బాబు మాట‌!...41 శాతం మందిలో అసంతృప్తి

Update: 2017-09-13 12:07 GMT
రాష్ట్ర ప్రభుత్వంపై 41 శాతం మంది ప్రజల్లో అసంతృప్తి ఉందంట. ఈ మాట స్వయంగా ముఖ్యమంత్రి - తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు చెప్పిందే. సచివాలయంలో తెలుగుదేశం పార్టీ నేతలతో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ప్రభుత్వ పథకాల అమలుపై రాష్ట్ర ప్రజల సంతృప్తి స్థాయిని మరో ఇరవై శాతం పెంచాలని ఆయన కోరారు. కేవలం రాష్ర్టంలో 59 శాతం ప్రజలకు మాత్రమే రాష్ట్ర ప్రభుత్వంపై సంతృప్తి ఉందని ఆయన వాపోయారు. ఇలాగైతే వచ్చే ఎన్నికల్లో ఓడిపోతామని ఆయన మ‌ద‌నపడుతున్నట్లు సమాచారం.  41 శాతం మందిలో ఉన్న అసంతృప్తిని మరో 20 శాతం తగ్గించడానికి ఏమి చేయాలో ఆలోచించమని పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారని తెలుస్తోంది. కనీసం 80 శాతం ప్రజల్లో సంతృప్తి ఉంటేనే వచ్చే ఎన్నికల్లో విజయం సాధిస్తామని బాబు పార్టీ నేతలకు నూరిపోశారంట.

అయితే ప్రభుత్వ పథకాలు వేవీ సక్రమంగా అమలుకాకపోవడం - రాజధాని ముసుగులో పేద - బడుగు రైతుల నుంచి వేలాది ఎకరాలను కబ్జా చేయడం - ప్రశ్నించిన ప్రభుత్వ అధికారులపై దాడులు చేయడం - ప్రతిపక్ష నేతలను హత్యలు చేయడం.. వారిపై అక్రమ కేసులు పెట్టడం - ఖాళీగా కనిపించిన భూమినల్లా తెలుగుదేశం నేతలు కబ్జా చేయడం - తమకు అనుకూలమైన పత్రికల్లో - టీవీ చానెళ్లలో ఏదో అభివృద్ధి చేసేస్తున్నట్లు చెప్పుకోవడం వల్లే ప్రజల్లో అసంతృప్తి పెరుగుతోందని తెలుగుదేశం వర్గాలు ఆంతరంగిక చర్చల్లో అంగీకరిస్తుండటం గమనార్హం. నంద్యాల అసెంబ్లీ - కాకినాడ కార్పొరేషన్ లో విజయం సాధించినప్పటికీ రూ.వందల కోట్లు ఖర్చు పెట్టడం వల్లే తెలుగుదేశం గెలిచిందని ఊరువాడా - మేధావులు వ్యాఖ్యానిస్తున్నారు. అంతేకాకుండా ఉప ఎన్నికల్లో గెలిచిన ఏ పార్టీ కూడా తర్వాత జరిగే సాధారణ ఎన్నికల్లో విజయం సాధించదని గణాంకాలు చూపుతుండటంతో బాబు పరిస్థితి కక్కలేక మింగలేక అన్నట్లు ఉంది.

మరోవైపు వైఎస్సార్ సీపీ అధినేత - ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నవర్నతాలు పేరిట పథకాలు ప్రకటించి ప్రజల్లోకి దూసుకెళ్తున్న సంగతి తెలిసిందే. అన్నవస్తున్నాడు అంటూ వైఎస్ ఆర్ శ్రేణులు రెట్టించిన ఉత్సాహంతో కదులుతుండగా తెలుగుదేశంలో నిస్తేజం నెలకొంది. వైఎస్సార్ కుటుంబం పేరుతో సెప్టెంబర్ 11 నుంచి వైఎస్సార్ సీపీ నేతలు - క్రియాశీలక కార్యకర్తలు ఇంటింటికీ వెళ్లి సమస్యలు తెలుసుకుంటున్నారు. దీంతో ఆలస్యంగా నిద్రలేచిన బాబు ఇంటింటికీ తెలుగుదేశం అంటూ కార్యక్రమాన్ని ప్రకటించారు.
Tags:    

Similar News