'బీజేపీ 'ప్లాన్ బీ'..బలం లేకున్నా 'మహా' పీఠం ఎక్కేస్తుందట!

Update: 2019-11-17 17:30 GMT
ట్విస్టుల మీద ట్విస్టులు తిరుగుతున్న మహారాష్ట్రలో కమలనాథులు నయా వ్యూహం అమలు చేసేందుకు దాదాపుగా సిద్ధం అవుతున్నట్లుగా స్పష్టమైన సంకేతాలు వస్తున్నాయి. ఎన్నికల్లో తనతో కలిసి నడిచి ఎన్నికల తర్వాత తనతో విబేధించి తన వ్యతిరేకులతో సర్కారు ఏర్పాటుకు సన్నద్ధమవుతున్న శివసేనకు ఎట్టి పరిస్థితుల్లోనూ అధికారం దక్కకూడదన్న ఒకే ఒక్క భావనతో సాగుతున్న బీజేపీ... అందులో భాగంగా తనకు బలం లేకున్నా కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగా సాగుతోందట. ఈ మేరకు ఇప్పటికే ఆ పార్టీ అధిష్ఠానం నుంచి మరాఠా శాఖకు స్పష్టమైన సంకేతాలు రాగా... గవర్నర్ కూడా అందుకనుగుణంగానే పావులు కదుపుతున్నారన్న వార్తలు కలకలం రేపుతున్నాయి.

వాస్తవానికి మొన్నటి ఎన్నికల్లో 105 సీట్లతో బీజేపీనే అతిపెద్ద పార్టీగా అవతరించింది. ఆ తర్వాత తన మిత్రపక్షం శివసేన 56 సీట్లను, వైరి వర్గంలోని ఎన్సీపీ 54 సీట్లను, కాంగ్రెస్ 44 సీట్టను దక్కించుకున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వ ఏర్పాటుకు తనకు తప్పించి ఇతర పార్టీలకు, తనతో విబేధించిన శివసేనకు అసలు ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశమే రాదని బీజేపీ లెక్కలేసింది. శివసేనకు ఒకవేళ ఎన్సీపీ మద్దతు ఇచ్చినా... కాంగ్రెస్ పార్టీ మాత్రం కలిసి రాదన్నది కమలనాథుల అంచనా. అయితే శివసేన తనదైన ఎత్తులతో ఎన్సీపీతో పాటుగా కాంగ్రెస్ ను కూడా తనకు మద్దతుగా నిలిచేలా చేసుకుని బీజేపీకి షాకిచ్చింది. ఈ మూడు పార్టీల మధ్య ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించి ఇప్పటికే ఓ స్పష్టమైన అవగాహన కుదరగా, సంకీర్ణ సర్కారులో పదవుల పంపకంపైనా క్లారిటీ వచ్చిందన్న వార్తలు వినిపిస్తున్నాయి.
Read more!

ఈ వార్తలతో షాక్ తిన్న బీజేపీ... వెంటనే తన ప్లాన్ బీని అమలులో పెట్టేందుకు రంగంలోకి దిగింది. తనకు దక్కిన 105 సీట్లతో పాటు తనతో కలిసి నడిచేందుకు సిద్ధంగా ఉన్న ఇండిపెండెంట్లు, ఇతర పార్టీలకు చెందిన అసమ్మతులతో కలుపుకున్నా బీజేపీ బలం 118 దాటటం లేదు. ఈ నేపథ్యంలో బీజేపీ ప్రభుత్వం కొలువుదీరే అవకాశాలే లేవు. అయితే తనదైన మార్కు వ్యూహాన్ని అమలులోకి తీసుకొచ్చేసిన బీజేపీ... ఇప్పుడు తమ పార్టీ రక్తం కలిగిన గవర్నర్ ద్వారా వ్యవహారాన్ని నడిపించేందుకు సిద్ధపడిందట. సంఖ్యాబలాన్ని పక్కనపెట్టేసి తొలుత అధికారం చేజిక్కించుకుని, ఆ తర్వాత బల నిరూపణకు కాస్తంత సమయం తీసుకోవాలని బీజేపీ వ్యూహం రచించిందట. గవర్నర్ ఎలాగూ తన మనిషే కాబట్టి ఈ విషయంలో ఎలాంటి ఇబ్బంది రాదన్నది కూడా బీజేపీ అంచనా. ప్రభుత్వం ఏర్పాటు చేశాక... విపక్షాలకు చెందిన ఎమ్మెల్యేలను ఎలాగోలా లాగేసి బల నిరూపణ సమయానికి గండం గట్టెక్కేందుకు బీజేపీ ప్లాన్ రచించిందట. ఈ వ్యూహం బోధపడటంతో ఇప్పుడు శివసేనతో పాటు అటు ఎన్సీపీ - ఇటు కాంగ్రెస్ కూడా తీవ్ర ఆందోళనలో కూరుకుపోయినట్లుగా వార్తలు వస్తున్నాయి.



Tags:    

Similar News