అమెరికా కల… ఇప్పుడు “60 డేస్ బిగ్ బాస్ చాలెంజ్”

ఒకప్పుడు మన ఊర్లో ఎవడైనా “అమెరికా వెళ్లాడు” అంటే… వాడు లోకల్ సూపర్ స్టార్. ఇంట్లో ఫ్యామిలీ ఫంక్షన్ వస్తే వాడికి స్పెషల్ కుర్చీ, స్పెషల్ మర్యాదలు.

Update: 2026-05-21 09:21 GMT

ఒకప్పుడు మన ఊర్లో ఎవడైనా “అమెరికా వెళ్లాడు” అంటే… వాడు లోకల్ సూపర్ స్టార్. ఇంట్లో ఫ్యామిలీ ఫంక్షన్ వస్తే వాడికి స్పెషల్ కుర్చీ, స్పెషల్ మర్యాదలు. వాడి వాట్సాప్ స్టేటస్‌లో “స్టాట్యూ ఆఫ్ లిబర్టీ”.. లింక్డ్‌ఇన్‌లో “లివింగ్ ద డ్రీమ్” అంటూ బిల్డప్‌లు మామూలుగా ఉండేవి కావు. కానీ కట్ చేస్తే… ఇప్పుడు సీన్ రివర్స్ అయింది. హెచ్1బీ పుణ్యమా అని అమెరికా అనేది ఇప్పుడు “డ్రీమ్ ల్యాండ్” కాదు.. అంతకంటే ఘోరమైన “డెడ్‌లైన్ ల్యాండ్” లా మారిపోయింది!

ఏఐ అనే ‘కొత్త బాస్’… అల్గారిథమ్స్ కి దండాలు..

మార్కెట్లోకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనే కొత్త బాస్ వచ్చాక, కంపెనీల్లో రక్తమాంసాలున్న మనుషుల కంటే రాత్రింబగళ్లు పనిచేసే కోడింగ్ అల్గారిథమ్స్ కే ఎక్కువ గౌరవం పెరుగుతోంది. మెటా, అమెజాన్, ఒరాకిల్ లాంటి టెక్ దిగ్గజాలు “ఎఫిషియన్సీ” అనే ముద్దుపేరు పెట్టుకుని ఉద్యోగుల గుండెల్లో గుబులు పుట్టిస్తూ లంచ్ బాక్స్‌లు సర్దేస్తున్నాయి.

పూర్వం రోజుల్లో పొద్దున్నే మెయిల్ ఓపెన్ చేస్తే ‘శాలరీ హైక్’ లెటర్స్ వచ్చేవి. కానీ ఇప్పుడు డైరెక్ట్‌గా ‘లేఆఫ్’ లెటర్స్ దర్శనమిస్తున్నాయి. పరిస్థితి ఎలా తయారైందంటే… మేనేజర్ నుంచి “గుడ్ మార్నింగ్ టీం’’ అని మెసేజ్ వస్తే చాలు.. హెచ్1బీ టెకీలకి బీపీ, షుగర్లు ఒకేసారి షూటప్ అయిపోతున్నాయి!

60 రోజుల సస్పెన్స్ థ్రిల్లర్!

ఇక అసలు ట్విస్ట్ ఇక్కడే ఉంది. అదే… అమెరికా ఇమ్మిగ్రేషన్ రూల్స్ పెట్టే “60 డేస్ చాలెంజ్”. ఉద్యోగం పోయిందా… సరిగ్గా 60 రోజుల్లో కొత్తగా నిన్ను ఉద్ధరించే స్పానర్ కంపెనీ దొరకాలి. లేదంటే “థాంక్యూ ఫర్ విజిటింగ్ యూఎస్‌ఏ” అంటూ గెటప్ శ్రీను స్టైల్లో బ్యాగులు సర్దుకుని ఇండియా ఫ్లైట్ ఎక్కేయడమే! ఇన్నేళ్లు కష్టపడి కట్టుకున్న డ్రీమ్ హౌస్ ఈఎంఐలు.. కొన్న లగ్జరీ కార్లు, పిల్లల ఇంటర్నేషనల్ స్కూల్ ఫీజులు… అన్నీ ఒక్క ఈమెయిల్‌తో క్లైమాక్స్ లేని సస్పెన్స్ థ్రిల్లర్ సినిమా అయిపోతున్నాయి. లేఆఫ్స్. ఎఫ్వైఐ వెబ్ సైట్ డేటా ప్రకారం ఈ ఏడాది లేఆఫ్స్ గురైన టెక్ కంపెనీలు 144+గా ఉన్నాయి. ఉద్యోగాలు కోల్పోయిన టెక్ సిబ్బంది 1,00,000 పైనే.. దీంట్లో మన దేశీ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ల సంఖ్యే సింహభాగం అని వేరే చెప్పక్కర్లేదు..

సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ టు టూరిస్ట్… వయా ‘బిజినెస్ క్లాస్’!

ఈ 60 రోజుల గండం నుంచి గట్టెక్కడానికి మన దేశీ టెకీలు “టెంపరరీ సర్వైవల్ మోడ్” ఆన్ చేశారు. హెచ్-1బీ వీసా చెల్లిపోతుంటే దాన్ని కాస్తా బీ-2 విజిటర్ వీసాగా మార్చేసి ఇంకొన్ని నెలలు అమెరికాలోనే ‘నక్కి’ ఉండాలని ప్లాన్ చేస్తున్నారు. అంటే… నిన్నటివరకు సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ గా లక్షల జీతం సంపాదించి.. ఇవాళ టూరిస్ట్ గా మారి తిరగడానికి పైసల్లేకుండా ఉండడం అన్నమాట..

కానీ అక్కడ కూడా అమెరికా ఇమ్మిగ్రేషన్ అధికారులు సీఐడీ ఆఫీసర్లలా తయారయ్యారు. “ఎందుకు వచ్చావ్ .. బ్యాంక్ అకౌంట్లో ఎంత ఉంది? ఎవరి ఇంట్లో తింటావ్?” అంటూ ఐపీఎల్ ప్లేఆఫ్స్ క్వాలిఫికేషన్ కంటే టఫ్ ప్రశ్నలు అడుగుతున్నారు. వీసా అప్రూవల్ రావడం ఆర్సీబీ కప్ గెలవడం కంటే కష్టంగా మారింది!

ప్రత్యామ్నాయ ప్లాన్లు… అమెరికా వద్దు బాబోయ్ అనే స్థాయికి..

ఈ టెన్షన్లు తట్టుకోలేక మనోళ్లు రూటు మారుస్తున్నారు. మళ్లీ స్టూడెంట్ అవతారం ఎఫ్-1 వీసా తీసుకుంటున్నారు. పెళ్ళై, పిల్లలున్నా కూడా మళ్లీ కాలేజీ బ్యాగ్ తగిలించుకుని క్లాసులకి వెళుతున్నారు. నేను సాదాసీదా ఇంజనీర్ ని కాదు బాస్, నాలో ఎక్స్‌ట్రార్డినరీ టాలెంట్ ఉంది అని నిరూపించుకోవడానికి ఓ1 వీసా కోసం సర్కస్ ఫీట్లు చేస్తున్నారు. ఇంకొందరు నీ డాలర్లు వద్దు.. నీ ఇమ్మిగ్రేషన్ టెన్షన్లు వద్దు అంటూ కెనడా వైపు ‘ఎక్స్‌ప్రెస్ ఎంట్రీ’, ‘గ్లోబల్ టాలెంట్ స్ట్రీమ్’ అంటూ క్యూ కడుతున్నారు.

ఇదంతా చూస్తుంటే ఒక డౌట్ రాక మానదు… అమెరికాలో అసలు జాబ్ సెక్యూరిటీ మనుషులకా? లేక ఏఐ బాట్స్ కా? ఒకప్పుడు “కోడ్ రాస్తే కెరీర్ సెట్” అనేవాళ్లు. ఇప్పుడు “ఏఐ వాడకపోతే కెరీర్ అవుట్” అనే పరిస్థితి వచ్చింది.

మొత్తానికి… ‘అమెరికన్ డ్రీమ్’ కోసం ఫ్లైట్ ఎక్కిన మన భారతీయుల జీవితాలు ఇప్పుడు ఒక రియాలిటీ షోలా మారిపోయాయి. ప్రతి రోజు ఉదయం లేవగానే ఇన్బాక్స్ ఓపెన్ చేయడం అంటే… అది జీమెయిల్ ఓపెన్ చేయడం కాదు... గుండెకి ‘కార్డియాక్ అరెస్ట్’ టెస్ట్ చేసుకోవడమే.. స్టే ట్యూన్డ్ టెకీస్… ‘60 డేస్ చాలెంజ్’ లో ఈరోజు ఎవరు ఎలిమినేట్ అవుతారో చూడాలి మరి..

Tags:    

Similar News