వచ్చే ఎన్నికలకు బీజేపీ ప్రధాని అభ్యర్థి అమిత్ షానా?

Update: 2019-06-11 04:59 GMT
గత పర్యాయం చేతిలోకి పవర్ రాగానే మోడీ, అమిత్ షాలు పార్టీలో ఒక రూల్ తీసుకు వచ్చారు. డెబ్బై ఐదు సంవత్సరాల వయసు మీద పడిన వాళ్లు ఎవరైనా ప్రభుత్వంలో బాధ్యతాయుతమైన పదవులకు దూరంగా ఉండాలనే నియమాన్ని పెట్టారు. మోడీ, అమిత్ షా కలిసి ఈ రూల్ తీసుకు వచ్చారు. ప్రధానిగా మోడీ - బీజేపీ జాతీయాధ్యక్షుడుగా అమిత్ షా ఈ రూల్ పాస్ చేశారు. చాలా స్ట్రిక్ట్ గా దాన్ని అమలు చేస్తూ వస్తున్నారు కూడా!

అనేక మంది సీనియర్లను పక్కన పెట్టారు, వారి చేత రాజీనామాలు చేయించారు. మంత్రి పదవుల నుంచి తప్పించారు. ఇక ఇటీవలి సార్వత్రిక ఎన్నికల్లో డెబ్బై ఐదేళ్ల వయసుకు దగ్గర పడ్డారని కొందరు సీనియర్లను ఎన్నికల్లో పోటీ కూడా చేయించలేదు. ఈ క్రమంలో ఒక ఆసక్తిదాయకమైన పరిస్థితి తలెత్తుతూ ఉంది.

ఈ ఏజ్ నిబంధన ప్రధానమంత్రి నరేంద్రమోడీనే రిటైర్ మెంట్ దిశగా పంపిస్తుందని పరిశీలకులు అంటున్నారు. ఇటీవలే అఖండమైన మెజారిటీతో మోడీని మళ్లీ ప్రధానిని చేశారు దేశ ప్రజలు. ఇప్పుడు ఆయన వయసు ఆరవై తొమ్మిది సంవత్సరాలు.

ఎన్నికలకు మరో ఐదేళ్ల సమయం ఉంది. రెండు వేల ఇరవై నాలుగులో తదుపరి ఎన్నికలు జరగబోతూ ఉన్నాయి. అప్పటికి మోడీ వయసు దాదాపు డెబ్బై నాలుగు సంవత్సరాలు అవుతాయి. వచ్చే ఎన్నికల నాటికి అలా రిటైర్మెంట్ వయసుకు దగ్గర పడతాడు మోడీ.

డెబ్బై ఐదు తర్వాత ఎవ్వరూ అధికారిక పదవుల్లో కొనసాగేందుకు లేదని షా - మోడీలే రూల్ పెట్టారు కాబట్టి.. వారే దాన్ని అమలు చేయాల్సి ఉంటుంది. దీంతో వచ్చే ఎన్నికల సమయానికి మోడీ రిటైర్మెంట్ కు దగ్గర పడతాడు - ఎన్నికల తర్వాత ఏడాదికి అయినా రిటైర్డ్ కావాల్సిందే. ఆ పరిస్థితుల్లో బీజేపీ కి మరో ప్రధానమంత్రి అభ్యర్థి అవసరం ఏర్పడవచ్చు. అందుకే మోడీ - షాలు మరో వ్యూహాన్ని కూడా అమలు చేస్తూ ఉన్నారట. మోడీ అనంతరం షా ప్రధానమంత్రి అయ్యే అవకాశాలుండవచ్చు. అందుకే ఆయన అనుభవం కోసం ఈ సారి కేంద్రమంత్రి పదవిని కూడా తీసుకున్నారని విశ్లేషకులు అంటున్నారు.
Tags:    

Similar News