ఏపీలో నియంత‌పాల‌న‌.. నిప్పులు చెరిగిన‌ కేంద్ర మంత్రి కిష‌న్ రెడ్డి

Update: 2022-03-20 04:30 GMT
ఏపీలో వైసీపీ పాల‌న‌, ముఖ్య‌మంత్రి వ్య‌వ‌హార శైలిపై సీనియ‌ర్ బీజేపీ నాయ‌కుడు, కేంద్ర మంత్రి కిష‌న్ రెడ్డి తీవ్ర‌స్తాయిలో విరుచుకుప‌డ్డారు. సీఎం జ‌గ‌న్ సొంత జిల్లా కడపలో బీజేపీ ఆధ్వర్యంలో `రాయలసీమ రణభేరి` స‌భ నిర్వ‌హించారు. ఈ స‌హ‌లో కిషన్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు, బీజేపీ రాష్ట్ర ఇన్‌ఛార్జీ సునీల్ దేవ్‌ధర్, ఎంపీలు సీఎం రమేష్, సుజనా చౌదరి, కేంద్ర మాజీ మంత్రి పురదేశ్వరి, జనసేన నేతలు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా కిష‌న్‌రెడ్డి మాట్లాడుతూ.. జ‌గ‌న్ స‌ర్కారుపై నిప్పులు చెరిగారు. జ‌గన్ పాలనలో రాష్ట్రాన్ని అప్పుల కుప్ప‌గా మార్చార‌ని దుయ్య‌బ‌ట్టారు.  రానున్న రోజుల్లో ఉద్యోగులకు జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితి వస్తోందని, అప్పులపై ఆధారపడి జగన్ ఎంత కాలం పాలన చేస్తారని ప్రశ్నించారు. అప్పులు ఇచ్చే వాళ్లు కూడా ఎంతకాలం ఇస్తారని అన్నారు. దేశంలో ఎక్క‌డా. ఏ రాష్ట్ర‌మూ చేయ‌ని అప్పులు ఏపీ చేస్తోంద‌ని దుయ్య‌బ‌ట్టారు.

అవినీతి పాల‌న‌కు అంతం త‌ప్ప‌దు!

అంతేకాదు.. కేంద్ర ప్ర‌భుత్వం  పీఎం కిసాన్ ప‌థ‌కంలో ప్రతిఏటా రైతుకు ఇస్తున్న రూ.6 వేలను కూడా వైసీపీ ప్రభుత్వమే ఇస్తున్నట్లు ప్రచారం చేసుకుంటున్నారని దుయ్యబట్టారు. అవినీతి పాలనకు అంతం తప్పదని హెచ్చరించారు.  ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తే కేసులు పెడుతున్నారని మండిపడ్డారు. బీజేపీలో చేరిన వారిపై కూడా అక్రమ కేసులు బనాయిస్తూ.. ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ``ఎంతో మంది ముఖ్యమంత్రులను చూశాం కానీ ఇంతటి నియంత పాలన ఏపీలోనే చూస్తున్నాం`` అని కిష‌న్ రెడ్డి వ్యాఖ్యానించారు.

నియంత‌ల‌కు ప‌త‌న‌మే!

ప్రజాస్వామ్యంలో ఎంతటి నియంతలైనా పతనం కాకదప్పదని హెచ్చరించారు. అవినీతిలో జగన్ ప్రభుత్వం కూరుకుపోయిందని విమర్శించారు. ఏపీలో లిక్కర్, మైనింగ్, ల్యాండ్ మాఫియా పెరిగిపోయిందని కిషన్ రెడ్డి మండిపడ్డారు. వైసీపీ అరాచకాలకు అడ్డుకట్టపడాలంటే రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రావాల్సిన అవసరం ఉందన్నారు.

ఎంతో మంది రాయలసీమ నుంచి ముఖ్యమంత్రులు వచ్చినా సీమ అభివృద్ధికి చేసిందేమి లేదని కిష‌న్‌రెడ్డి విమర్శించారు. సీమ‌ ప్రాంత వెనుకుబాటుకు సాగునీటి ప్రాజెక్టులపై నిర్లక్షమే అని పేర్కొన్నారు. సీమ అభివృద్ధికి తొలి నుంచి పోరాడుతుంది బీజేపీనేన‌ని రాయల సీమ కోసం సీఎం జగన్ ఏం చేశారో చెప్పాలని కిష‌న్‌రెడ్డి డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం రాయలసీమ అభివృద్ధికి కట్టుబడి ఉందని స్పష్టం చేశారు.

మూడేళ్లుగా ప్ర‌జ‌లు మోస పోతున్నారు.. :  సోము వీర్రాజు

సీఎం జ‌గ‌న్ త‌న మూడేళ్ల పాల‌న‌లో ఏపీ ప్రజలను మోసం చేశార‌ని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు విమర్శించారు. సీఎం సొంత జిల్లా కడపలోనే అభివృద్ధి కన్పించడం లేద‌న్నారు. అభివృద్ధి శిలాఫలకాలకే పరిమితమైందని ఎద్దేవా చేశారు. సోమశిల ప్రాజెక్టు ముంపు బాధితులకు ఇప్పటి వరకు ఏపీ ప్రభుత్వం న్యాయం చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.  

సీమ ద‌త్త‌పుత్రుడు ఎన్టీఆర్‌:  పురందేశ్వ‌రి
 
రాష్ట్ర ప్రజలు సీఎం జగన్‌ను నమ్మి గద్దెనెక్కిస్తే వారికే అన్యాయం చేస్తున్నారని కేంద్ర మాజీ మంత్రి పురందేశ్వరి విమర్శించారు. కేంద్రం చేసిన అభివృద్దే రాయలసీమలో కనిపిస్తోందన్నారు. నాడు ఎన్టీఆర్ రాయలసీమ దత్తపుత్రిడిగా ప్రకటించుకున్నారని గుర్తు చేశారు. రాష్ట్రాన్ని వైసీపీ నేతలు దోచుకుంటున్నా రని ఎంపీ సీఎం రమేష్ ఆరోపించారు.  ఒక్క ఛాన్స్ అనిచెప్పి గద్దెనెక్కి ప్రజలను జగన్ ముంచుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Tags:    

Similar News