సజ్జన్.. కమల్ నాథ్.. జగదీశ్ టైట్లర్.. ఎవరైతేనేం?

Update: 2018-12-17 17:14 GMT
1984 సిక్కుల ఊచకోత కేసులో కాంగ్రెస్ సీనియర్ లీడర్ సజ్జన్ కుమార్‌కు జీవిత ఖైదు పడడం సంచలనంగా మారింది. 34 ఏళ్ల కిందటి ఈ కేసులో ఆలస్యంగానైనా న్యాయం దక్కిందని బాధితులు అంటున్నారు. అయితే... సిక్కుల ఊచకోత ఘటనలో శిక్ష పడిన సజ్జన్ కుమార్ కంటే పెద్ద పెద్ద కాంగ్రెస్ నేతల ప్రమేయం ఉందన్నది బహిరంగ రహస్యం. అంతేకాదు.. వారికి ముఖ్య పదవులూ దక్కుతుండడంతో ఎంతమందిని చంపితే కాంగ్రెస్‌లో అంత ప్రయారిటీ అన్నట్లుగా కనిపిస్తోంది.

ఇందిరాగాంధీని ఆమె సిక్కు అంగరక్షకులు హతమార్చిన తరువాత సిక్కులకు వ్యతిరేకంగా జరిగిన ఈ ఊచకోతలో సుమారు 3000 మంది చనిపోయారు. ఎందరో కాంగ్రెస్ నేతలు స్వయంగా అల్లరి మూకలను ముందుకు నడిపించడంతో పాటు మరికొందరు వారిని రెచ్చగొట్టి సిక్కులపై ఉసిగొల్పి ప్రాణాలు తీయించారన్న ఆరోపణలున్నాయి.

అలాంటి ఆరోపణలు ఎదుర్కొంటున్న పలువురు బడా నేతలు..

* కమల్ నాథ్: మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన మాజీ కేంద్ర మంత్రి, తొమ్మిది సార్ల ఎంపీ అయిన కమల్ నాథ్ సిక్కుల ఊచకోతలో పాత్రధారి అన్న ఆరోపణలున్నాయి. అల్లర్ల సమయంలో ఆయన స్వయంగా మూకలకు నాయకత్వం వహించారంటారు. సంజయ్ గాంధీకి క్లాస్ మేట్, సన్నిహితుడు అయిన కమల్ నాథ్ దిల్లీలోని గురుద్వారా రకబ్ గంజ్ సాహిబ్ వద్ద అల్లరి మూకలకు ఆయనే నాయకత్వం వహించినట్లు ప్రత్యక్ష సాక్షులు చెబతారు. అయితే, ఆయన, కాంగ్రెస్ పార్టీ ఈ ఆరోపణలను ఎప్పటికప్పుడు తిరస్కరిస్తున్నారు.
Read more!

* జగదీశ్ టైట్లర్: గురుద్వారా పూలబాంగష్ వద్ద ముగ్గురు సిక్కులను టైట్లర్ హతమార్చారన్న ఆరోపణలున్నాయి.  ఆయనెప్పుడూ దీన్ని ఖండిస్తుంటారు. అయితే, ఆ రోజు రాజీవ్ గాంధీ, తాను పరిస్థితిని అంచనా వేయడం కోసం దిల్లీలో తిరిగామని మాత్రం టైట్లర్ పలు సందర్భాల్లో అంగీకరించారు.

ఈ అల్లర్లపై విచారణ జరిపిన నానావతి కమిషన్ కూడా టైట్లర్‌కు అల్లర్లలో ప్రమేయం ఉందని గట్టిగా అనుమానించింది. కమిషన్‌కు టైట్లర్ పాత్రపై బలమైన ఆధారాలు లభించాయని చెబుతారు.

* హెచ్‌కేఎల్ భగత్: సిక్కుల ఊచకోతపై జరిగిన విచారణల్లో భగత్ పేరు ప్రధానంగా వినిపిస్తుంటుంది. ఆయన ఎన్నోసార్లు ఖండించినా కూడా ప్రత్యక్ష సాక్షులు మాత్రం ఆయన అల్లరి మూకలను ముందుండి నడిపించారనే చెబుతారు. భగత్ అల్లరి మూకలను రెచ్చగొట్టి తమ భర్తలను చంపించారని సత్నామీ భాయి, దర్శన్ కౌర్ అనే ఇద్దరు మహిళలు గతంలో సాక్షం చెప్పారు.

అయితే... 2005లో భగత్ అనారోగ్యంతో చనిపోయారు. 1991 తరువాత పార్టీలోనూ ఆయన ప్రాభవం తగ్గింది. అనంతరం అల్జీమర్స్‌కు గురికావడంతో భగత్ గతాన్ని మర్చిపోయారు కూడా.
4

* కెప్టెన్ భాగ్మల్: రిటైర్డ్ నేవీ అధికారి. ఈ కేసులో జీవిత ఖైదు పడింది. అయితే.. బెయిల్ పై బయటకొచ్చారు. వైద్య కారణాలతో గత ఏడాది బెయిల్ పొడిగించారు.

* గిరిధరి లాల్: ఈయన జీవిత ఖైదు అనుభవిస్తున్నారు.

* బల్వాన్ ఖోకర్: ఈయన కూడా జీవిత ఖైదు అనుభవిస్తున్నారు. దిల్లీలో ఒకప్పుడు కౌన్సిలర్‌గా పనిచేసిన ఆయన ముక్కు ఎముక విరిగిందన్న కారణంతో గత ఏడాది బెయిలు పిటిషన్ పెట్టుకోగా.. దిల్లీ హైకోర్టు తిరస్కరించింది.

* కిషన్ ఖోకర్: అల్లర్లలో ప్రమేయం ఉందన్న ఆరోపణలు రుజువై ఆయనకు 2013లో మూడేళ్ల శిక్ష పడింది. ఆ తరువాత శిక్షను పదేళ్లకు పెంచారు.

* మహేందర్ యాదవ్: గతంలో ఎమ్మెల్యేగా పనిచేసిన ఈయనకు కూడా 2013లో తొలుత మూడేళ్ల శిక్ష పడింది. అనంతరం దాన్ని పదేళ్లకు పెంచారు.
Tags:    

Similar News