అమెరికాలో భారతీయుడి నిర్లక్ష్యానికి గర్భవతి బలి: 100 మైళ్ల వేగంతో ఢీకొట్టిన రేంజ్ రోవర్.. 1 మిలియన్ డాలర్ల బెయిల్!

అమెరికాలో చోటుచేసుకున్న ఒక ఘోర రోడ్డు ప్రమాదం భారతీయులందరినీ తలవంచుకునేలా చేయడమే కాకుండా ఒక నిండు ప్రాణాన్ని, పుట్టబోయే బిడ్డను బలి తీసుకుంది.;

Update: 2026-04-01 13:30 GMT

అమెరికాలో చోటుచేసుకున్న ఒక ఘోర రోడ్డు ప్రమాదం భారతీయులందరినీ తలవంచుకునేలా చేయడమే కాకుండా ఒక నిండు ప్రాణాన్ని, పుట్టబోయే బిడ్డను బలి తీసుకుంది. భారత సంతతికి చెందిన ఒక వ్యక్తి చేసిన మితిమీరిన వేగం, నిర్లక్ష్యపు డ్రైవింగ్ కారణంగా 17 ఏళ్ల టీనేజ్ గర్భవతి ప్రాణాలు కోల్పోయిన ఈ విషాద ఘటన స్థానికంగా పెను కలకలం సృష్టించింది. ఈ కేసుకు సంబంధించి నిందితుడు తర్సేమ్ సింగ్‌పై అమెరికా న్యాయస్థానం పలు కఠినమైన ఫెలనీ కేసులు నమోదు చేసింది.

మృత్యు వేగంతో ప్రయాణం

పోలీసులు..అధికారుల నివేదికల ప్రకారం.. ఈ హృదయవిదారక ఘటన ఫిబ్రవరి నెలలో ఒహాయో రాష్ట్రంలో చోటుచేసుకుంది. నిందితుడు తర్సేమ్ సింగ్ తన ల్యాండ్ రోవర్ రేంజ్ రోవర్ వెలార్ కారులో అత్యంత వేగంగా వెళ్తుండటాన్ని గమనించిన పోలీసులు అతడిని ఆపేందుకు ప్రయత్నించారు. అయితే పోలీసుల హెచ్చరికలను ఏమాత్రం బేఖాతరు చేయడమే కాకుండా తన వాహన వేగాన్ని మరింత పెంచి తప్పించుకోవడానికి ప్రయత్నించాడు.

ఈ క్రమంలో సుమారు గంటకు 100 మైళ్ల వేగంతో మృత్యువులా దూసుకెళ్లిన అతని కారు, ఎదురుగా వస్తున్న జీప్ చెరోకీ వాహనాన్ని అత్యంత బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాద తీవ్రతకు జీప్‌లో ప్రయాణిస్తున్న 17 ఏళ్ల గర్భవతి అష్లీ హోమ్స్ వాహనం నుండి బయటకు ఎగిరిపడింది. తీవ్ర గాయాలైన ఆమె అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా ఆమె గర్భంలోని శిశువు కూడా ఈ లోకాన్ని చూడకుండానే కన్నుమూసింది. ఒకేసారి రెండు ప్రాణాలు గాలిలో కలిసిపోవడంతో బాధితురాలి కుటుంబంలో పెను విషాదం నెలకొంది.

న్యాయస్థానంలో విచారణ.. బెయిల్

ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన తర్సేమ్ సింగ్‌ను అధికారులు మియామీ వ్యాలీ ఆసుపత్రికి ఎయిర్‌లిఫ్ట్ చేసి ప్రాణాపాయం నుంచి తప్పించారు. కోలుకున్న వెంటనే పోలీసులు అతడిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు. ఈ దారుణ ఘటనపై అమెరికా ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ తీవ్రంగా స్పందించింది. ఒక వ్యక్తి నిర్లక్ష్యం వల్ల అమాయక ప్రాణాలు పోవడంపై తీవ్ర విచారం వ్యక్తం చేసింది.

ప్రస్తుతం కోర్టు ఈ కేసు విచారణను ఏప్రిల్ 3కు వాయిదా వేసింది. నిందితుడికి 1 మిలియన్ డాలర్ల (సుమారు 8.3 కోట్ల రూపాయలు) భారీ బెయిల్ మొత్తాన్ని కోర్టు నిర్ణయించింది. అయితే తర్సేమ్ సింగ్ తాను ఏ తప్పూ చేయలేదని ‘నాట్ గిల్టీ’ అని వాదిస్తుండటం గమనార్హం.

ముంచుకొస్తున్న బహిష్కరణ గండం

తర్సేమ్ సింగ్‌పై క్రిమినల్ కేసులతో పాటు ఇమ్మిగ్రేషన్ డిటైనర్ కూడా విధించబడింది. అంటే ఒకవేళ కోర్టులో అతడు దోషిగా తేలి, జైలు శిక్ష అనుభవించిన తర్వాత అతడిని అమెరికా నుండి శాశ్వతంగా బహిష్కరించి, స్వదేశానికి పంపించే అవకాశం ఉంది.

విదేశాల్లో నివసించే భారతీయులు ఆ దేశ ట్రాఫిక్ నిబంధనలను అతిక్రమిస్తే అది కేవలం జరిమానాలతో ముగియదు. ఇలాంటి తీవ్రమైన ప్రమాదాలు జరిగినప్పుడు వారి కెరీర్, వీసా హోదా , వ్యక్తిగత జీవితం సర్వనాశనం అవుతాయని ఈ ఘటన మరోసారి హెచ్చరిస్తోంది.

ఈ ఘటన అమెరికాలో రోడ్డు భద్రతపై అతి వేగం వల్ల కలిగే పరిణామాలపై పెద్ద ఎత్తున చర్చకు దారి తీసింది. అమాయక బాలిక మృతికి న్యాయం జరగాలని స్థానికులు కోరుతున్నారు. పోలీసులు సైతం వాహనదారులు వేగ పరిమితిని పాటించాలని లేని పక్షంలో ఇలాంటి మూల్యం చెల్లించాల్సి ఉంటుందని హెచ్చరిస్తున్నారు.

Tags:    

Similar News