ఎగ్జిట్ పోల్స్ పై కొరడా.. ఈసీ కీలక నిర్ణయం

Update: 2019-10-16 07:48 GMT
ప్రీపోల్స్.. ఎగ్జిట్ పోల్స్.. ఇవి ఎన్నికల్లో గెలుపు ఓటములను ముందే నిర్ణయించేసి.. ప్రజల నాడిని తెలుసుకున్నామంటూ గుప్పించే అంచనాలు.. కానీ వీటి హడావుడితో ఓడిపోయే పార్టీలు గెలిచే సందర్భాలు.. గెలుపు వాకిట బొక్కబోర్లా పడ్డ పార్టీలున్నాయి. మీడియా వర్గాలు హైలెట్ చేసే ఈ పోల్స్ పై పార్టీలు మాత్రం గుస్సా అవుతుంటాయి. పోల్స్ బూమరాంగ్ అయిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం ఈ పోల్స్ పై తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది.

ఇటీవల ఎన్నికల్లో దేశంలో డబ్బులు తీసుకొని పలు మీడియా  సంస్థలు ఈ పోల్స్ వేశాయని ఆరోపణలు వెల్లువెత్తాయి. ఇక  తమకు కొమ్ముకాసే పార్టీలకు ఫేవర్ గా ఈ ప్రీపోల్స్, ఎగ్జిట్ పోల్స్ ను పలు మీడియా సంస్థలు వెలువరించి తిమ్మిని బమ్మిని చేసి ఓటర్లను గందరగోళపరిచాయి. ఈ పోల్స్ వెనుక రాజకీయ జోక్యం కూడా ఉంటుందనే వాదనలు వెలువడ్డాయి.

ఇలాంటి వివాదాల నేపథ్యంలోనే ఈసీ కఠిన నిర్ణయం తీసుకుంది. ఈనెల 21న దేశంలో జరిగే మహారాష్ట్ర, హర్యానా ఎన్నికలతోపాటు తెలంగాణలోని హుజూర్ నగర్ సహా దేశంలోని 17 రాష్ట్రాల్లో జరిగే 51 అసెంబ్లీ ఉప ఎన్నికల్లో ఎగ్జిట్ పోల్స్ పై నిషేధం విధించింది. ఎన్నికలు జరగనున్న 21వ తేదీ ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6.30 గంటలవరకు ఎలాంటి పోల్స్ నిర్వహించకూడదని వెల్లడించవద్దని ఆదేశించింది.దీంతో మీడియా హంగామాలకు చెక్ పడినట్టైంది.
Tags:    

Similar News