ఆర్థిక సంక్షోభం: మోడీ ప్రభుత్వానికి మన్మోహన్ మూడు సలహాలు

Update: 2020-08-11 07:30 GMT
కరోనా మహమ్మారి నేపథ్యంలో భారత ఆర్థిక వ్యవస్థ భారీగా దెబ్బతిన్నదని, కోలుకోవడానికి వెంటనే మూడు చర్యలు చేపట్టాలని మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అన్నారు. ఒకటి.. దేశ ప్రజల జీవనోపాధికి రక్షణ కల్పించాలని, ప్రత్యక్ష నగదు సహాయం ద్వారా వారికొనుగోలు శక్తిని పెంచాలన్నారు. రెండోది.. వ్యాపారాలకు తగిన మూలధనం అందుబాటులో ఉండేలా చూడాలని, ప్రభుత్వ పరపతి హామీ పథకాలను రూపొందించాలన్నారు. మూడు.. సంస్థాగత స్వయంప్రతిపత్తిని కల్పించడం ద్వారా ఆర్థిక రంగాన్ని మెరుగుపరచాలని కేంద్ర ప్రభుత్వానికి కీలక సూచనలు చేశారు.

కరోనా కారణంగా దేశంలో తీవ్ర ఆర్థిక మందగమనం తప్పదన్నారు. పై మూడు చర్యల ద్వారా దీని ప్రభావాన్ని తగ్గించవచ్చునని అభిప్రాయపడ్డారు. ఆర్థిక మాంద్యం వంటి పదాలు ఉపయోగించడం తనకు ఇష్టంలేదని, కానీ తీవ్రమైన, దీర్ఘకాలిక సంక్షోభం తలెత్తే పరిస్థితి కనిపిస్తోందన్నారు. మానవతా సంక్షోభం వల్లే ఆర్థిక వ్యవస్థ కుదేలయిందని, విధానాల కంటే మన సమాజంలోని విశ్వాసాల నేపథ్యంలో ప్రస్తుత కుంగుబాటును పరిశీలించాలన్నారు. దేశ ఆర్థిక వ్యవస్థ మందగమనంపై ఆర్థికవేత్తల్లో ఏకాభిప్రాయం కనిపిస్తోందని, అదే నిజమైతే స్వతంత్ర భారత చరిత్రలో ఇదే తొలిసారి అవుతుందన్నారు. కానీ ఈ ఏకాభిప్రాయం తప్పు కావాలని కోరుకుంటున్నట్లు చెప్పారు.

లాక్ డౌన్ వల్ల ప్రజలు ఇబ్బంది పడ్డారని, కానీ ఇది అనివార్యంగా మారిందన్నారు. లాక్ డౌన్ ప్రకటించిన విధానం ప్రజలకు ఇబ్బందులను కలిగించిందని చెప్పారు. ముందస్తు ప్రణాళిక లేకుండా దీనిని ప్రకటించారని చెప్పారు. పబ్లిక్ హెల్త్ సమస్యలకు స్థానిక అధికారులు, నిర్వాహకులు మెరుగైన పరిష్కారాలు చూపిస్తారని, కేంద్రం సూచనలిస్తూ, సహాయం అందిస్తే చాలని చెప్పారు. కరోనాపై పోరును మొదట్లోనే రాష్ట్ర ప్రభుత్వాలకు అప్పగిస్తే బావుండేదని చెప్పారు. 1991 సంక్షోభం అంతర్జాతీయ కారకాల వల్ల తలెత్తిందని, ప్రస్తుత సంక్షోభం అసాధారణమైనదని, ప్రభావం ఊహించలేనిదన్నారు.

ప్రస్తుత పరిస్థితుల్లో దేశానికి అధిక రుణాలు, ఆర్థిక సమస్యలు తప్పవన్నారు. ఆరోగ్యం, జాతీయ భద్రతకు సంబంధించిన సవాళ్లు ఎదుర్కోవడానికి జీడీపీకి అదనంగా పది శాతం ఎక్కువ ఖర్చులు చేయాలన్నా రుణాలు తప్పవన్నారు. అప్పుడు రుణ నిష్పత్తి పెరుగుతుందని, దీనికి ఆందోళన చెందవద్దని, తీసుకున్న రుణాలు ఎలా ఉపయోగిస్తున్నామనేదే కీలకమైన అంశమని చెప్పారు. ఇదివరకు ఐఎంఎఫ్, వరల్డ్ బ్యాంకు లాంటి అంతర్జాతీయ సంస్థల నుండి రుణాలు తీసుకోవడం దేశ ఆర్థిక బలహీనతను సూచించేదని, ఇప్పుడు ప్రపంచ రాజకీయాల్లో అభివృద్ధి చెందుతు్నన దేశాలతో పోలిస్తే భారత్ పరిస్థితి బలపడిందన్నారు. కాబట్టి రుణాలు తీసుకోవడానికి సంకోచించవద్దని చెప్పారు.
4

అభివృద్ధి చెందిన దేశాల్లో అదనపు డబ్బు సరఫరా వలన పెరిగే ద్రవ్యోల్భణం సమస్యకాదని, ఇండియా వంటి దేశాల్లో అదనపు ద్రవ్య ముద్రణ వాణిజ్యం, ద్రవ్యోల్భణంపై ప్రభావం చూపిస్తుందని చెప్పారు. ద్రవ్య ముద్రణ చిట్టచివరి అవకాశం మాత్రమే అన్నారు. మూడు దశాబ్దాల క్రితంతో పోలిస్తే మన దేశ జీడీపీ పది రెట్లు పెరిగిందని, 30 కోట్ల మంది జనాభాను పేదరికం నుండి బయటకు తీసుకు వచ్చామన్నారు. గతంలో కంటే ప్రపంచదేశాలతో ఇండియా కలిసిపోయిందన్నారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ఏం జరిగినా ఆ ప్రభావం మన దేశంపై ఉంటుందన్నారు.
Tags:    

Similar News