ష్‌.. గప్‌ చుప్‌. ఆ ఒక్కటీ అడగొద్దు

Update: 2019-02-23 08:48 GMT
సమాచార హక్కు చట్టం వచ్చిన తర్వాత దేశంలో చాలా విషయాలు ప్రజలకు తెలుస్తున్నాయి. ఇంకా చెప్పాలంటే కొన్ని పెద్ద పెద్ద స్కామ్‌లు అన్నీ సమాచార హక్కు చట్టం వచ్చిన తర్వాతే బయటకు వచ్చాయి. అంతెందుకు తమ విలాసాల కోసం రాజకీయ నాయకుడు ప్రజాధనాన్నిఎలా దుర్వినియోగం చేస్తున్నారో కూడా రైట్ టు ఇన్‌ ఫర్మేషన్‌ యాక్ట్‌ వచ్చిన తర్వాతే బయటపడ్డాయి. అయితే.. ఇప్పుడు ఈ యాక్ట్‌ ని తనకు అనుకూలంగా మార్చుకున్నారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు.

 సమాచార హక్కు చట్టం కింద ఎవరు ఏ సమాచారం అడిగినా కచ్చితంగా ఇవ్వాల్సిందే. అయితే ఇక్కడే ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తన తెలివితేటల్ని ఉపయోగించారు. అమరావతి, దానికి సంబంధించి ల్యాండ్‌ పూలింగ్‌, ఏ భూమిని ఎవరెవరికి కేటాయించారు, ఏ ఏ నిష్పత్తుల్లో ఇచ్చారు, ఇందుకు సంబంధించిన జీవోలు అన్నీ సమాచార హక్కు చట్టం కింద రాకుండా ఆర్డర్‌ పాస్‌ చేశారు. ఇప్పటికే అమరావతి భూముల విషయంలో చాలా అవకతవకలు జరిగాయని ప్రతిపక్ష పార్టీలు ఆరోపిస్తున్నాయి. దాదాపు 1691 ఎకరాలు సింగపూర్‌ కంపెనీలకు బాబు ధారాదత్తం చేశారని వివిధ రకాల స్వచ్చంధ సంస్థలు కూడా ఇప్పటికీ విమర్శలు చేస్తున్నాయి. అన్నింటికి మించి రాజధాని చుట్టు పక్కల భూములన్నింటిని టీడీపీ నాయకులు కొనుక్కున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఇప్పుడు ఇవన్నీ ఎక్కడ బయటకు వస్తాయనో భయంతో.. విషయాలన్నీ బయటకు రాకుండా జీవో ఇచ్చారని విమర్శలు వస్తున్నాయి. అసలు అమరావతి రాజధాని విషయంలో ఏ అవకతవకలు - ఎలాంటి తప్పిదాలు లేనప్పుడు ఎందుకు సమాచార హక్కు చట్టంలో పెట్టలేదని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. మరి టీడీపీ నాయకులు - చంద్రబాబు నాయుడు దీనికి ఏ సమాధానం చెప్తారో చూడాలి.

   

Tags:    

Similar News