మ‌రో స‌ర్జిక‌ల్ స్ట్రైక్‌..ఈ సారి కాస్త డిఫ‌రెంట్‌

Update: 2017-05-22 17:33 GMT
సరిహద్దు ఆవల నుంచి ఉగ్రవాదుల దాడిని అరికట్టేందుకు కేంద్రంలోని నరేంద్రమోదీ ప్రభుత్వం మలి విడుత లక్షిత దాడులు చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ విషయమై కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ పరోక్ష సంకేతాలిచ్చారు. ఒక టీవీ ఛానెల్ నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఉగ్రవాదానికి, పాకిస్థాన్ సీమాంతర ఉగ్రవాద చర్యలకు అడ్డుకట్ట వేసేందుకు ప్రభుత్వం నిర్ణయాత్మక, నిర్దిష్టమైన చర్యలు తీసుకుంటుందన్నారు. లక్షిత దాడులకు ప్రణాళికలు రూపొందించినా ప్రభుత్వం మీడియాకు తెలియజేయదని ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.

సాధ్యమైనంత త్వరలో కశ్మీర్ లోయలో అలజడులకు తెర దించుతామని  కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ అన్నారు. ``స‌ర్జిక‌ల్ స్ట్రైక్ చేస్తామని మేము మీ (మీడియా) ముందు చెప్పవచ్చా? ఆపరేషన్ పూర్తయ్యాకే దీనిపై మేం స్పందిస్తాం. మేం ఏం చేయబోతున్నామో మీకు చెప్పలేం`` అని అన్నారు. ``మేం తప్పనిసరిగా కొన్ని నిర్ణయాత్మక చర్యలు తీసుకుంటాం. కానీ నేను మీకు ఆ విషయం చెప్పలేను. భద్రతా సంస్థలు అవసరమైన చర్యలు తీసుకుంటాయి. ఫలితాలు మీరే చూడొచ్చు`` అని చెప్పారు. ప్రధానమంత్రి న‌రేంద్ర మోడీ అభివృద్ధి ఎజెండాలో భాగస్వాములు కావాలని కశ్మీరీ యువత భావిస్తున్నదని కేంద్ర మంత్రి తెలిపారు. కశ్మీర్ సమస్య పరిష్కార చర్చల్లో హురియత్ కాన్ఫరెన్స్ కూడా కీలక భాగస్వామి అన్న వాదనను ఆయన తోసిపుచ్చారు. వేర్పాటువాదానికి మద్దతు తెలిపినంత కాలం హురియత్ కాన్ఫరెన్స్ నేతలతో మోడీ ప్రభుత్వం చర్చలు జరుపబోదని స్పష్టం చేశారు.
Tags:    

Similar News