పింఛన్ డబ్బులు కొట్టేయడానికి ఆ వాలంటీర్ ఏం ప్లాన్ వేశాడంటే!

Update: 2020-10-02 09:10 GMT
ఆంధ్రప్రదేశ్ లో అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి ప్రభుత్వ పథకాలు అందాలనే ఉద్దేశంతో ఏపీ ప్రభుత్వం వాలంటీర్ల వ్యవస్థను తీసుకువచ్చింది. అయితే కొందరు వాలంటీర్లు డబ్బుల కోసం చేస్తున్న కక్కుర్తి వ్యవహారాలు మొత్తం వ్యవస్థకే చెడ్డ పేరు తెచ్చేలా మారాయి.  తాజాగా గురువారం ఓ వాలంటీర్ తాను పింఛన్ డబ్బులు పంచడానికి వెళ్తుండగా కొందరు తన కళ్లల్లో కారం చల్లి దాడికి దిగారని కట్టు కథ అల్లాడు. వృద్ధులకు అందించడానికి తీసుకెళ్తున్న రూ. 43, 500 పింఛన్ల డబ్బును లాక్కెళ్లారంటూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దుండగులు దాడిలో తనకు తీవ్ర గాయాలు అయ్యాయంటూ ఆస్పత్రిలోనూ చేరాడు.

అనంతపురం జిల్లాకు మడకశిర మున్సిపాలిటీ లోని శివపురం వార్డు సచివాలయంలో ఈరప్ప అనే వాలంటీర్ విధులు నిర్వర్తిస్తున్నాడు. అయితే నిన్న ఒకటవ తారీఖు కావడంతో అధికారులు అతనికి పింఛన్లు పంచమని రూ. 43,500 ఇచ్చారు. అయితే ఆ డబ్బులను ఎలాగైనా కొట్టేయాలని భావించి ఓ మాస్టర్ ప్లాన్ వేశాడు. తనపై దుండగులు దాడి చేసి డబ్బులు ఎత్తుకెళ్లారని డ్రామా ఆడి ఆ పింఛన్ డబ్బులు తానే ఉంచుకోవాలని స్కెచ్ వేశాడు. ప్లాన్ ప్రకారం నిన్న ఉదయాన్నే పింఛన్ డబ్బులు పంచడానికి వెళ్తున్న తనపై కొందరు కారం చల్లి దాడి చేశారని డ్రామా ఆడాడు. నిజమేననుకొని స్థానికులు వలంటీర్‌ను చికిత్స కోసం ప్రభుత్వాస్పత్రిలో చేర్పించారు.

అదే సమయంలో తనను తీవ్రంగా కొట్టి పైసలు లాక్కెల్లారంటూ పోలీసులకు ఫిర్యాదు సైతం చేశాడు. అధికారులను నమ్మించేందుకు దుండగుల దాడిలో తనకు తీవ్రంగా గాయాలయ్యాయంటూ ఆస్పత్రిలోనూ చేరాడు. అయితే అతను చెబుతున్న మాటలకు పొంతన లేకపోవడంతో అధికారులకు అనుమానం వచ్చింది. వీరప్పను వారు విచారించగా డబ్బు కోసమే కట్టు కథ అల్లాడని తేల్చారు. అతనిపై ఎలాంటి దాడి జరగలేదన్నారు. రూ.43,500 ను వలంటీర్‌ నుండి రికవరీ చేస్తామని మున్సిపల్‌ కమిషనర్‌ నాగార్జున తెలిపారు. శివాపురం సచివాలయ పరిధిలోని వలంటీర్‌ వీరప్పను జిల్లా కలెక్టర్‌ గంధం చంద్రుడు విధుల నుంచి తొలగించాలని కమిషనర్‌ నాగార్జునకు ఉత్తర్వులు జారీ చేశారు. ఇదిలా ఉంటే ఏపీలో గ్రామ, వార్డు వాలంటీర్లకు ప్రభుత్వం తీపికబురు అందించింది. వారి సేవలు మరో ఏడాది పాటు పొడిగించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
Tags:    

Similar News