కొత్త సెంటిమెంట్ ను బయటపెట్టిన బండి సంజయ్

Update: 2023-01-30 11:02 GMT
తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ సరికొత్త విషయాన్ని చెప్పుకొచ్చు. ఇప్పటివరకు ఎవరూ చూడని యాంగిల్ లో ఆయన మాటలు ఉన్నాయి. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ను టార్గెట్ చేసేందుకు నిత్యం సరికొత్త దారుల్ని వెతికే ఆయన.. ఎప్పటికప్పుడు మాటల కత్తికి పదును పెడుతుంటారు. తాజాగా అలాంటిదే ఒకటి గులాబీ బాస్ మీదకు సంధించారు.

కేసీఆర్ నోటి పవర్ ఎంతన్న విషయాన్ని వ్యంగ్యంగా వ్యాఖ్యానించిన ఆయన.. ''కేసీఆర్ నోటి నుంచి ఏ దేశం పేరు వచ్చినా అది అవుట్ అవుతుంది. పాకిస్థాన్.. శ్రీలంక దేశాల్లో జనం తిండి లేకుండా కొట్టుకు చస్తున్నారు. పాకిస్థాన్ లో గోధుమ పిండి కోసం ఒకరినొకరు చంపుకుంటున్నారు. చైనా కరోనాతో అల్లాడుతోంది'' చెప్పుకొచ్చిన బండి.. కేసీఆర్ నోటి నుంచి తరచూ వచ్చే లండన్.. ఇస్తాంబుల్.. పారిస్ నగరాలకు చెందిన బ్రిటన్, టర్కీ, అమెరికా దేశాలు బాగానే ఉన్నాయి కదా? అన్న సందేహానికి ఏమని బదులిస్తారు?

కేసీఆర్ యాగాల మీద తనదైన రీతిలో పంచ్ లు వేసిన ఆయన.. 'ముఖ్యమంత్రి కేసీఆర్ మళ్లీ క్షుద్ర పూజల్ని చేస్తున్నారు. ఎవరి కొంప ముంచాలి? ఎవరిని నాశనం చేయాలి?'' అంటూ పూజలు చేస్తున్నారన్నారు. ఇతరుల నాశనాన్ని కోరుకునేవాడు బాగుపడరని విమర్శించిన ఆయన.. కేసీఆర్ త్వరలోనే మరో యాగం చేస్తున్నారన్న వార్తలు వస్తున్న వేళ.. క్షుద్రపూజల అంశాన్ని తెర మీదకు తీసుకొచ్చారు.

నిజానికి ఆయన చేసేవి అలాంటి పూజలు కాకున్నా.. ఆ పేరుతో బండి అండ్ కో రాజకీయం చేయటం ఈ మధ్యన అందరిని ఆకర్షిస్తోంది. దీన్ని గుర్తించిన బీజేపీ నేతలు కేసీఆర్ చేసే యాగాలకు మరో తరహా ముద్రను వేసే ప్రయత్నం చేస్తున్నారు.

గులాబీ బాస్ ను ఇరుకున పెట్టేందుకు వచ్చే ఏ చిన్న అవకాశాన్ని వదలని బండి సంజయ్.. తాజాగా చోటు చేసుకున్న పరిణామాల్ని తనకు అనుకూలంగా మార్చుకున్నారని మాత్రం చెప్పక తప్పదు. అయితే.. ఇక్కడ ఇంకో విషయాన్ని చెప్పాలి. బండికి ఉన్న అడ్వాంటేజ్ ఏమంటే.. తానేం చెప్పినా సరే వినే వాళ్లు ఏమనుకుంటారో? అన్న విషయాన్ని అస్సలు పట్టించుకోరు. తాను చెప్పాలనుకున్నది చెప్పేసుకుంటూ పోవటమే తప్పించి ఇంకో ధోరణి ఆయనలో ఉండదు.

ఈ కారణంతోనే ఆయన అన్న మాటల్ని పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదని టీఆర్ఎస్ నేతలు భావిస్తారు. కానీ.. అలాంటి భావన.. ఈ రోజున బండికి ఎలాంటి ఇమేజ్ ను తెచ్చి పెట్టిందన్న విషయాన్ని చూస్తే.. గులాబీ నేతలు ఆయన విషయంలో పునరాలోచించుకోవాల్సిన అవసరం ఉందని మాత్రం చెప్పక తప్పదు.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.

Similar News