ఒక్క మ్యాచ్ ఓడితే ఆత్మహత్యా..నువ్వేం కోచ్ వయ్యా?

Update: 2019-06-25 06:38 GMT
ప్రపంచకప్ లో టీమిండియా చేతిలో పాకిస్తాన్ ఓడగానే ఆత్మహత్య చేసుకోవాలని అనిపించినట్టుగా ప్రకటించి వివాదం పాలవుతున్నాడు మికీ ఆర్థర్. ఈ సౌతాఫ్రికన్ మాజీ క్రికెటర్ ప్రస్తుతం పాకిస్తాన్ క్రికెట్ జట్టుకు కోచ్ గా ఉన్నారు. ఇటీవలే ప్రపంచకప్ లో టీమిండియా చేతిలో పాక్ జట్టు ఓడిపోయిన సంగతి తెలిసిందే.

తద్వారా టీమిండియా మరో ప్రపంచకప్ లో కూడా పాక్ మీద ఆధిపత్యాన్ని కొనసాగించింది. ఇప్పటి వరకూ క్రికెట్ వన్డే వరల్డ్ కప్ లో టీమిండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ లు ఏడు జరగగా.. ఏడింటిలోనూ టీమిండియానే విజయం సాధించింది. తద్వారా పాకిస్తాన్  కు ఒక్క మ్యాచ్ కూడా వదలకుండా టీమిండియా విజయదుందుభి మోగించింది.

ఈ నేపథ్యంలో ఇటీవలి ఓటమి పాక్ జట్టుపై తీవ్రమైన విమర్శలకు దారి తీసింది. ఆట అన్నాకా గెలుపోటములు సహజం. అయితే పాకిస్తాన్ కోచ్ మాత్రం ఏకంగా తను ఆత్మహత్య చేసుకోవాలని అనుకున్నట్టుగా ప్రకటించి ఆశ్చర్యపరిచాడు.

ఎవరైనా వీరాభిమానో అలా మాట్లాడి ఉంటే అదో లెక్క. అయితే జట్టుకు మార్గదర్శకం చేయాల్సిన  కోచ్ అలా మాట్లాడటం మాత్రం మరింత విమర్శలకు దారి తీస్తోంది. ఒక మ్యాచ్ లో తమ జట్టు ఓడిపోయిందని ఆయన ఆత్మహత్య చేసుకోవాలని అనుకున్నాడంటే.. అతడు జట్టుకు ఏం కోచింగ్ ఇస్తాడు? కోచింగ్ ఇవ్వడం అంటే ఆటలో లోపాల గురించి చెప్పడమే కాదు - జట్టులో స్ఫూర్తి నింపడం! గెలిచినప్పుడు ఆటగాళ్లు విర్రవీగకుండా - ఓడినప్పుడు కుంగిపోకుండా…నియంత్రించాల్సిన బాధ్యత కూడా కోచ్ దే. అలాంటి కోచ్ ఇలా తనే  ఆత్మహత్య  చేసుకోవాలని అనుకున్నట్టుగా ప్రకటించాడు. ఈ విషయంలో మాజీ క్రికెటర్లు - విశ్లేషకులు ఆర్థర్ పై ధ్వజమెత్తుతున్నారు.
Tags:    

Similar News