ఓ స్త్రీ రేపు రా... ఈసారి అమెరికాలో అవతారం
అమెరికాలో హాలోవీన్ వేడుకలకు ఈసారి ఓ భారతీయ మహిళ కొత్త ఊపు తెచ్చింది.;
అమెరికాలో హాలోవీన్ వేడుకలకు ఈసారి ఓ భారతీయ మహిళ కొత్త ఊపు తెచ్చింది. ఇండియానా రాష్ట్రానికి చెందిన భారతీయ మూలాల మహిళ ఒకరు బాలీవుడ్ హారర్ టచ్‌తో భయానక వేషధారణలో అందరినీ ఆకట్టుకున్నారు. వెంపైర్లు, భూతాలు, మంత్రగత్తెల్లా మామూలు వేషాలు వేసుకున్నవారి మధ్య, ఆమె మాత్రం 2018లో విడుదలైన హిట్ హారర్ సినిమా ‘స్త్రీ’లో ఫ్లోరా సైనీ పోషించిన పాత్రను సజీవంగా మలిచింది.
ఎరుపు చీర కట్టుకుని, ముఖం కప్పుకుని, చేతిలో దీపం పట్టుకుని వీధిలో నెమ్మదిగా నడుస్తూ వచ్చిన ఆ యువతి వీడియో సోషల్ మీడియాలో క్షణాల్లో వైరల్ అయ్యింది. “ఓ స్త్రీ, రేపు రా!” అనే డైలాగ్‌ను గుర్తు చేసేలా ఆమె ప్రదర్శన హాలోవీన్‌లో ప్రత్యేక ఆకర్షణగా మారింది.
ఆ వీడియోలో ఆమె ఒక ఇంటి దగ్గరకు చేరి, అక్కడి నివాసులు సరదాగా చాక్లెట్లు ఇచ్చారు. ఆమె చాక్లెట్లు తీసుకుని ఏమీ మాట్లాడకుండా నెమ్మదిగా తిరిగి వెళ్లిపోవడం చూసి అందరూ ఆశ్చర్యపోయారు. ఆ మిస్టిక్ స్టైల్, నిశ్శబ్ద నడక హాలోవీన్ రాత్రికి ఓ భయానక మజిలీ ఇచ్చింది.
సోషల్ మీడియా రియాక్షన్స్
వీడియో వైరల్ కావడంతో నెటిజన్లు హాస్యంతో ప్రశంసలతో ముంచెత్తారు. భారతీయ సినీ ప్రేక్షకులకు సుపరిచితమైన ఈ పాత్ర అమెరికా వీధుల్లో కనిపించడంపై ఆనందం వ్యక్తం చేశారు. “అద్భుతం.. ఆమె హోవర్ బోర్డ్ మీద ఉన్నట్లైతే మరింత భయానకంగా కనిపించేది!” మరోకరు సరదాగా కామెంట్ చేశారు. “స్త్రీ అమెరికా చదువుల కోసం వెళ్లిందంట!” అంటే ఇంకో యూజర్ రాశారు “GOAT of all Halloween costumes!” అంటూ సెటైర్ వేశారు. “ఓ స్త్రీకి ఈ సారి H1B వీసా ఎటువంటి సమస్యలేకుండా వచ్చేసింది!” అంటూ కొందరు ప్రస్తుత సమస్యలను దృష్టి ఉంచుకొని నవ్వులు పూయించారు.
* గత సంవత్సరం కెనడాలో ‘స్త్రీ’ డెకర్ హంగామా
ఇది తొలిసారి కాదు. భారతీయ థీమ్‌తో కూడిన ఈ హాలోవీన్ వేడుకలు విదేశాల్లో అప్పుడప్పుడు వెలుగులోకి వస్తున్నాయి. గత సంవత్సరం 2024లో కెనడాలోని బ్రాంప్టన్‌లో నివసించే ఓ భారతీయ కుటుంబం తమ ఇంటిని “స్త్రీ” థీమ్‌తో అలంకరించి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఎరుపు చీర కట్టిన స్కెలెటన్‌ను ఇంటి ముందు నిలబెట్టి, కింద పెద్ద బ్యానర్‌లో “O Stree, Kal Aana” అని రాసి హాలోవీన్ డెకరేషన్‌గా ఉపయోగించారు. ఆ వీడియో కూడా అప్పట్లో వైరల్ అయింది.
‘స్త్రీ’ – బాలీవుడ్ హారర్ హిట్
దినేష్ విజన్ దర్శకత్వంలో వచ్చిన ‘స్త్రీ’ చిత్రంలో రాజ్‌కుమార్ రావు, శ్రద్ధా కపూర్, పంకజ్ త్రిపాఠి, అపర్షక్తి ఖురానా, అభిషేక్ బెనర్జీ ముఖ్య పాత్రల్లో నటించారు. భయానకమైనా సరదా మలుపులతో కూడిన ఆ చిత్రం భారతీయ సినీ ప్రేక్షకులను అలరించింది.
ఇప్పుడు అమెరికాలో హాలోవీన్ సందర్భంగా “స్త్రీ” మళ్లీ జీవం పొందింది. భయపెట్టడమే కాదు, నవ్వులు పంచే ఈ భారతీయ మహిళా సృజనాత్మకతకు సోషల్ మీడియా జేజేలు పలుకుతోంది.