బీజేపీ అగ్రనేతల మరణం కోసం చేతబడులు?

Update: 2019-08-26 11:32 GMT
షాకింగ్ వ్యాఖ్యలు చేశారు బీజేపీ ఎంపీ ఒకరు. వివాదాస్పద వ్యాఖ్యలతో తరచూ మీడియాలో ప్రముఖంగా నిలిచే బీజేపీ ఎంపీ సాధ్వి ప్రఙ్ఞాసింగ్‌ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి. కేవలం ఏడాది వ్యవధిలో బీజేపీకి చెందిన సీనియర్ నేతలు వరుస పెట్టి చనిపోవటం ఆ పార్టీని ఇబ్బంది పెడుతోంది. ఇదిలా ఉంటే.. ఈ మరణాల వెనుక ప్రతిపక్షం ఉందని.. వారి మరణాల వెనుక చేతబడి చేయించటమే అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు సాధ్వీ.

మహారాజ్ చెప్పినట్లుగా తమ పార్టీ విపత్కర పరిస్థితుల్ని ఎదుర్కొంటోందని.. గడిచిన ఇరవై రోజుల్లో ఇద్దరు బీజేపీ ఆగ్రనేతలు (సుష్మా స్వరాజ్.. అరుణ్ జైట్లీ) మరణించటాన్ని ఆమె ప్రస్తావించారు. బీజేపీకి వ్యతిరేకంగా ప్రతిపక్షాలు క్షుద్రపూజలు చేయిస్తున్నట్లుగా మహారాజ్ తనకు గతంలో చెప్పారన్నారు. ఆయన చెప్పినట్లే పార్టీ ఇప్పుడు ఇబ్బందికర పరిస్థితుల్ని ఎదుర్కొంటున్నట్లుగా వ్యాఖ్యానించారు భోపాల్ బీజేపీ ఎంపీ.

గతంలో ఆయన చెప్పిన విషయాన్ని తాను మర్చిపోయానని.. కానీ.. తమ పార్టీకి చెందిన పలువురు అగ్రనేతలు ఒక్కొక్కరుగా తమను విడిచి వెళుతున్నారని.. మహరాజ్ చెప్పింది నిజమేనేమోనని తనకు ఇప్పుడు అనిపిస్తోందన్నారు. ఆయన చెప్పినట్లే తమకు ఇప్పుడు చెడుకాలం నడుస్తోందన్నారు.

వివాదాస్పద వ్యాఖ్యలు చేయటం సాధ్వీకి కొత్తేం కాదు. ఆమె మాటలే కాదు.. చేతలు  కూడా తరచూ ఆమెను సంచలన వార్తల్లో నిలుపుతూ ఉంటాయి. 2008 మాలేగావ్ పేలుళ్ల కేసులో ప్రధాన నిందితురాలిగా ఉన్న ఆమె.. భోపాల్ ఎంపీగా బీజేపీ తరఫున పోటీ చేసి.. కాంగ్రెస్ సీనియర్ నేత ద్విగ్విజయ్ సింగ్ ను ఓడించారు. సాధ్వీ మాటలు విన్నంతనే నిజమే అన్నట్లుగా అనిపించినప్పటికీ.. ఒక డౌట్ మాత్రం కొట్టకమానదు. ఎవరైనా చేతబడి చేసి.. పార్టీని ఏదో చేయాలనుకుంటే.. ప్రధాన వికెట్లకు గురి పెడతారు కానీ.. గడిచిన కొంతకాలంగా ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్న వారినే ఎంచుకుంటారా? డిజిటల్ లోకి ప్రపంచం దూసుకుపోతున్న వేళ.. ఇంకా చేతబడి మాటలేంది సాధ్వీజీ?
Tags:    

Similar News