ఏపీ రాజధాని మార్పుతో తమ్ముళ్ల ఆర్థిక మూలాలు మునుగుడేనా?

Update: 2019-08-22 04:58 GMT
ఏపీ రాష్ట్ర రాజధాని అమరాతిపై మంత్రి బొత్స చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ఆసక్తికర అంశాలు తెర మీదకు వస్తున్నాయి. బొత్స మాటలకు తగ్గట్లే.. రాజధానిగా అమరావతి స్థానే.. మరో ప్రాంతానికి తరలించే నిర్ణయం తీసుకుంటే.. ఆ కారణంగా చోటు చేసుకునే పరిణామాలు తెలుగుదేశం పార్టీ నేతలకు భారీ షాక్ ను ఇవ్వటం ఖాయమంటున్నారు. అమరావతి నుంచి వేరే ప్రాంతానికి రాజధాని షిష్ట్ కానీ జరిగితే.. తెలుగు తమ్ముళ్ల ఆర్థిక కూసాలు కదిలిపోవటం ఖాయమంటున్నారు.

ఏపీ రాజధాని నగరంగా అమరావతిని ఎంపిక చేసిన తర్వాత తెలుగుదేశం పార్టీకి చెందిన పలువురు నేతలు పెద్ద ఎత్తున భూముల్ని కొనుగోలు చేసినట్లుగా ఆరోపణలు ఉన్నాయి. ఇవెంత ఎక్కువగా ఉన్నాయంటే.. తమ పరిధి దాటి మరీ.. పేరాశతో కోట్లాది రూపాయిలు పెట్టి కొనుగోళ్లు జరిపినట్లుగా చెబుతున్నారు. రాజధానిపై బాబు సర్కారు నిర్ణయం తీసుకొని.. ఆ క్రమంలో కొన్ని నిర్మాణాల్ని కూడా పూర్తి చేసిన నేపథ్యంలో.. రాజధాని నగరంపై మార్పులు అన్నవి ఉండవని భావించారు.

ఇందులో భాగంగా అమరావతి చుట్టుపక్కల ప్రాంతాల్లో భారీ ఎత్తున భూమిని కొనుగోలు చేశారు. కొందరు తెలుగు తమ్ముళ్లు అయితే వందలాది ఎకరాల్ని కొనుగోలు చేశారు. రాజధాని నగరంలో భూముల ధరలు పెరగటమే తప్పించి తగ్గటం అన్నది ఉండదన్న ధీమాతో పాటు.. భవిష్యత్తు రాజధాని నగరం కావటంతో.. తాము పెట్టే పెట్టుబడులకు వందల రెట్లు రిటర్స్న్ ఉంటాయన్న అంచనాతో భూములు కొనుగోలు చేశారు. తాజాగా ఏపీ మంత్రి బొత్స చేసిన ప్రకటన నేపథ్యంలో తెలుగు తమ్ముళ్లకు దిమ్మ తిరిగిపోయినట్లుగా చెబుతున్నారు. ఏపీలో జగన్ ప్రభుత్వం కొలువు తీరిన తర్వాత అమరావతిపై ఎలాంటి ప్రకటన చేయబోగా.. కేంద్రం ఇస్తానన్న సాయాన్ని సైతం వద్దని.. త్వరలోనే అడుగుతామని చెప్పటం ద్వారా.. ఏపీ రాజధాని నగరంపై జగన్ ఆలోచనలు మరోలా ఉన్నాయన్న అనుమానం కలిగేలా చేశాయి.

వీటిని బలపరుస్తూ తాజాగా బొత్స వ్యాఖ్యలు ఉన్నాయి. అధికారంలో ఉన్న వేళ.. తమకున్న సమాచారం ఆధారంగా చేసుకొని పెద్ద ఎత్తున భూములు కొనుగోలు చేయటం ద్వారా వందలాది కోట్లు వెనకేసుకోవాలని భావించిన తమ్ముళ్లకు ఇప్పుడు చోటు చేసుకున్న పరిణామాలు మింగుడుపడటం లేదని చెబుతున్నారు. ఒకవేళ.. ఇప్పుడు వినిపిస్తున్న అంచనాలకు తగ్గట్లు ఏపీ రాజధాని అమరావతి నుంచి తరలి వెళితే మాత్రం.. చాలామంది తెలుగు తమ్ముళ్ల ఆర్థిక మూలాలన్ని చెల్లాచెదురు కావటమే కాదు.. అందులో భాగంగా వేలాది మంది పరిస్థితి దయనీయంగా మారే ప్రమాదం పొంచి ఉందని చెబుతున్నారు.
Tags:    

Similar News