గాలి జనార్ధన్ రెడ్డి కూతురినంటూ మోసం

Update: 2020-10-02 11:50 GMT
అదేదో సినిమాల్లో చూపిన చందంగా మైనింగ్ కింగ్ గాలి జనార్ధన్ రెడ్డి క్రేజ్ ను వాడుకోవడానికి మాయ చేసిందో ఓ మాయలేడి.  బళ్లారి మైనింగ్ కింగ్, కోట్లకు పడగలెత్తిన గాలి జనార్ధన్ రెడ్డి కూతురినంటూ.. పుట్టగానే తనను నర్సు అపహరించి తీసుకెళ్లి పంచుకుందని సినిమా స్టైల్లో కథ అల్లేసి గాలి జనార్థన్ రెడ్డి మామ నుంచే డబ్బులు గుంజేందుకు ప్రయత్నించింది.

గాలి జనార్ధన్ రెడ్డి ఈ మాయలేడిపై డౌట్ వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఆమెతోపాటు ఆమె వెంట వచ్చిన మరో ముగ్గురు కూడా కటకటాల పాలయ్యారు.

కర్నూలు జిల్లా నంద్యాల డీఎస్పీ చిదానందరెడ్డి విలేకరులతో ఈ కేసు విషయమై మాట్లాడారు. హైదరాబాద్ లోని లంగర్ హౌస్ కు చెందిన గంగ అలియాస్ సంగీతరెడ్డి, ఆమె భర్త మహ్మద్ నజీర్, వారి డ్రైవర్ శ్రీమన్నారాయణమూర్తి, అతడి భార్య లక్ష్మీ ఓ ముఠాగా ఏర్పడి.. సెప్టెంబర్ 25న కర్నూలు జిల్లా బండి ఆత్మకూరు మండలం కాకనూరులో ఉంటున్న గాలి జనార్దన్ రెడ్డి మామ దేరెడ్డి పరమేశ్వరరెడ్డి ఇంటికి వచ్చారు.

సినిమా తరహాలో ‘ దాదాపు 28 ఏళ్ల కిందట.. తాను గాలి జనార్ధన్ రెడ్డి భార్యకు కవలలు జన్మించారని.. అందులో ఒక శిశువు అయిన తాను  పుట్టానని.. చిన్నప్పుడు నర్సు మాయం చేసి పెంచిందని’ గాలి మామకు కథ చెప్పారు. మార్ఫింగ్ ఫొటోలను చూపించారు. మీ మనవరాలిని అని ఒప్పుకోండని.. రూ.5లక్షలు ఇవ్వండని.. లేకపోతే సోషల్ మీడియాలో ప్రచారం చేసి పరువు మర్యాదలు తీస్తానని గంగ బ్యాచ్ హెచ్చరించారు.

దీంతో పరమేశ్వరరెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. గంగతోపాటు వారందరినీ  గురువారం అరెస్ట్ చేసి సెల్ ఫోన్లు, కారు, మార్ఫింగ్ ఫొటోలను స్వాధీనం చేసుకున్నారు. నిందితులను  రిమాండ్ కు తరలించారు.
Tags:    

Similar News