లిస్టులో జ‌న‌సేన గాయ‌ట్!... బాబుకు పీకే చిక్కిన‌ట్టేనా?

Update: 2019-01-19 11:48 GMT
ఏపీ అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు గ‌డువు స‌మీపిస్తున్న కొద్దీ... టీడీపీ అధినేత‌, సీఎం నారా చంద్ర‌బాబునాయుడుకు బీపీ అంత‌కంత‌కూ పెరిగిపోతోంది. ఏనాడూ సింగిల్ గా ఎన్నిక‌ల‌ను ఫేస్ చేసిన చ‌రిత్ర లేని చంద్ర‌బాబు... ఎన్నిక‌లు ద‌గ్గ‌ర‌ప‌డుతున్న ప్ర‌స్తుత త‌రుణంలో త‌న‌తో క‌లిసి వ‌చ్చే పార్టీలేవో తెలియ‌క‌, ఆ విష‌యంపై తాను ఒక్క‌రే నిర్ణ‌యం తీసుకోలేక స‌త‌మ‌తం అవుతున్నారు. మొన్న‌టి తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో సిద్ధాంతాల‌ను ప‌క్క‌న‌ పెట్టి మ‌రీ కాంగ్రెస్ తో జ‌త‌క‌డితే... తెలంగాణ జ‌నం కోలుకోలేని దెబ్బ కొట్టేశారు. ఆ దెబ్బ రుచి ఇంకా బాదిస్తూనే ఉండ‌గా... ఏపీ అసెంబ్లీకి ఎన్నిక‌లు ఉరుకులు ప‌రుగుల మీద వ‌చ్చేస్తున్నాయి. ఇక గ‌డ‌చిన ఎన్నిక‌ల్లో టీడీపీతో క‌లిసి పోటీ చేసిన బీజేపీకి స్వ‌యంగా చంద్ర‌బాబే రాంరాం చెప్పేశారు. నాటి ఎన్నిక‌ల్లో టీడీపీకి ఆప‌ద్బాంధ‌వుడిగా ప‌రిణ‌మించిన జ‌నసేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్‌.. ఇప్పుడు బాబు, చిన‌బాబుల అవినీతి వ్య‌వ‌హారం చూసి టీడీపీ బ‌ద్ధ విరోధిగా మారిపోయారు. మ‌రి ఇత‌ర పార్టీలు అవ‌స‌రం లేకున్నా... ఒక్క జ‌న‌సేన వ‌స్తే చాలు అంటూ చంద్ర‌బాబు లెక్క‌లేసుకుంటుండ‌గా... ప‌వ‌న్ క‌ల్యాణ్ మాత్రం లెఫ్ట్ పార్టీల‌తో పొత్తు త‌ప్పించి మిగిలిన ఏ ఒక్క పార్టీని కూడా ద‌గ్గ‌ర‌కే రానిచ్చేది లేదంటూ తేల్చి పారేశారు.

ఈ నేప‌థ్యంలో చంద్రబాబు ప‌రిస్థితి అయోమ‌యంలో ప‌డిపోయింది. ఎన్నిక‌ల్లో గెలవాలంటే జ‌న‌సేన పొత్తు అవ‌స‌రం. మ‌రి జ‌న‌సేన దగ్గ‌ర‌కు రావ‌డం లేదు.. ఏం చేయాలి? అన్న మీమాంస‌లో కొన‌సాగిన చంద్ర‌బాబు... గ‌తానుభ‌వాల‌ను గుర్తు చేస్తూ... ప‌వ‌న్ టీడీపీతో క‌లిసి రావాల్సిందేన‌ని ఓపెన్ ఆఫ‌ర్ ఇచ్చారు. ఈ ఆఫ‌ర్ ను కూడా పీకే తిరస్క‌రించేశారు. ఈ నేప‌థ్యంలో ఈ ఎన్నిక‌ల్లో టీడీపీతో జ‌న‌సేన పొత్తే లేద‌నే అంతా అనుకున్నారు. అయితే అంద‌రూ అనుకున్నార‌ని వ‌దిలేస్తే... ఆయ‌న చంద్ర‌బాబు ఎందుకు అవుతారు?  నిజ‌మే... నేటి ఉద‌యం జ‌రిగిన టెలికాన్ఫ‌రెన్స్ లోని అంశాల‌ను బ‌ట్టి చూస్తే... వ‌దిలేసిన జ‌న‌సేన‌ను చంద్ర‌బాబు త‌న దారికి తెచ్చుకున్న‌ట్లుగా అర్థం అవుతోంది. పార్టీ నేత‌ల‌తో చంద్ర‌బాబు నిర్వ‌హించిన టెలి కాన్ఫ‌రెన్స్‌ లో ప్ర‌స్తావ‌న‌కు వ‌చ్చిన అంశాలేమిట‌న్న విష‌యానికి వ‌స్తే... ఇప్ప‌టిదాకా వైసీపీ, బీజేపీ, టీఆర్ ఎస్‌ ల‌తో పాటు జ‌న‌సేన‌పైనా తెలుగు త‌మ్ముళ్లు విమ‌ర్శ‌లు కురిపిస్తున్నారు. స్వ‌యంగా చంద్ర‌బాబు కూడా ఈ నాలుగు పార్టీల‌పై విరుచుకుప‌డుతున్నారు.

అయితే ఉన్న‌ట్టుండి టీడీపీ విమ‌ర్శ‌లు సంధిస్తున్న నాలుగు పార్టీల జాబితా నుంచి జ‌న‌సేన గాయ‌బ్ అయిపోయింది. టెలికాన్ఫ‌రెన్స్‌ లో ఇదే అంశాన్ని చంద్ర‌బాబు ప్ర‌స్తావించారట‌. వైసీపీ, బీజేపీ, టీఆర్ ఎస్‌ ల‌పై మాత్ర‌మే విమ‌ర్శ‌లు సంధించాల‌ని చంద్ర‌బాబు చెప్ప‌గా... మ‌రి జ‌నసేన మాటేమిట‌ని పార్టీ సీనియ‌ర్ నేత గోరంట్ల బుచ్చ‌య్య చౌద‌రి ప్ర‌స్తావించ‌గా... చంద్రబాబు ఆగ్ర‌హం వ్య‌క్తం చేశార‌ట‌. చెప్పింది చేయండ‌ని, అన‌వ‌స‌ర విష‌యాలు ప్ర‌స్తావించ‌వ‌ద్ద‌ని చంద్ర‌బాబు క్లాస్ పీకార‌ట‌. అంటే... టీడీపీ విమ‌ర్శ‌లు సంధించే పార్టీల జాబితా నుంచి జ‌న‌సేన గాయ‌బ్ అయ్యింద‌న్న మాటేగా. జ‌న‌సేన మీద విమ‌ర్శ‌లు చేయొద్ద‌నేగా. అంటే... గత కొన్ని రోజులుగా చంద్ర‌బాబు అమ‌లు చేస్తున్న వ్యూహానికి ప‌వ‌న్ క‌ల్యాణ్ మెత్త‌బ‌డిపోయారనే భావించ‌క త‌ప్ప‌ద‌న్న వాద‌న వినిపిస్తోంది. అంటే... ఈ ఎన్నిక‌ల్లోనూ టీడీపీతో జ‌న‌సేన పొత్తు కుదిరిన‌ట్టేన‌ని విశ్లేష‌ణ‌లు సాగుతున్నాయి.


Full View
Tags:    

Similar News