవలం శాసనసభకే పరిమితం కాదని - అన్ని స్ధాయిల్లోనూ ఇది దీనిని అమలు చేస్తామని ప్రకటించారు. అయితే ఈ ప్రకటన ఆచరణ సాధ్యమేనా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. జాతీయ పార్టీలు.... ముఖ్యంగా వామపక్షాలు కూడా ఈ 33 శాతం రిజర్వేషన్లను అమలు చేయలేదు. రాజకీయ పార్టీల్లో పురుషుల హవా ఎక్కువగా ఉంటున్న నేటి తరుణంలో పవన్ కల్యాణ్ మహిళలకు రిజర్వేషన్లపై కట్టుబడి ఉండడం దాదాపు అసాధ్యమని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. పార్టీ పెట్టిన కొత్తలో పవన్ కల్యాణ్ సోదరుడు - మెగాస్టార్ చిరంజీవి కూడా తన తొలి టిక్కట్టును నెల్లూరు జిల్లాకు చెందిన దళిత మహిళకే ఇస్తామని ప్రకటించి ఆ తర్వాత భంగపడ్డారు. ఇప్పుడు పవన్ కల్యాణ్ కూడా ఇంచుమించు అలాంటి ప్రకటనే చేస్తున్నారు. ఎన్నికల ముందు ఇలాంటి ప్రకటనలు రాజకీయ నాయకులు చేయడం సహజమే. అయితే వాటిని అమలు చేయడంలోనే అసలు సమస్య వస్తుంది.  ఈ రిజర్వేషన్లే కాదు... మహిళలు ఆకట్టుకునేందుకు, వారి ఓట్లను కొల్లగొట్టేందుకు కూడా పవన్ కల్యాణ్ ఎత్తులు వేస్తున్నారు. వంట గ్యాస్‌ ను ఉచితంగా సరఫరా చేయడం... మహిళలకు రేషన్ సరుకులు ఇవ్వడంలో భాగంగా నెలకు రెండు నుంచి మూడు వేల రూపాయలు మహిళల ఖాతాల్లో జమ చేస్తామని చెబుతున్నారు.

అధికారంలోకి వచ్చిన తర్వాత చేసే ఈ కార్యక్రమాలు పక్కన పెడితే వచ్చే ఎన్నికల్లో తమ పార్టీ నుంచి మహిళలకు 33 శాతం రిజర్వేషన్ల ప్రకారం టిక్కట్లు కేటాయించడమే పెద్ద సాహసం. ఇదే కాదు.... వెనుకబడిన తరగతుల వారికి ప్రస్తుతమున్న రిజర్వేషన్లను మరింత పెంచుతామని కూడా పవన్ కల్యాణ్ చెబుతున్నారు. ఇది కేంద్రం పరిధిలో ఉంటుంది. రిజర్వేషన్లపై ఎవరు పడితే వారు ఎప్పుడు పడితే అప్పుడు మాట్లాడడానికి ఉండదు. పైగా దీన్ని ఎన్నికల అస్త్రంగా ఉపయోగించడం కూడా కుదరదు. దీనిని ద్రష్టిలో ఉంచుకునే వై.ఎస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి కాపులకు రిజర్వేషన్లపై స్పష్టమైన వైఖరిని ప్రదర్శించారు. పవన్ కల్యాణ్ లో ఈ రాజకీయ స్పష్టత లేకపోవడం వల్లే ఆయన ఇలా హామీలు గుప్పిస్తున్నారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.
Tags:    

Similar News