ఆకస్మిక తనిఖీలంటూ డేటు.. ప్లేస్ చెప్పేస్తే ఎలా కేసీఆర్?

Update: 2021-06-14 08:30 GMT
ఏడేళ్లుగా లేని కొత్త మాటలు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నోటి నుంచి వస్తున్నాయి. గతానికి భిన్నంగా పాలనలో వేగాన్ని పెంచిన ఆయన..కొత్త ముచ్చట్లు చెబుతున్నారు. ఈ మధ్యనే ఆకస్మిక తనిఖీలు చేపడతానని చెప్పిన ఆయన.. అందుకు తగ్గట్లే తాజాగా మరికొన్ని వివరాల్ని వెల్లడించారు. జిల్లాల డెవలప్ మెంట్ ను స్వయంగా చూసేందుకు వీలుగా తాను ఆకస్మిక తనిఖీలు చేపట్టి.. తేడా వస్తే చర్యలు తీసుకుంటానని వార్నింగ్ ఇవ్వటం తెలిసిందే.

ఆకస్మిక తనిఖీలంటే.. ముఖ్యమంత్రి వెళ్లే వరకు ఆయన ఎక్కడకు వెళుతుందన్న విషయాలు తెలీకుండా ఉండటం. అందుకు భిన్నంగా వారం ముందే.. ఫలానా జిల్లాల్లో  ఆకస్మిక తనిఖీలు అని వివరాలు చెప్పేస్తే ఎలాంటి ప్రయోజనం ఉండదు. తాజాగా ముఖ్యమంత్రి కేసీఆర్ తీరు ఇదే రీతిలో ఉంది. ఈ నెల 20న సిద్దిపేట.. కామారెడ్డి జిల్లాల్లో.. 21న వరంగల్ లో ఆకస్మిక తనిఖీలు ఉంటాయని ఆయన చెబుతున్నారు.

తన పర్యటనకు ఇంకా పది రోజుల టైం (వాస్తవానికి వారం కూడా లేదు) ఉందని.. ఆలోపు ఏమైనా తప్పులు ఉంటే సరిదిద్దుకోవాలని సూచన చేయటం గమనార్హం. అయినా.. ఏడేళ్లుగా దిద్దుకోని తప్పుల్ని ఏడు రోజుల్లో సరి చేసుకోవటం సాధ్యమవుతుందా? అన్నది డౌట్. అయినా.. ఆకస్మిక తనిఖీలతో సినిమా చూపిస్తానని చెప్పే సీఎం కేసీఆర్.. తన పర్యటనకు ముందే.. ఈ విధంగా టీజర్లు వదిలేయటం ఎంతవరకు సబబు? అన్నది ప్రశ్న.

పల్లెలు.. పట్టణాల డెవలప్ మెంట్ కోసం అదనపు కలెక్టర్లు.. జిల్లా పంచాయితీ అధికారులు కష్టపడి పని చేస్తున్నా.. ఆశించింనత పని జరగటం లేదని రిపోర్టులు వస్తున్నాయన్నారు. కావాల్సినంత సమయం ఇచ్చిన తర్వాతే ఆకస్మిక తనిఖీలు చేపడుతున్నానని.. దానికి ముందు మరోసారి మాట్లాడి అభిప్రాయాలు తెలుసుకుందామన్న ఉద్దేశంతోనే తాజా సమావేశాన్ని ఏర్పాటు చేసినట్లుగా అదనపు కలెక్టర్లకు చెప్పారు. స్థానిక సంస్థల సమస్యల పరిష్కారానికి ప్రతి అదనపు కలెక్టర్ కు రూ.25 లక్షల చొప్పున కేటాయించాలని ఆదేశించటం గమనార్హం. ఇదంతా చూస్తుంటే.. ఏదో హడావుడి చేయాలన్న ఉద్దేశమే తప్పించి.. పక్కా ప్లాన్ తో ఆకస్మిక తనిఖీ ప్రోగ్రాం డిజైన్ చేయలేదన్న భావన కలుగక మానదు.
Tags:    

Similar News