కేసీయార్ తో వారికి చెడిందా?

Update: 2023-05-29 13:08 GMT
మునుగోడు అసెంబ్లీ ఉపఎన్నికల్లో బీఆర్ఎస్ గెలుపుకు శక్తివంచన లేకుండా పనిచేసిన ఎర్ర పార్టీలకు కేసీఆర్ తో చెడినట్లే అనుమానంగా ఉంది. ఎందుకంటే ఒకవైపు ఎన్నికలు దగ్గరకు వచ్చేస్తున్నా మూడుపార్టీల నుండి పొత్తులపై ఎలాంటి ప్రకటన రాలేదు. ఇదే సమయంలో వామపక్షాలు తాము పోటీ చేయబోయే సీట్లపైన కచ్చితమైన క్లారిటీతో ఉన్నట్లు అర్ధమవుతోంది. అందుకనే వామపక్షాలకు కేసీయార్ తో చెడినట్లు అనుమానాలు పెరిగిపోతున్నాయి. ఒకపుడు వామపక్షాలకున్న పట్టు ఇపుడులేదన్నది వాస్తవం.

అయితే తాము సొంతంగా నియోజకవర్గాల్లో గెలవలేకపోయినా కొన్నింటిలో గెలుపోటములను శాసించే స్ధాయిలో ఉన్నామనేది వామపక్షాల వాదన. సీపీఐ-సీపీఎం మధ్య కలహాల కారణంగానే రెండు పార్టీలు క్షేత్రస్థాయిలో బలహీనపడిపోయాయి. అలాగే అధికారంలోకి వచ్చేపార్టీతో అంటకాగటంతో అధికారానికి దగ్గరై ప్రజాఉద్యమాలను మరచిపోయాయి. ఎప్పుడైతే పోరాటాలను వదిలేసి అధికారపార్టీతో అంటకాగటం మొదలైందో అప్పుడే జనాలకు వామపక్షాలు దూరమైపోయాయి.

కాకపోతే ఖమ్మం, నల్గొండ జిల్లాలతో పాటు అక్కడక్కడ ఒకటి రెండు నియోజకవర్గాల్లో వామపక్షాలు పట్టు నిలుపుకున్నాయి. మొన్నటి మునుగోడు బీఆర్ఎస్ గెలిచిందంటే ఇదే కారణం. లేకపోతే బీజేపీ అభ్యర్ధి కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి గెలిచుండేవారే అనటంలో సందేహంలేదు. ఇప్పుడు సమస్య ఎక్కడ వచ్చిందంటే రాబోయే ఎన్నికల్లో వామపక్షాలకు ఒక్కసీటు కూడా కేటాయించేది లేదని కేసీయార్ చెప్పారట.

అసెంబ్లీ సీట్లకు బదులు ఎంఎల్సీ స్ధానాలు కేటాయిస్తానన్నారట. దాంతో వామపక్షాలకు మండినట్లు సమాచారం. ఎంఎల్సీ స్ధానాలను పక్కనపెట్టేస్తే డైరెక్టు ఎన్నికల్లో గనుక వామపక్షాలు పోటీచేయకపోతే జనాలు పార్టీలను మరచిపోవటం ఖాయం.

ఒక్కఎన్నికకు దూరమైనా తర్వాత ఎన్నికల్లో వామపక్షాలను జనాలు ఎవరూ పట్టించుకోరు. ఆ తర్వాత క్షేత్రస్ధాయిలో ఎన్ని పోరాటాలన్నా, సభలన్నా ఎలాంటి ఉపయోగం ఉండదు. అందుకనే కేసీయార్ ప్రతిపాదనను వామపక్షాలు తిరస్కరించాయట. ఖమ్మం జిల్లాలోని ఖమ్మం, పాలేరు, భద్రాచలం, మధిర, కొత్తగూడెం, వైరా నియోజకవర్గాల్లో పోటీచేయటానికి వామపక్షాలు రెడీ అవుతున్నాయి.

అలాగే నల్గొండ జిల్లాలోని నల్గొండ, నకిరేకల్, మునుగోడు, సూర్యాపేట, నాగార్జునసాగర్ నియోజకవర్గాల్లో కూడా రెడీ అవుతున్నాయి. మరి చివరకు కేసీయార్-వామపక్షాల వ్యవహారం ఏమవుతుందనేది బాగా ఆసక్తిగా మారుతోంది.

Similar News