బాబు టార్గెట్ హాప్ సెంచరీనా?

Update: 2016-04-28 10:06 GMT
ఏపీలో జంపింగ్స్ పర్వం మా జోరుగా సాగుతున్న సంగతి తెలిసిందే. మొన్నటి వరకూ ఏపీ అధికారపక్షంలోకి జగన్ పార్టీ ఎమ్మెల్యేలు 13 మంది భాగస్వామ్యయ్యారు. తాజాగా మరో ఇద్దరు సైకిల్ ఎక్కేయటంతో ఈ సంఖ్య 15 మందిగా మారింది. మరికొందరు జగన్ ఎమ్మెల్యేలు టీడీపీ తీర్థం పుచ్చుకునేందుకు.. బాబు చేత పచ్చ కండువా మెడలో వేసుకునేందుకు ఉత్సాహంగా ఉన్నట్లుగా తెలుస్తుంది.

చెరువుకు గండి పడిన చందంగా విపక్ష ఎమ్మెల్యేలు ఒకరి తర్వాత ఒకరుగా ఏపీ అధికారపక్షంలోకి వెళ్లిపోతున్నారు. ఈ చేరికలు ఎప్పటివరకు? ఎంతమంది? అన్నది అర్థం కాకుండా మారింది. ఇలాంటి ప్రశ్నలకు ఎవరూ సూటిగా సమాధానం చెప్పనప్పటికీ.. ఏపీ ముఖ్యమంత్రి మాత్రం ఆ విషయాన్ని నర్మగర్భంగా తన మాటలతో తాజాగా చెప్పేయటం గమనార్హం.

తాడేపల్లిలో జరిగిన బహిరంగ సభలో మాట్లాడిన చంద్రబాబు.. రానున్న రోజుల్లో నియోజకవర్గాలు పెరగనున్నాయని.. మొత్తంగా 50 అసెంబ్లీ స్థానాలు పెరుగుతాయని.. ఈ కారణంగా దాదాపు 10 ఎమ్మెల్సీలు కూడా పెరిగే వీలుందని చెప్పుకొచ్చారు. కృష్ణా జిల్లాలోనే మరో రెండు అసెంబ్లీ నియోజకవర్గాలు పెరగనున్నట్లు వెల్లడించారు. మరింత మందికి అవకాశం రానుందన్న మాటను బాబు చెప్పటం గమనార్హం.

తాజాగా చంద్రబాబు నోటి నుంచి వచ్చిన హాఫ్ సెంచరీ మాటను చూస్తే.. ఆయన టార్గెట్ హాఫ్ సెంచరీనా? అన్న సందేహం కలగక మానదు. పెరిగే అసెంబ్లీ స్థానాలతో అవకాశాలు బాగా పెరుగుతాయని చెప్పటమంటే.. జగన్ పార్టీ నేతలకు మరిన్ని అవకాశాలు ఉన్నట్లేనని చెప్పక తప్పదు. తాజాగా చేరిన చేరికలతో టీడీపీ తీర్థం పుచ్చుకున్న జగన్ ఎమ్మెల్యేల సంఖ్య పదిహేనుకు చేరినట్లైంది. బాబు హాఫ్ సెంచరీ మాటకు చూస్తే.. మరో 35 మందికి అవకాశం ఉన్నట్లా? అదే నిజమైతే.. ఈ మధ్య కాలంలో ఏపీ తెలుగు తమ్ముళ్లు చెబుతున్నట్లు జగన్ పార్టీ ఖాళీ కావటం ఖాయం.
Tags:    

Similar News