ట్రంప్ ఎఫెక్టును తట్టుకోవడానికి మెక్ డొనాల్డ్స్ ఎత్తు

Update: 2017-03-18 11:30 GMT
ట్రంప్ తీరుతో మిగతా ప్రపంచమే కాదు అమెరికా ప్రజలు, సంస్థలు కూడా విసుగెత్తిపోతున్నాయట. ప్రముఖ సంస్థలు కొన్ని ఒబామా పాలనే బాగుందని బాహాటంగా గొంతెత్తుతున్నాయి. అంతేకాదు.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తమ వ్యాపారాలపై ట్రంప్ వల్ల వ్యతిరేకత రాకుండా జాగ్రత్త పడుతున్నాయి. అందుకోసం రకరకాల ఎత్తుగడలు వేస్తున్నాయి. ట్రంప్ పట్ల తమకున్న వ్యతిరేకతను ప్రదర్శించడానికి రెడీ అవుతున్నాయి. అందులో భాగంగానే అమెరికాకు చెందిన ప్రఖ్యాత మెక్ డొనాల్డ్స్ సంస్థ సంచలనాత్మక ట్వీట్ చేసింది.
    
మెక్‌ డొనాల్డ్స్‌ అధికారిక ట్విట్టర్‌ ఖాతా నుంచి వచ్చిన ఒక పోస్ట్‌ ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఆ ట్వీట్‌ కొన్ని గంటల్లోనే వైరల్‌గా మారింది.  ట్రంప్‌ అమెరికా అధ్యక్షుడిగా పనికిరాడని…. తమకు తిరిగి బరాక్‌ ఒబామానే అమెరికా అధ్యక్షుడిగా కావాలని… ట్రంప్‌ విశాల హృదయుడు కాదని ఆ ట్వీట్‌ లో మెక్ డొనాల్డ్స్ పేర్కొంది. అది చాలా వివాదాస్పదమైంది. లక్షలాదిమంది ఆ ట్వీట్‌ ను షేర్‌ చేశారు. అది కలిగించిన సంచలనం చూశాక మెక్‌ డొనాల్డ్స్‌ తన ఖాతానుంచి ఆ ట్వీట్‌ ను తీసేసింది. ఆ ట్వీట్‌ తాము చేయలేదని ఎవరో తమ ట్విట్టర్‌ ఎకౌంట్‌ ను హ్యాక్‌ చేసి అలాంటి ట్వీట్‌ చేశారని వివరణ ఇస్తూ క్షమాపణలు చెప్పింది.
    
అయితే.. హ్యాకింగ్ వంటిదేమీ కాదని.. మెక్ డొనాల్డ్స్ వ్యూహాత్మకంగా ఈ పని చేసిందని తెలుస్తోంది.  ట్రంప్‌ విధానాలవల్ల ప్రపంచదేశాల్లో అమెరికన్‌ ప్రొడక్ట్స్‌ కొనకూడదని క్రమంగా ప్రపంచ దేశాల ప్రజలు భావిస్తున్న వేళ తాము కూడా ట్రంప్‌ ను వ్యతిరేకిస్తున్నామన్న భావన కలిగించి తమ వ్యాపారాన్ని కాపాడుకోవడానికి మెక్‌డొనాల్డ్స్‌ ఈ ఎత్తు వేసిందన్న వాదనా వినిపిస్తోంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News