ఎన్నికల వేళ.. కొత్త కేసు చిక్కుల్లో ట్రంప్

Update: 2020-09-26 06:45 GMT
ఎట్టి పరిస్థితుల్లోనూ రెండో సారి అమెరికా అధ్యక్ష పదవిని సొంతం చేసుకోవాలన్న పట్టుదలతో ఉన్న డొనాల్డ్ ట్రంప్ కు వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ఆయనకు అధికారాన్ని దూరం చేయటమే లక్ష్యమన్నట్లుగా వరుస ఉదంతాలు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే అమెరికన్లలో వ్యతిరేకత పెరగటం తెలిసిందే. దీనికి తోడు కరోనా వేళ ఆయన ప్రభుత్వం చేపట్టిన చర్యలు.. అమెరికా ఆర్థిక పరిస్థితి.. ట్రంప్ సర్కారు విధానాలు.. ఇలా అన్ని అంశాలు ఆయనకు వ్యతిరేకంగా ఉన్నట్లు చెబుతున్నారు.

ఇలాంటివేళ.. ఆయనకు మరో ఎదురుదెబ్బ తగిలినట్లుగా చెప్పాలి. వారసత్వంగా తనకు ఇవ్వాల్సిన ఆస్తిని ట్రంప్ ఇవ్వలేదంటూ ఆయన మేనకోడలు తాజాగా కోర్టును ఆశ్రయించింది. ఆస్తి విషయంలో తనను ట్రంప్ తో సహా కుటుంబ సభ్యులు మోసం చేశారని మేరీ ట్రంప్ ఆరోపిస్తున్నారు. ఆమె కంప్లైంట్ మేరకు న్యూయార్క్ స్టేట్ కోర్టులో అధ్యక్షుల వారిపై కేసు నమోదైంది.

తమ తాత ఫ్రెడ్ ట్రంప్ కు సంబంధించిన ఎస్టేట్ లో తనకు వాటా రావాల్సి ఉందని.. దాని విలువ 10 లక్షల డాలర్లు ఉంటుందని మేరీ పేర్కొన్నారు. ట్రంప్ తో పాటు.. ఆయన సోదరి.. సోదరుడు మోసం చేసినట్లుగా మేరీ ఆరోపిస్తున్నారు. అయితే.. ఆమె వేసిన పిటిషన్ పై స్పందించేందుకు ట్రంప్ కుటుంబసభ్యుల తరఫు న్యాయవాదులు ఇష్టపడటం లేదు. కీలకమైన ఎన్నికల వేళలో ఇలాంటి ఉదంతం చోటు చేసుకోవటం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఈ కేసు ఎన్నికల మీద ప్రభావితం చూపిస్తుందని చెప్పలేకున్నా.. ఇలాంటివి ఆయనకు చికాకును కలిగిస్తాయని చెప్పక తప్పదు.
Tags:    

Similar News