ఈ సారి తేడా వస్తే లగడపాటి దుకాణం బంద్!

Update: 2019-05-18 17:30 GMT
తనకు సంబంధం లేని అంశంలో మరోసారి పరీక్షను పెట్టుకుంటున్నాడు మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్. ఆంధ్రా ఆక్టోపస్ అంటూ మీడియా ఈయనను మునగ చెట్టు ఎక్కించింది. తెలంగాణలో అసెంబ్లీ  ఎన్నికల ఫలితం గురించి లగడపాటి వేసిన అంచనాలు తలకిందుల అయ్యాయి. తెలంగాణలో వచ్చిన ఫలితాలకూ అంతకు ముందు లగడపాటి చెప్పిన మాటలకూ ఏ మాత్రం పొంతనే లేదు!

హంగ్ తరహా తీర్పు, ఇండిపెండెంట్లు గెలిచేస్తారు.. అంటూ ఏదేదో చెప్పారు లగడపాటి. అలా చెప్పి ఈయన లెక్కల మీద ఆధారపడి బెట్టింగులు వేసిన వారు దుంపనాశనం అయ్యారు! ఇలాంటి నేపథ్యంలో ఏపీ ఎన్నికల పై లగడపాటి తన అంచనాలను రేపు వెలువరించబోతూ ఉన్నారట. ఈ విషయాన్ని  ఆయనే ప్రకటించుకున్నారు.

ఈ అంచనాలను వెలువరించి, ఎగ్జిట్ పోల్ సర్వేలను చెప్పి లగడపాటి ఈ దశలో సాధించేది కూడా ఏమీ లేదు. ఆయన ఏదైనా పార్టీకి  సాయం చేయాలని అనుకున్నా ఆల్రెడీ పోలింగ్ ముగిసింది కాబట్టి ఈ సర్వేలతో జనం ప్రభావితం అయ్యే ప్రశ్నే లేదు!

అయితే లగడపాటి తెలంగాణ ఎన్నికల విషయంలో కూడా తన అంచనాలను  నిజమే అయ్యాయని ఇప్పుడు పరోక్షంగా చెబుతున్నారు. అదెలాగంటే.. కొన్ని స్థానాల్లో ఇండిపెండెంట్లు రెండో స్థానంలో వచ్చారట! అలా ఈయన అంచనాలు వాస్తవ ఫలితాలకు దగ్గరగానే ఉన్నాయట! ఇదేదో కవరేజ్ ప్రయత్నంలా ఉంది. రేపు తను చెప్పే విషయాలను జనాలు నమ్మాలన్నట్టుగా లగడపాటి ఇప్పుడు తెలంగాణ ఫలితాల విషయంలో జరిగిన డ్యామేజ్ ను కవరేజ్ చేసుకుంటున్నారు.

రేపు ఎగ్జిట్ పోల్  అంచనాలను చెప్పబోతూ.. లగడపాటి ఇప్పుడు చెప్పిన మాటల్లో 'తెలంగాణ ప్రజలు కారును ఎంచుకుంటే.. ఏపీ ప్రజలు సైకిల్ నే ఎంచుకున్నారు..' అనే మాట మాట్లాడారు. బహుశా తెలుగుదేశం నెగ్గుతుందని రేపు చెప్పడానికి ఈ రోజు లగడపాటి ఇలా మాట్లాడారని విశ్లేషకులు అంచనా వేస్తూ ఉన్నారు. అయితే నిజంగా అలాంటి పరిస్థితి ఉందా? అనేది మాత్రం అనుమానమే!

 ఏదేమైనా రేపు ఎగ్జిట్ పోల్స్ ను చెప్పబోతున్నారు లగడపాటి. అలాంటి మాటలు ఎన్ని చెప్పినా, ఈవీఎంలలోని ఫలితాలు అయితే మారిపోవు. కాబట్టి ఈ ఎగ్జిట్ పోల్స్ అన్నింటినీ వినీ .. అసలు ఫలితాల కోసం ఎదురుచూడటమే. దీని వల్ల జనాలకు అయితే నష్టం లేదు. ఈయన చెప్పే జోస్యం అసలు ఫలితాల్లో ఫలించకపోతే మాత్రం.. అప్పుడు లగడపాటి ఇలా సర్వేలు చెప్పే దుకాణం మూసేసుకోవాల్సి ఉంటుందని మాత్రం చెప్పవచ్చు!


Tags:    

Similar News